TELANGANA POLITICS: తెలంగాణలో దూకుడుగా రెండు విపక్షాలు.. రాష్ట్రంపై మరింత ఫోకస్ చేస్తున్న జాతీయ పార్టీల అధినాయకత్వాలు
రాజకీయ చతురుడైన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వ్యూహాలు అనూహ్యంగా వుంటాయి కాబట్టి ఏ క్షణమైనా అసెంబ్లీ రద్దు చేసినఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ వుందని అంచనా వేస్తున్న రెండు విపక్ష పార్టీలు..
TELANGANA POLITICS TWO OPPOSITION PARTIES BJP CONGRESS HIGH-COMMANDS FOCUS: తెలంగాణలో విపక్షాల రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. రాజకీయ చతురుడైన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వ్యూహాలు అనూహ్యంగా వుంటాయి కాబట్టి ఏ క్షణమైనా అసెంబ్లీ రద్దు చేసినఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ వుందని అంచనా వేస్తున్న రెండు విపక్ష పార్టీలు.. దానికి అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పావులు కదుపుతున్నాయి. ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. వాటిని క్రమంగా అమలు చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అంశాలకు, నేతలకు పెద్ద పీట వేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యూహాల రూపకల్పనకు, భవిష్యత్తు కార్యాచరణకు చింతన్ శిబిర్ నిర్వహణకు రెడీ అయ్యారు. జూన్ 1,2 తేదీలలో తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహిస్తున్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఫండ్ రైజింగ్ పర్పస్‌లో అమెరికా పర్యటనకు వెళ్ళారు. ఇలా తెలంగాణలో ఏ క్షణమైనా అసెంబ్లీ రద్దు కాబోతోందని గట్టిగా విశ్వసిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు దానికి అనుగుణంగా అడుగులు వేగవంతం చేశారు.
కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మే 6,7 తేదీలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన తర్వాత తెలంగాణ నేతల్లో గణనీయమైన మార్పు వచ్చింది. వరంగల్ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. పార్టీ నేతలకు విస్పష్ట సందేశాన్నిచ్చారు. ప్రజలతో మమేకమవడం ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేయకుంటే పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాదని ఆయన కుండబద్దలు కొట్టారు. అదేసమయంలో టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో కలుస్తుందన్న సంకేతాలను ఆదిలోనే ఆయన తుంచేశారు. టీఆర్ఎస్ నేతల అవినీతిని నిలదీస్తామనడమే కాకుండా. . అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడుతున్న టీఆర్ఎస్ నేతలను వెంటపడి తరుముతామని కూడా ఆయన వెల్లడించారు. మరోవైపు ఎన్నికలకు చాలా ముందుగానే ఎన్నికల హామీలను ప్రజల ముందుంచేశారు రాహుల్ గాంధీ. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఎకరాకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం, సమంజసమైన కనీస మద్దతు ధర… వంటి ప్రజాకర్షక పథకాలను రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు తాయిలంగా ప్రకటించారు. ఓరకంగా చెప్పాలంటే ఈ మూడు హామీలకు మించి తాయిలాలను ఇవ్వాల్సిన పరిస్థితిని కల్పించారు రాహుల్ గాంధీ.
ఇక బీజేపీ నేతల్లో కూడా ఉత్సాహం ఇనుమడించింది. ఏప్రిల్, మే నెలల్లో టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో విడత ఉత్సాహభరితంగా కొనసాగింది. జాతీయ నేతలు అమిత్ షా, జెపీ నడ్డా, తరుణ్ చుగ్ సహా కొందరు కేంద్ర మంత్రులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొని బండి సంజయ్ వెన్ను తట్టారు. మే 5వ తేదీన జెపీ నడ్డా మహబూబ్‌నగర్ సమీపంలోని భూత్‌పూర్ సమీపంలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి పరాజయం తప్పదని ఆయనన్నారు. ఇక ప్రజా సంగ్రామ పాద యాత్ర ముగింపు సభకు హాజరయ్యారు హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు సమీపంలోని తుక్కుగూడ దగ్గర జరిగిన ఈ సభలో అమిత్ షా నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను ఓడించే సత్తా బండి సంజయ్‌కి వుందన్నారు. ఆ తర్వాాత కేవలం 11 రోజుల వ్యవధిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవానికి వచ్చిన ప్రధాన మంత్రి.. బేగంపేట ఏయిర్ పోర్టులో బీజేపీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణను సాధించింది.. మూడున్నర కోట్ల మంది ప్రజల కోసమని, కానీ టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తెచ్చింది కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే అన్నట్లుగా పరిస్థితి తయారైందని మోదీ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి లభించాలంటే బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ నేతల పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీ వర్గాల్లో నూతనోత్సాహం ఇనుమడించింది. అదే ఊపులో జూన్ మూడో వారంలో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రకు బండి సంజయ్ సిద్దమవుతున్నారు. యాదగిరి గుట్ట నుంచి పాదయాత్ర ప్రారంభించి ఓరుగల్లు భద్రకాళి మాత సన్నిధిలో ముగించాలని సంజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వంలో అందరిలో ఉత్సాహం నింపే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణకు చెందిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అగ్రవర్ణాలకు చెందిన వారు. బండి సంజయ్ మున్నూరు కాపు వ్యక్తిగా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. అదేసమయంలో తెలంగాణలో మరో కీలక నేత, ఓబీసీ విభాగానికి జాతీయ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న డా. కే.లక్ష్మణ్‌ను తాజాగా రాజ్యసభకు పంపాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. ఆయన్ను ఉత్తర్ ప్రదేశ్ నుంచి పెద్దల సభకు పంపబోతున్నారు. ఈ నిర్ణయం ద్వారా బీసీలకు బీజేపీ పెద్ద పీట వేస్తున్నట్లుగా ప్రజల్లోకి సంకేతాలు పంపడమే బీజేపీ జాతీయ నాయకత్వం ఉద్దేశమని తెలుస్తోంది. ఇలా తెలంగాణ విషయంలో రెండు జాతీయ పార్టీలు.. స్థానికంగా రెండు విపక్ష పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి.