TELANGANA BJP: తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం.. గుజరాత్, యుపీ ఫార్ములాతో గల్లీగల్లీకి కమలదళం.. నడ్డా నిర్దేశకత్వంతో దూకుడు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జులై 3వ తేదీన నిర్వహించిన బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్సవడంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కదనోత్సాహం నిండుకుంది. దానికి జాతీయ నాయకత్వం మార్గనిర్దేశకత్వం తోడవడంతో మరింత దూకుడు పెంచాలని తలపెట్టారు. ఇందుకోసం గుజరాత్, యుపీలలో మంచి ఫలితాల్నిచ్చిన ఓ విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని నిర్ణయించింది కమలదళం.

TELANGANA BJP: తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం.. గుజరాత్, యుపీ ఫార్ములాతో గల్లీగల్లీకి కమలదళం.. నడ్డా నిర్దేశకత్వంతో దూకుడు
Bjp
Rajesh Sharma

|

Jul 05, 2022 | 5:55 PM

TELANGANA BJP IMPLEMENTING NEW FORMULA OF GUJARAT AND UP: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సహా యావత్ భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) జాతీయ నాయకత్వం పర్యటించి వెళ్ళిన దరిమిలా తెలంగాణ బీజేపీ నేతలు తమ కార్యాచరణలో దూకుడు పెంచారు. తెలంగాణలో అధికారం చేపట్టే లక్ష్యంతో ఇక్కడ పొలిటికల్ హీట్ పెంచేలా వ్యూహాత్మకంగా సాగుతున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇటీవల హైదరాబాద్ (Hyderabad) వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాన్ని హంగు ఆర్భాటాలతో నిర్వహించింది. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ముగింపుగా సికింద్రాబాద్ (Secunderabad) పరేడ్ గ్రౌండ్స్‌ (Parade Grounds) లో నిర్వహించిన భారీ బహిరంగ సభ కనీవిని ఎరుగని రీతిలో సక్సెస్ అవడంతో బీజేపీ రాష్ట్రనాయకత్వంలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. వేదికనెక్కిన వెంటనే ప్రధాని మోదీ సభకు హాజరైన పార్టీ శ్రేణులు, ప్రజలను చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. పక్కనే వున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)కు జనాన్ని చూపిస్తూ తొలుత హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తనకు ఎడమ పక్కన వున్న టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ (Bandi Sanjay Kumar) భుజంపై చరిచి మరీ అభినందించారు. మోదీని ప్రసన్నం చేసుకునే స్థాయిలో జనసమీకరణ చేసిన పార్టీ శ్రేణులను యావత్ జాతీయ నాయకత్వం అభినందించింది. విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో తెలంగాణ బీజేపీ నేతలు తదుపరి కార్యాచరణ ప్రారంభించారు. నిజానికి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే బీజేపీ తెలంగాణలో నియోజకవర్గం స్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేయడంతోపాటు పార్టీశ్రేణులు, పార్టీ పట్ల ఆసక్తి ప్రదర్శించే వారితో భేటీ అయ్యేందుకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 119 మంది జాతీయ ప్రతినిధులను పంపించింది. ఆయా నియోజకవర్గాలలో వున్న జనాభాలో ప్రభావిత కులాలను పరిగణనలోకి తీసుకుని మరీ ఈ జాతీయ ప్రతినిధులను ఎంపిక చేసింది బీజేపీ అధినాయకత్వం (BJP Highcommand). ఉదాహరణకు ఈశాన్య భారత రాష్ట్రాలకు చెందిన ప్రజలు అధికంగా వున్న ఏరియాకు కేంద్ర మంత్రి కిరణ్ రిజీజు (Kiran Rijiju) వంటి వారిని పంపారు. దీని ద్వారా ఆయా ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన వారిని బీజేపీ పట్ల ఆకర్షితులయ్యేలా బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఇలా పర్యటించి వచ్చిన జాతీయ ప్రతినిధుల నివేదికలను రెండ్రోజుల నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో క్రోఢీకరించారు. ఆ తర్వాత 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటిని పూర్తి చేయాల్సిన టాస్క్‌లను రాష్ట్ర నాయకత్వానికి అప్పగించారు. దానికి అనుగుణంగా చర్యలకు ఉపక్రమించారు తెలంగాణ బీజేపీ నేతలు.

Hyderabad వేదికగా నిర్వహించిన విజయ సంకల్ప సభ కోసం జనసమీకరణకు రాష్ట్ర నాయకత్వం అనుసరించిన విధానాన్నే వచ్చే ఎన్నికల దాకా కొనసాగించాలని నడ్డా నాయకత్వం సంజయ్ దళానికి నిర్దేశించింది. గతంలో బీజేపీ నాయకత్వం జిల్లాలను ఓ యూనిట్‌గా కార్యాచరణ అమలు చేసి, దానికి అనుగుణంగా ఫీడ్ బ్యాక్ తీసుకునే వారు.. కానీ విజయ సంకల్ప సభకు జరిపిన జనసమీకరణకు మాత్రం నియోజకవర్గాల వారీగా బాధ్యతలను అప్పగించారు. సెగ్మెంట్ల వారీగా తరలించాల్సిన సంఖ్యను నిర్దేశించారు. దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులు స్పందించడం వల్లనే పరేడ్ గ్రౌండ్స్ కిక్కిరిసి పోయేలా జనం తరలి వచ్చారు. దీనిని గ్రహించిన పార్టీ అధినాయకత్వం.. ఇకపై కూడా జిల్లాను ఓ యూనిట్‌గా తీసుకోకుండా.. నియోజకవర్గాన్ని ఓ యూనిట్‌గా కార్యాచరణ కొనసాగించాలని నిర్దేశించినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు పార్టీ శ్రేణులు వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఇంఛార్జీలను నియమించనున్నారు. వీరిలో ఒకరు జాతీయ స్థాయి నుంచి ఒకరు రాష్ట్ర స్థాయి నుంచి వుండేలా ప్లాన్ చేస్తున్నారు. నియోజకవర్గాల బాధ్యతలను సీనియర్ నేతలు సమన్వయ పరిచేలా చూస్తున్నారు. అదేసమయంలో నియోజకవర్గాల లెవెల్లో బీజేపీ యాక్టివ్‌గా వున్న చాలా చోట్ల పార్టీ అనుబంధ మోర్చాలు నామమాత్రంగా వున్న విషయాన్ని గుర్తించి.. వాటిని యాక్టివేట్ చేసేలా కార్యాచరణ రెడీ చేస్తోంది రాష్ట్ర నాయకత్వం. వచ్చే కొన్ని నెలల్లో గత ఎనిమిదేళ్ళలో కేసీఆర్ ఇచ్చిన హామీలు, వాటిని ఏ మేరకు అమలుచేశారు.. ఎన్నింటిని విస్మరించారు.. ఇలాంటి అంశాలపై నియోజకవర్గ ఇంఛార్జీలకు, మోర్చాల ప్రతినిధులకు అవగాహన కల్పించి.. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ర్యాలీలు నిర్వహించాలని ఆదేశాలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపైయ విస్తృతంగా ప్రచారం చేయాలని తలపెట్టారు. ఇదేసమయంలో పార్టీకి ధీటైన అభ్యర్థులు లేని నియోజకవర్గాలలో ఇతర పార్టీల నేతలకు గాలమేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని రెడీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకగా ఓ కమిటీని నియమించాలని తలపెట్టారు. ఈ కమిటీకి హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etala Rajendar) కన్వీనర్‌గా వ్యవహరించబోతున్నారు. చేరికల కమిటీకి ఈటల సారథ్యం వహించనుండగా.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna), రాజ్యసభ సభ్యుడు డా.కే. లక్ష్మణ్ (Dr K Laxman), నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy), మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు (Garikapati Mohan Rao), మాజీ మంత్రి చంద్రశేఖర్ (Chandra Shekhar), మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Visweswar Reddy), బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ (Dugyala Pradeep) సభ్యులుగా వుంటారు. స్థానికంగా ప్రజాదరణ వున్న నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకోవడమే లక్ష్యంగా ఈటల కమిటీ ఏర్పాటైంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటూ వేరే నియోజకవర్గానికి ఇంఛార్జిలుగా వున్న వారిని తప్పించనున్నారు. వీరి స్థానంలో స్థానికులకుగానీ, రాష్ట్ర స్థాయి నాయకులకుగానీ ఇంఛార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. గుజరాత్, యూపీలలో సక్సెస్ అయిన పన్నా ప్రముఖ్ (Panna Pramukh) ఫార్ములాను తెలంగాణలో అమలు చేస్తారని తెలుస్తోంది. అంటే పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాలో నిర్దిష్ట సంఖ్యకు ఒకరి చొప్పున ప్రముఖ్‌లను నియమించడం, వారు తమ జాబితాలో వున్న ఓటర్లను నిరంతరం కలుస్తూ వుండడం అనేది పన్నా ప్రముఖ్ వ్యూహం. ఇది గుజరాత్, యుపీలలో విజయవంతం కావడంతో ఇక్కడ కూడా అమలు చేయాలని తలపెట్టినట్లు సమాచారం. మరోవైపు క్రియాశీలకంగా లేని మోర్చాల కన్వీనర్లను మార్చి.. కొత్త వారికి, ఉత్సాహవంతులకు అవకాశం కల్పించాలని అమిత్ షా, నడ్డా టీ.బీజేపీ నాయకత్వానికి సూచించారు. రెండ్రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత జులై నాలుగో తేదీన కూడా హైదరాబాద్‌లోనే వున్న జేపీ నడ్డా.. సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఎన్.ఈ.సీ. తీర్మానాలను వారికి తెలిపి తదనుగుణంగా కార్యాచరణతో ముందుకెళ్ళాలని నిర్దేశించారు. నల్గొండ (Nalgonda), మహబూబ్‌నగర్ (Mahbubnagar) ఉమ్మడి జిల్లాలకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ (TRS) కీలక నేతలు తెలంగాణ నాయకత్వం టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం (Khammam), నల్గొండ జిల్లాల్లో బీజేపీకి అభ్యర్థుల కొరత ఎదురయ్యే పరిస్థితి వుందని అంఛనా వేస్తూ ఆయా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చేరికలుండాలని ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. ఇంకోవైపు జూన్ నాలుగో వారంలో ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతకు బండి సంజయ్ కుమార్ సమాయత్తమవుతున్నారు. జులై 5వ తేదీన జరగనున్న బీజేపీ రాష్ట్ర పదాధికారుల భేటీలో ఈ పర్యటనకు ఓ రూపు రానున్నది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu