Presidential Election 2022: ఎన్డీయే మాస్టర్ ప్లాన్.. ఇరకాటంలో దీది.. యశ్వంత్ సిన్హా పరిస్థితి ఏంటో మరి..!

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్ష, తటస్థ రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు..

Presidential Election 2022: ఎన్డీయే మాస్టర్ ప్లాన్.. ఇరకాటంలో దీది.. యశ్వంత్ సిన్హా పరిస్థితి ఏంటో మరి..!
Mamata Banerjee
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 05, 2022 | 1:23 PM

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్ష, తటస్థ రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు నడుం బిగించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రస్తుతం ఇరకాటంలో పడ్డారు. అందుక్కారణం భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన ఆదివాసీ అభ్యర్థి ద్రౌపది ముర్ము. నిజానికి ప్రతిపక్షాలకు ఉమ్మడి అభ్యర్థిని అందించిన మమతకు బిత్తరపోయే పరిస్థితి ఎదురైంది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండేందుకు శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ వంటివారు నిరాకరించడంతో తన పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు యశ్వంత్ సిన్హాను పార్టీకి రాజీనామా చేయించి మరీ ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టారు. ప్రతిపక్షాలు సైతం ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఆయన్ను ఆమోదించాయి. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో, ఎన్డీయే కూటమికి గట్టి పోటీ తప్పదనుకుంటున్న సమయంలో.. కమళనాథులు వేసిన ఎత్తుగడ చివరకు ఫైర్ బ్రాండ్ మమత బెనర్జీనే తీవ్ర ఇరకాటంలో పడేసింది. 75 వసంతాల స్వతంత్ర భారతావనిలో ఇంతవరకు అత్యున్నత రాజ్యాంగ పదవిలో కూర్చునే అదృష్టానికి నోచుకోని గిరిజన వర్గానికి కమలనాథులు అవకాశం కల్పిస్తే.. ఈ చర్యను అటు సమర్థించలేక, ఇటు వ్యతిరేకించలేక మమత బెనర్జీ సతమతమవుతున్నారు.

కిం కర్తవ్యం? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 12 లోక్‌సభ నియోజకవర్గాలు, 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆదివాసీ-గిరిజన జనాభా ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. ఇంకా చెప్పాలంటే నిర్ణయాత్మక శక్తిగా ఉంది. ఇలాంటప్పుడు ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం అంటే ఈ నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆశలు వదిలేసుకోవాల్సిందే. అలాగని జాతీయ పార్టీ కాంగ్రెస్ కంటే ముందే ప్రతిపక్షాలన్నింటినీ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశపర్చిన దీదీ, ఇప్పుడు తాను మాటమార్చలేని పరిస్థితి. అందుకే ఇప్పుడు నిందను అధికార కూటమి మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నాయకత్వం ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వం గురించి ముందే చెప్పి ఉంటే రాజకీయపక్షాల మధ్య ఏకాభిప్రాయం వచ్చి ఉండేదని మమత ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు.

గిరిజన ఓటు ఎంత ముఖ్యం? తన ఓటు ముర్ముకా.. సిన్హాకా అన్న విషయం కేవలం రాష్ట్రపతి ఎన్నికలతో ముగిసిపోయేది కాదు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనా దీని ప్రభావం చాలా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 5.8 శాతం ఉన్న గిరిజనులు ఇప్పుడు 8 శాతానికి చేరుకుంటారన్న అంచనాలున్నాయి. ఇక కొన్ని నియోజకవర్గాల్లో 25 శాతం వరకు ఉన్నారు. గిరిజనుల్లో అత్యధికంగా 80 శాతం సంతాల్ తెగకు చెందినవారే. ద్రౌపది ముర్ము కూడా సంతాల్ తెగకు చెందిన ఆదివాసీ మహిళ అన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

జార్ఖండ్ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న బెంగాల్‌లోని జంగల్ మహల్ ప్రాంతంలో గిరిజన జనాభా ఎక్కువ సంఖ్యలో ఉంది. ఇక్కడున్న 4 పార్లమెంట్ స్థానాలు (బంకురా, పురూలియా, వెస్ట్ మిడ్నాపూర్, ఝార్గ్రాం) జంగల్ మహల్‌లో భాగంగా ఉన్నాయి. అలాగే బెంగాల్ ఉత్తర భాగంలోని 8 లోక్‌సభ నియోజకవర్గాలు (డార్జీలింగ్, కాలింపోంగ్, అలీపూర్‌దువార్, జల్పాయ్‌గురి, కూచ్ బెహార్, నార్త్ దినాపూర్, సౌత్ దినాపూర్, మాల్దా) కూడా ఎక్కువ సంఖ్యలో గిరిజన జనాభా కలిగి ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 42 నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపొందిన 18 నియోజకవర్గాలు ఈ రెండు ప్రాంతాల్లోనివే కావడం గమనార్హం.

బెంగాల్ రాష్ట్రాన్ని దాటి ఢిల్లీ పీఠంపై కన్నేసిన తృణమూల్ అధినేత్రి సొంత రాష్ట్రంలోనే గిరిజన ఓటర్లను దూరం చేసుకునే రిస్క్ చేయలేకపోతున్నారు. సొంత రాష్ట్రంలో ఎక్కువ సీట్లలో గెలుపొందినప్పుడే ఢిల్లీ పీఠం కోసం రాజకీయం చేయడానికి వీలు కల్గుతుందన్న విషయం ఆమెకు తెలుసు. ఇప్పటికే ట్రైబల్ ఎక్కువగా ఉన్న ఉత్తర బెంగాల్‌ను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న గట్టి డిమాండ్ నేపథ్యంలో ఆమె గిరిజన ఓటుతో రిస్క్ చేయాలనుకోవడం లేదు.

విపక్షాలందరిదీ దాదాపు ఇదే పరిస్థితి.. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత, కొన్ని గంటల వ్యవధిలో ఎన్డీయే కూటమి అభ్యర్థిని ఖరారు చేయడంతో ప్రతిపక్షాలకు మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. అయితే విపక్ష కూటమి సమావేశానికి హాజరైన పార్టీల్లో మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జేడీ(ఎస్), జార్ఖండ్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న జేఎంఎం తమ వైఖరిని మార్చుకుని ద్రౌపది ముర్ముకే తమ ఓటు అని ప్రకటించాయి. అధికార, విపక్ష కూటముల్లో ఎందులోనూ లేని వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్ (బీజేడీ), శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు సైతం ముర్ముకే తమ ఓటు అని తేల్చి చెప్పాయి. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్ వంటి రాష్ట్రంలో ఆ ఓటర్లను దూరం చేసుకోవడం అంటే ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. అందుకే జేఎంఎం ముర్ము అభ్యర్థిత్వానికే తమ ఓటు అని తేల్చి చెప్పింది.

పైకి చెప్పకపోయినా కాంగ్రెస్ పార్టీది కూడా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చిన రాష్ట్రాల్లో రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో గిరిజన జనాభా మిగతా రాష్ట్రాలతో పోల్చిచూస్తే ఎక్కువగానే ఉంది. అలాగే ఆ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న మధ్యప్రదేశ్, అధికార కూటమిలో భాగమైన జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ గిరిజన ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఒడిశా, బెంగాల్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర గిరిజన ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ బలమైన పార్టీగా ఉంది. ఇప్పుడు ముర్ము అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం ద్వారా ఆ పార్టీ దేశవ్యాప్తంగా ఇన్ని రాష్ట్రాల్లో గిరిజన వ్యతిరేక ముద్రను మీద వేసుకోవాల్సి వస్తోంది. పైగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లో అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్, దళితులకు రాష్ట్రపతి అవకాశాన్ని ఇచ్చింది కానీ గిరిజనులకు ఇవ్వలేదు. ఇవన్నీ బీజేపీ ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటుందనడంలో సందేహం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..