న్యూ ఇయర్‌ రోజున అక్కడ కిటికీల్లోంచి కుర్చీలను బయటకు విసిరేస్తారట! మరో చోట కుర్చీ నుంచి కిందకు దూకుతారట!

New Year Celebrations in World: గతించిన ఏడాదిలోని మధుర స్మృతులను మననం చేసుకుంటూ.. చేదు అనుభవాలను తుడిచేసుకుంటూ కొద్ది గంటల్లో కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం..

న్యూ ఇయర్‌ రోజున అక్కడ కిటికీల్లోంచి కుర్చీలను బయటకు విసిరేస్తారట! మరో చోట కుర్చీ నుంచి కిందకు దూకుతారట!
New Year Celebrations
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 30, 2021 | 11:24 AM

World wide New Year Celebrations: జనవరి ఫస్ట్‌ మన సంప్రదాయమా..? కాదా..? అన్నది పక్కన పెడితే.. కొత్త ఆశలతో.. సరికొత్త ఆకాంక్షలతో.. కొంగొత్త కోరికలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకడం మనకు అలవాటయ్యింది.. గుళ్లకు వెళ్లి దండంపెట్టుకోవడమూ పరిపాటిగా మారింది.. ఏదేమైనా గతించిన ఏడాదిలోని మధుర స్మృతులను మననం చేసుకుంటూ.. చేదు అనుభవాలను తుడిచేసుకుంటూ కొద్ది గంటల్లో కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం.. జనవరి ఫస్టయినా.. ఉగాది అయినా.. తమిళుల పుత్తాండు అయినా అదో వేడుక! ఎందుకంటే గతించిన కాలం కంటే భవిష్యత్తు మనకు బంగారుబాటలు వేస్తుందన్న నమ్మకం! ఆ విశ్వాసంతోనే మనం కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలుకుతాం! అయితే, ఇంతేసి గ్రాండ్‌గా అందరూ న్యూఇయర్‌కు వెల్కమ్‌ చెబుతారనుకోడానికి లేదు.. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది..! ఎవరి సెంటిమెంట్లు వారివి మరి!

గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్‌.. కొత్త ఏడాది మంచి చేస్తుందని.. మన జీవితాలు సుఖమయమవుతాయని ఆశ! ఆ చిగురంత ఆశతోనే జగమంతా వేడుక చేసుకుంటుంది.. అయితే ప్రపంచమంతా ఇట్టాగే జరుపుకుంటుందని కాదు! ఒక్కో దేశపు ప్రజలు ఒక్కో తీరుగా జరుపుకుంటారు.. ఎవరి ఆచారాలు వారివి ! ఎవరి సంప్రదాయాలు వారివి! కొన్ని ఫన్నీగా ఉంటాయి.. కొన్ని వింతగొలుపుతాయి.. కొన్నేమో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. ఆ మాటకొస్తే కొన్ని దేశాలైతే జనవరి ఒకటిని న్యూ ఇయర్‌గానే గుర్తించవు.. చైనా…కొరియా.. సౌదీ అరేబియా… ఇజ్రాయెల్‌.. వియత్నాం దేశాలలో జనవరి ఫస్ట్‌న వేడుకలు గట్రాలు అస్సలుండవు.. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ న్యూ ఇయర్‌ వేడుకలు జరుగుతాయి.

ఆఫ్రికన్లు అయిన జీమా (Nzema) జాతి ప్రజలు జరుపుకునే న్యూ ఇయర్‌ వేడుకలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.. వీరి కొత్త సంవత్సరం జనవరిలో మొదలవ్వదు.. వీరి ఆకన్‌ క్యాలెండర్‌ ప్రకారం అక్టోబర్‌…నవంబర్‌ మాసాల్లో కొత్త సంవత్సరం వస్తుంది.. ఈ సందర్భంగా న్యూ ఇయర్‌ ఉత్సవాలను రెండు వారాల పాటు జరుపుకుంటారు..ఈ ఉత్సవాల సమయంలో ఏ పనీ చేయరు.. ఆఖరికి వ్యవసాయ పనులకు కూడా బ్రేక్‌ ఇస్తారు.. పెళ్లిళ్లు వంటి శుభకార్యక్రమాలను పోస్ట్‌పోన్‌ చేసుకుంటారు.. ఎందుకంటే వేడుకల్లో అందరూ పాల్గొనాలిగా..!

New Year

New Year

జీమాలది ప్రత్యేకమైన తెగ! జీమాలు ఎంతో మంది లేరు.. ఓ మూడున్నర లక్షల మంది ఉంటారంతే..! ఇందులో రెండున్నర లక్షలమంది ఘనాలోనే నివసిస్తున్నారు. మిగిలినవాళ్లు ఐవరీ కోస్టులో ఉంటున్నారు.. వీరు మాట్లాడే జీమా భాష కారణంగా వీరికి అప్పోలులు అనే పేరు వచ్చింది.. వ్యవసాయం వీరి ప్రధానవృత్తి. వీరు జరుపుకునే కొత్త సంవత్సరం వేడుకలను అబిస్సా ఉత్సవంగా పిలుచుకుంటారు.. ఈ వేడుకలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.. కొత్త ఏడాదికి స్వాగతం పలకడం కాదు …గడిచిపోయిన కాలంలో ఘనంగా జరిగిన రోజులను తల్చుకునే ఉత్సవమిది! చేదు అనుభవాలను నెమరేసుకునే వేడుక కూడా ఇదే! అసలు అబిస్సా అంటేనే ప్రశ్న! పోయిన ఏడాదిలో సాధించిందేమిటో తమకు తాముగా ప్రశ్నించుకోవడమే ఈ వేడుకల ఉద్దేశం! ఇక ఆ రోజున వీధులన్నీ జనసందోహంతో నిండిపోతాయి.. సంప్రదాయ నృత్యాలతో కొత్త కళను సంతరించుకుంటాయి.. పక్షం రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ఒక్క రోజున ఒక్క విధంగా జరుపుకుంటారు. ఏడు తరాలకు చెందిన పెద్దలను స్మరించుకుంటారు.. జీమాల దేవత న్యామిని! ఉత్సవాలలో భాగంగా ఆ దేవిని దర్శించుకుంటారు. ఈ ఉత్సవాలలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఆడవాళ్లు మగవాళ్ల దుస్తులు ధరించడం… మగవాళ్లు ఆడవాళ్లలా తయారవ్వడం…

New Year Fest

New Year Fest

అన్నింటికంటే గొప్ప విషయమేమిటంటే …వీరిది మాతృస్వామ్య వ్యవస్థ.. మాతృమూర్తి చెప్పిన మాటను వినాల్సిందే! ఆమె నుంచే బిడ్డలకు ఆస్తిపాస్తులు గట్రాలు వారసత్వంగా వస్తాయి.. ఉత్సవాల్లో భాగంగా అవతలివాళ్లను ఇష్టం వచ్చినట్టుగా తిట్టేస్తారు.. మామూలుగా కాదు.. బండబూతులు.. అదో సరదా ప్లస్‌ సంప్రదాయం వారికి! ఉత్సవాల చివరి రోజున ఉదయం ఓ ప్రశ్నతో ప్రీస్టు దగ్గరకు వెళతారు.. కొత్త ఏడాదిలో అడుగుపెట్టడానికి తాము అర్హులమేనా..? అన్నదే ఆ ప్రశ్న! ప్రీస్టు గోఅహెడ్‌ అనగానే అందరూ ఆనందంగా పరస్పరం అభినందించుకుని ఇళ్లకు వెళతారు.. జీమాలు జరుపుకునే కొత్త సంవత్సరం వేడుకల కథాకమామిషు ఇది!

ఇంతకు ముందు చెప్పుకున్నట్టు న్యూ ఇయర్‌ వేడుకలు అన్ని చోట్లా ఒక్కలా ఉండవు.. ఐర్లాండ్‌లో బ్రెడ్లను గోడలకేసి కొడతారు.. జొహన్నెస్‌బర్గ్‌లో కిటికీల్లోంచి కుర్చీలు బయటకు విసిరేస్తారు.. సైబీరియాలో మొక్కను చేతిలో పెట్టుకుని గడ్డకట్టిన సరస్సులో దూకుతారు.. స్కాట్లాండ్‌లో ఫైర్‌బాల్స్‌ మధ్య పరుగెత్తుతారు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం.. ఒక్కో ఆచారం.. ఇథియోపియా వాళ్లు కూడా జనవరి ఫస్ట్‌న న్యూఇయర్‌ జరుపుకోరు…గమ్మత్తేమిటంటే ప్రపంచంలోని అన్ని దేశాలు 2022లోకి ఎంటరవుతే… ఇథియోపియా మాత్రం ఇంకా 2016లోనే ఉంది.. దానికో కారణం ఉంది.. ఇథియోపియా క్యాలెండర్‌లో మనలా 12 నెలలు ఉండవు.. వారికో నెల ఎక్స్‌ట్రాగా ఉంటుంది.. పన్నెండు నెలలలో ఒక్కో నెలలో 30 రోజులుంటాయి.. పదమూడో నెలలో అయిదు రోజులు మాత్రమే ఉంటాయి.. అదే లీపు సంవత్సరంలో మాత్రం ఆరు రోజులు ఉంటాయి.. సెప్టెంబర్‌ 11న ఇథియోపియా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుంది.. అదే లీపు సంవత్సరం ముందు ఏడాది అయితే 12న న్యూ ఇయర్‌ జరుపుకుంటారు!

ఇక రష్యాలోఅయితే న్యూ ఇయర్‌ వేడుకలను రెండు సార్లు జరుపుకుంటారు.. మామూలుగా జనవరి ఫస్ట్‌న జరుపుకునే వేడుకలు సరేసరి! ఇక రెండో కొత్త సంవత్సర ఆరంభాన్ని జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం జనవరి 14న జరుపుకుంటారు.. అంటే పదిహేను రోజుల గ్యాపులోనే రెండుసార్లన్నమాట! ఇక స్వీడన్‌…ఫిన్లాండ్‌ దేశాల ప్రజలకు కూడా న్యూ ఇయర్‌ను రెండుసార్లు జరుపుకునే మహాద్భుతమైన అవకాశం ఉంటుంది.. విషయానికి వస్తే… స్వీడన్‌-ఫిన్లాండ్‌ దేశాలను మ్యూనియో నది విభజిస్తుంది.. ఫిన్లాండ్‌వైపు ఉన్న నగరం కారెసువాంటో…. అదే స్వీడన్‌వైపు ఉన్న నగరం కారెసువాండో… పేర్లు కూడా దాదాపు ఒక్కలాగే ఉన్నాయి కదూ! స్వీడన్‌ కంటే ఫిన్లాండ్‌ సమయం గంట ముందుంటుంది! ఫిన్లాండ్‌లో 2022 న్యూ ఇయర్‌కు వెల్కమ్‌ చెప్పి… ఆ తర్వాత ఓ పావుగంట వంతెన మీద నడిచి స్వీడన్‌కు చేరుకోవచ్చు.. అక్కడ మళ్లీ 2022కి వెల్కమ్‌ చెప్పవచ్చు… రెండు దేశాలలో చాలామంది ఇట్టాగే చేస్తారు..! అలాగే స్పెయిన్‌-పోర్చుగల్‌ మధ్య కూడా టైమ్‌లో వన్‌ అవర్‌ తేడా ఉంటుంది.. స్పెయిన్‌లో న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పి …గ్వాడియానా నదిని దాటేసి 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే పోర్చుగల్‌లో మరోసారి కొత్త సంవత్సర ఆగమనాన్ని అస్వాదించవచ్చు..

డెన్మార్క్‌లో కొందరు న్యూ ఇయర్‌ రోజున విచిత్రంగా బిహేవ్‌ చేస్తారు.. చైర్‌ మీదకెక్కి కిందకు దూకుతుంటారు.. సరదా అనుకునేరు.. తమ క్షేమం కోసమే అలా చేస్తారు.. ఎందుకంటే కుర్చీ నుంచి కిందకు దూకితే దుష్టశక్తులు దగ్గరకు రావడానికి భయపడతాయట! అట్టాగే ఇంట్లో ఉన్న పింగాణి ప్లేట్లను పగులగొట్టేసి… ఆ ముక్కలన్నింటినీ పక్కింటి ముందు పారేస్తారట! ఎందుకలా అంటే… సేమ్‌ రీజన్‌….! ఆ పగుళ్ల చప్పుళ్లకు దుష్టశక్తులు పారిపోతాయట!

ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో ఇంట్లో ఉన్న పాత ఫర్నీచర్‌ను అంతా బయటపడేస్తారు.. థాయ్‌లాండ్‌లో అయితే బకెట్‌లతో నీటిని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు.. శరీరమంతా పౌడర్‌.. బూడిద పూసుకుంటారు.. రుమేనియాలో మరీ విచిత్రం! న్యూ ఇయర్‌ రోజున ఆవులతో ముచ్చటిస్తే ఆ ఏడాదంతా విజయాలే వరిస్తాయన్నది అక్కడి ప్రజల నమ్మకం..

New Year Cele

New Year Cele

నమ్మకాలపై బోలెడన్ని లెక్చర్లు దంచే ఇంగ్లాండ్‌లోనూ నమ్మకాలున్నాయి.. జనవరి ఫస్ట్‌న ఇంటికొచ్చే తొలి అతిథి తమకు గిఫ్ట్‌లు తేవాలని కోరుకుంటారు. అదో ట్రేడిషన్‌ కాబట్టి వచ్చేవారు కూడా కానుకలు తెస్తారు.. ఇలా గిఫ్టులు తెచ్చేవారు ఫ్రంట్‌డోరు నుంచి లోపలికి ఎంటరయ్యి బ్యాక్‌ డోర్‌ నుంచి వెళ్లిపోవాలట! న్యూ ఇయర్‌ ఎంటరవుతున్న వేళలో వట్టి చేతులతో వచ్చేవారిని ఛస్తే లోపలికి రానివ్వరట! అంతేనా… నచ్చనివారు ఎవరైనా వస్తే డోర్‌ దగ్గరే నిలబెట్టేస్తారట! ఇంకో విచిత్రమైన నమ్మకం కూడా ఉంది.. ఏడాది చివరి రోజు రాత్రి పురుష అతిథులు వస్తేనే మంచి జరుగుతుందట! స్ర్తీలుగానీ.. ఎర్రజుట్టు ఉన్న వ్యక్తులు కానీ వస్తే ఏడాదంతా చెడే జరుగుతుందట! ఏం నమ్మాకాలో ఏమో!

బ్రెజిల్‌ వాసులు కూడా మనలాగే తృణధాన్యాలను…పప్పు దినుసులను సంపదగా భావిస్తారు.. అందుకే కొత్త సంవత్సరం మొదటి రోజున అన్ని రకాల పప్పు దినుసులను.. ధాన్యాలను కలిపి వండిన సూప్‌ను సేవిస్తారు.. ఆ రోజున తెల్ల దుస్తులు వేసుకోవాలనే ట్రెడిషన్‌ కూడా ఉంది! మెక్సికో ప్రజలు సంవత్సరం ఆఖరి రోజున అర్ధరాత్రి ఆకుపచ్చ ద్రాక్ష తింటారు.. అర్ధరాత్రి పన్నెండయ్యే వరకు గంటకో ద్రాక్షా తింటే శుభం కలుగుతుందన్నది వారి నమ్మకం..

సిసిలీలో కొత్త సంవత్సరం రోజున న్యూడిల్స్‌ అస్సలు చేయరు.. ఎందుకంటే న్యూడిల్స్‌ దురదృష్టాన్ని తెచ్చిపెడతాయన్నది వారి విశ్వాసం. బొలీవియాలో చిన్న చెక్కతోగానీ…స్ట్రాలతోగానీ చేసిన బొమ్మలను గుమ్మాలకు వేలాడదీస్తారు.. ఎందుకూ అంటే అదృష్టం కోసం అంటారు వీళ్లు! ఐర్లాండ్‌లో కొత్త సంవత్సరం ముందురోజు రాత్రి ఇంటి కిటికీలన్ని తెరుస్తారు.. గాలి వీచే దిశను బట్టి కొత్త ఏడాది ఎలా ఉంటుందో అంచనా వేస్తారు. తూర్పు నుంచి కనుక గాలి వీస్తే ఆహారం సమృద్ధిగా దొరుకుతుందనేది వీరి నమ్మకం.. పడమటి నుంచి గాలి వీస్తే మట్టుకు ఏడాదంతా నష్టమే జరుగుతుందట!

ఏడాది చివరి రోజున జర్మనీ వాసులు సీసంలో భవిష్యత్తు దర్శనాన్ని చేసుకుంటారు.. సీసాన్ని కరిగించి చల్లటి నీటిలో వేస్తారట! అందులో అది ఏర్పడే ఆకారాన్ని బట్టి ఫ్యూచర్‌ లెక్కలు వేసుకుంటారట! హృదయం ఆకారంలో సీసం ఏర్పడితే పెళ్లవుతుందట! పడవ ఆకారంలో వస్తే ట్రావెలింగ్‌ ఎక్కువగాఉంటుందట! పంది షేప్‌లో వస్తే ఆహారానికి ఢోకా ఉండదట! కొలంబియా… కోస్టారికా… క్యూబా దేశాల్లో కొత్త సంవత్సరానికి చిత్రంగా ఆహ్వానం పలుకుతారు.. మనం హోలి రోజున కాముడిని దహనం చేస్తామే..! అచ్చంగా అలాగే డిసెంబర్‌ 31 అర్థరాత్రి మనిషి ఆకృతిలో ఉన్న ఓ బొమ్మను దహనం చేస్తారు.. ఎందుకూ అంటే అలా చేస్తే ఏడాదిలోని చెడంతా పోతుందట! టర్కీ…ఇటలీలలో ఇంకో గమ్మత్తు ఆచారం ఉంది.. న్యూ ఇయర్‌ రోజున కంపల్సరీగా రెడ్‌ కలర్‌ అండర్‌వేర్‌నే ధరిస్తారట! రెడ్‌ కలర్‌తో న్యూఇయర్‌కు వెల్కమ్‌ చెబితే శుభం జరుగుతుందట! చిలీ దేశంలో తాల్కా అనే నగరం ఉంది.. అక్కడి ప్రజలు జనవరి ఒకటిన స్మశానానికి వెళ్లి చనిపోయిన తమ బంధుమిత్రుల సమాధుల మధ్య కూర్చొని కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు.. తమ ఆత్మీయులు తమ కోసం ఎదురుచూస్తున్నారన్నది వారి నమ్మకం.. Read Also… Viral Video: వృద్ధురాలికి తినిపిస్తూ.. ఓ వ్యక్తి చేసిన చిలిపిపని.. పాఠం నేర్చిన పెంపుడు కుక్క వీడియో వైరల్