Mystery Of Birds Suicide: పక్షుల సూసైడ్ పాయింట్! ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడే ఎందుకు.. అది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే!
మనుషులకే మనసుంటుందని, మనిషి మాత్రమే బాధపడతాడని అనుకుంటే పొరపాటే. చెట్లు, పక్షులు, జంతువులకు కూడా భావోద్వేగాలుంటాయి. అవి కూడా తమ స్పందనలను తెలియజేస్తాయి. తట్టుకోలేని బాధ కలిగితే మనిషి మాదిరిగానే ఆత్మహత్యలు..
Birds commit suicide in this place: మనుషులకే మనసుంటుందని, మనిషి మాత్రమే బాధపడతాడని అనుకుంటే పొరపాటే. చెట్లు, పక్షులు, జంతువులకు కూడా భావోద్వేగాలుంటాయి. అవి కూడా తమ స్పందనలను తెలియజేస్తాయి. తట్టుకోలేని బాధ కలిగితే మనిషి మాదిరిగానే ఆత్మహత్యలు కూడా చేసుకుంటాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది వాస్తవం! ఆ మధ్య నీటి గుర్రాలుగా పిలిచే వాల్రస్ (Walrus) అనే సముద్ర జీవులు వందలు, వేలుగా కొండమీదకు వెళ్లి అక్కడి నుంచి అమాంతం కిందికి దూకి ఆత్మ హత్యకు పాల్పడిన కథనాలు, వీడియోలు నెట్టింట ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఐతే మన దేశంలోని ఈ ప్రాంతంలో పక్షులు కూడా ఆత్మహత్యలు పాల్పడుతున్నాయట. వివరాల్లోకెళ్తే..
అస్సాంలోని జటింగా, బోరైల్ కొండల మధ్య ఓ గ్రామం ఉంది. ఈ ప్రాంతానికి పక్షుల ఆత్మహత్య కేంద్రం (bird’s suicide point) అని పేరు. ఎందుకంటే ఈ గ్రామానికి ప్రతీ యేట సెప్టెంబరు నుంచి నవంబర్ వరకు వేల సంఖ్యలో పక్షులు తరలివచ్చి మరణిస్తుంటాయి. స్థానిక పక్షులే కాకుండా వలస పక్షులు కూడా ఈ ప్రాంతానికి చేరుకుని ఆత్మహత్యలకు పాల్పడటం వెనుక దాగున్న కారణం ఏమిటో తెలియక పరిశోధకులు తలలు పట్టుకుంటున్నారు. నిజానికి ఆత్మహత్య చేసుకునే ధోరణి మనుషుల్లో సర్వసాధారణం. అదే పక్షులు, ఇతర జంతువుల్లో చాలా అరుదుగా మత్రమే ఉంటుంది. ఈ గ్రామంలో పక్షులు గాలిలో ఎగురుతూ వేగంగా వచ్చి ఇళ్లు లేదా చెట్టును ఢీకొని తీవ్రంగా గాయపరచుకుని మృతి చెందడం కనిపిస్తుంది. విచిత్రమేమంటే.. ఈ పక్షులు పగటిపూట బయటకు వెళ్లి రాత్రికి గూడుకు చేరుకుంటాయి. సరిగ్గా రాత్రి 7 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యలోనే ఇలా ప్రవర్తిస్తుంటాయి. దాదాపు 40 రకాల స్థానిక, వలస పక్షులు ప్రతీ యేట ఈ విధంగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటాయి.
వివిధ కారణాల వల్ల 9 నెలలపాటు ఈ గ్రామం బయటి ప్రపంచానికి దూరంగా ఉంటుంది. అంతేకాదు రాత్రిపూట ఈ గ్రామంలోకి ప్రవేశం పూర్తిగా నిషేధం. అయస్కాంత శక్తి వల్ల ఈ ప్రాంతంలోని పక్షులు మృతి చెందుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా పక్షలు వెలుగు ఉన్న చోట ఎగురుతాయి. ఐతే ఈ ప్రాంత వాతావరణంలోని తేమ, పొగమంచు, వేగంగా వీచే గాలులు, సరైన వెలుతురు లేకపోవడంతో.. పక్షులకు స్పష్టంగా కళ్లు కనిపించక ఇళ్లు, చెట్లను, వాహనాలను ఢీ కొంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరైన వెలుతురు లేకపోవడం వల్ల ఈ గ్రామానికి రైళ్లు నిషేధించబడినట్లు కొందరు చెబుతున్నారు. జటింగా స్థానిక ప్రజల్లో కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గాలిలో తమ పూర్తికుల శక్తులు సంచరిస్తుంటాయని, అందువల్లనే పక్షులు మరణిస్తున్నాయని, రాత్రి వేళల్లో మనుషులు బయట తిరిగితే వాళ్లు సైతం మరణిస్తారని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే రాత్రి వేళల్లో బయట ఎవరూ సంచరించరట. ఈ విధంగా పక్షులు 1910 నుంచి ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. ఐతే 1957లో బ్రిటీష్ పక్షి శాస్త్రవేత్త అయిన ఈపీ జీ (ornithologist E.P. Gee) రాసిన ‘వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకం ద్వారా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.
ఈ ప్రాంతంలో పక్షులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయనే విషయం తెలుసుకునేందుకు మన దేశంతోపాటు విదేశాల నుంచి కూడ ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఐతే ఇప్పటివరకు ఎవరూ ఈ మిస్టరీని చేధించలేకపోయారు.