AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విపత్తుల వేళ దేశాన్ని గట్టెక్కించే అద్భుత శక్తి.. NCMC.. అసలు ఇది ఏం చేస్తుందో తెలుసా?

దేశంలో ఎక్కడైనా పెద్ద ముప్పు సంభవించినప్పుడు.. ఒక్కసారిగా అన్ని వ్యవస్థలు ఒకే రీతిలో స్పందిస్తుంటాయి. ఆర్మీ రంగంలోకి దిగుతుంది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల కోసం సిద్ధమవుతాయి. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయం మెరుపు వేగం ల జరుగుతుంది. ఈ ప్రాసెస్ ‌కు మాస్టర్ ఎవరు అంటే – జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (National Crisis Management Committee – NCMC).

విపత్తుల వేళ దేశాన్ని గట్టెక్కించే  అద్భుత శక్తి.. NCMC.. అసలు ఇది ఏం చేస్తుందో తెలుసా?
Ncmc
Prabhakar M
| Edited By: |

Updated on: Jul 26, 2025 | 10:58 AM

Share

ఇది సాధారణ కమిటీ కాదు. ఇది దేశం మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో ముందుండి నడిపించే శక్తివంతమైన వ్యవస్థ. సహజమైనా కావచ్చు, మానవ నిర్మితమైనా కావచ్చు.. ఏ విపత్తు వచ్చినా కేంద్ర ప్రభుత్వానికి సమర్థవంతమైన ప్రతిస్పందన ఇచ్చేలా సాగే మార్గదర్శక కమిటీ ఇదే. 2005లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ద్వారా NCMCకి చట్టబద్ధ హోదా వచ్చింది. అయితే, 2025లో ఈ చట్టాన్ని సవరిస్తూ కమిటీ అధికారాలు మరింత విస్తరించాయి. అప్పటినుంచి ఇది దేశంలో అత్యంత కీలకమైన శాశ్వత సంస్థలలో ఒకటిగా మారింది.

ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు

ఈ కమిటీకి అధ్యక్షత వహించేది మంత్రులు కాదు. నేరుగా కేంద్ర కేబినెట్ కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయనతో పాటు ప్రధానమంత్రి కార్యదర్శి, హోం కార్యదర్శి, రక్షణ కార్యదర్శి, క్యాబినెట్ సమన్వయ కార్యదర్శి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సభ్యులు ఇందులో సభ్యులుగా ఉంటారు. అవసరాన్ని బట్టి ఇతర నిపుణులను కూడా ఈ కమిటీకి కో-ఆప్ట్ చేయవచ్చు.

ఏం చేస్తుంది ఈ కమిటీ –

ఈ కమిటీ ప్రధానంగా మూడు దశల్లో విపత్తులను ఎదుర్కొంటుంది. మొదటి దశ – విపత్తు ముందే ముందస్తు అంచనా వేసి సన్నద్ధత కల్పించడమే. ప్రమాదం ఎక్కడ తలెత్తే అవకాశం ఉందో గుర్తించి, అక్కడ సహాయక చర్యలు, రెస్క్యూ బృందాలు ముందుగానే సిద్ధం చేస్తుంది. ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు, బలహీనంగా ఉన్న ప్రాంతాలను పటిష్టం చేయడం వంటి పనులు ఈ దశలో చేపడతారు.

రెండో దశ – డిజాస్టర్ ప్రిపేర్డ్ నెస్-విపత్తు జరుగుతున్న సమయంలో చర్యలు. అంటే, బాధిత ప్రాంతాల్లో రెస్క్యూ, వైద్యం, తాత్కాలిక ఆశ్రయం, ఆహార సరఫరా వంటి అన్ని విభాగాలను సమన్వయం చేస్తుంది. ఇందులో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల సహకారంతో సమర్థవంతంగా రియల్ టైమ్ రిస్పాన్స్ నిర్వహిస్తుంది.

మూడో దశ – విపత్తు తర్వాతి పునరావాసం. బాధితులను తిరిగి తమ స్థితికి తీసుకురావడం, ఆస్తినష్టం, మానవ నష్టాన్ని పునఃనిర్మించడం, మానసికంగా వారిని ఆదుకోవడం వంటి చర్యలు చేపడతారు. దీనికోసం కేంద్రం – రాష్ట్రాల మధ్య సహకారంతో పాటు, ఆర్థిక సహాయాన్ని కూడా సమన్వయం చేస్తుంది.

ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి కార్యాలయానికి వరుసగా అప్డేట్లు చేరేలా చూసే బాధ్యత కూడా NCMCదే. అన్ని చర్యలపై పర్యవేక్షణ , సమగ్ర నివేదికలు తయారు చేసి అగ్రస్థాయి పాలకులకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ కమిటీతో సంబంధమున్న కొన్ని ముఖ్య పదాలు తెలుసుకోవాలి. “డిజాస్టర్ ప్రోనెనెస్” అనగా విపత్తులు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతం. “డిజాస్టర్ ప్రిపేర్డ్‌నెస్” అంటే ముందుగానే అప్రమత్తంగా ఉండడం. అలాగే, “ప్రథమ స్పందకులు” అనేవారు – విపత్తు సమయంలో తొలుత స్పందించే వ్యక్తులు, ప్రభుత్వ సిబ్బంది, రెస్క్యూ బృందాలు.

వాస్తవానికి ఈ కమిటీ కనిపించదు. పబ్లిక్‌కు ప్రత్యక్షంగా తెలుస్తూ ఉండదు. కానీ దేశానికి నిజంగా అవసరమైనప్పుడు… ఇది సైలెంట్‌గా, శక్తివంతంగా స్పందిస్తుంది. మన ఊరిలో తుపాను వస్తే… దానికి ఢిల్లీలో బేస్ క్యాంప్ ఈ కమిటీదే అనడంలో అతిశయోక్తి లేదు! విపత్తులు అనివార్యమైనా… స్పందన సమర్థవంతంగా ఉండాలి. అందుకే జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ దేశానికి ఆపద సమయంలో అండగా ఉండే బలమైన వ్యవస్థ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.