Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లు.. కేంద్రం అధికారిక ప్రకటన
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం కొత్త ఊపిరి ఊదింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్లాంట్‌కు జవసత్వాలు అందజేసేందుకు.. రూ.11,440 కోట్ల రివైవల్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికార ప్రకటన చేశారు. స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్యాకేజీపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మంచిరోజులొచ్చాయి. నష్టాల ఊబిలో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకునేందుకు..11 వేల 440 కోట్లతో భారీ ప్యాకేజ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు..కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్. ఏపీతో పాటు దేశానికి ఎంతో కీలకమైన విశాఖ స్టీల్‌ప్లాంట్..ఈ ప్యాకేజ్‌తో మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు కేంద్రమంత్రి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో..ఈ ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఊపిరి పోసేలా రివైవల్ ప్యాకేజీ కింద 11,500 కోట్లు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పారు..కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు. నష్టాలను అధిగమించి, ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పాదనతో లాభాల బాట పెట్టేందుకు ఈసాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్న రామ్మోహన్‌నాయుడు..ఏపీ అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని సోషల్ మీడియాలో పోస్ట్‌పెట్టారు.
View this post on Instagram
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు భారీ ప్యాకేజీ ప్రకటించడం శుభపరిణామమన్నారు..టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. కేంద్రం నిర్ణయంతో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయినట్టేనని స్పష్టం చేశారు. తమపోరాటానికి ఎట్టకేలకు ఫలితం దక్కిందన్న గంటా.. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.
మరోవైపు ప్యాకేజీతో విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదంటున్నాయి.. కార్మిక సంఘాలు. సెయిల్‌లో స్టీల్‌ప్లాంట్ విలీనం ఒక్కటే శాశ్వత పరిష్కారమని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌కు నాలుగేళ్ల పాటు ట్యాక్స్ హాలీడే ఇవ్వడంతో పాటు సొంత గనులు కేటాయించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కోరుతుంది. సెయిల్‌లో విలీనం ద్వారానే సంస్థను లాభాల్లోకి తీసుకువెళ్లొచ్చని కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ చెబుతున్నారు.
ఏపీలో అధికారం చేపట్టిన రోజు నుంచి విశాఖ ఉక్కుపై ప్రత్యేక దృష్టి సారించింది..కూటమి ప్రభుత్వం. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిలతో చర్చలు జరిపారు. ఇటీవల ప్రధానిని మరోసారి కలిసిన ముఖ్యమంత్రి..విశాఖ ఉక్కుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీనిపై విభిన్న కోణాల్లో చర్చించిన అనంతరం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.
ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమున్న విశాఖ ఉక్కు కర్మాగారం..గత కొన్నేళ్లుగా నష్టాలను మూటగట్టుకుంటోంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారం, తగినంత ముడిసరకు లేకపోవడం, కోర్టు ఎటాచ్‌మెంట్లు, ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అందుకు కారణమని స్టీల్‌ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సమస్యలను పరిష్కరించడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే కష్టాల నుంచి తప్పించడానికి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం..ఇదివరకే పార్లమెంటు స్థాయీసంఘానికి చెప్పింది. దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘం..పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది. దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




