AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్ర విషాదం.. ఆ నలుగురి కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చిన ఆదివారం సరదా!

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఆదివారం పెను విషాదం చోటుచేసుకుంది. లాలౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కునుహా కా డేరా సమీపంలో ఉన్న రింద్ నదిలో స్నానానికి వెళ్లిన ఆరుగురు స్నేహితుల్లో నలుగురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, శోకాన్ని నింపింది.

తీవ్ర విషాదం.. ఆ నలుగురి కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చిన ఆదివారం సరదా!
Rind River Accident
Balaraju Goud
|

Updated on: May 17, 2026 | 5:16 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఆదివారం (మే 17) పెను విషాదం చోటుచేసుకుంది. లాలౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కునుహా కా డేరా సమీపంలో ఉన్న రింద్ నదిలో స్నానానికి వెళ్లిన ఆరుగురు స్నేహితుల్లో నలుగురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, శోకాన్ని నింపింది.

లలౌలి పరిధిలోని తపాని గ్రామానికి చెందిన హసీబుద్దీన్, షాహిద్, అన్ష్, షాన్, నిజాం, మోను అనే ఆరుగురు యువకులు ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా స్నానం చేయడానికి రింద్ నదికి వెళ్లారు. నదిలో దిగి స్నానం చేస్తుండగా, నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువ కావడంతో యువకులు అదుపుతప్పి లోతైన ప్రాంతంలోకి కొట్టుకుపోయారు. ఆకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో వారు మునిగిపోతూ ప్రాణాల కోసం కేకలు వేశారు.

యువకుల ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానిక గజ ఈతగాళ్లకు సమాచారం అందించడంతో వారు వేగంగా నదిలోకి దూకి సహాయక చర్యలు చేపట్టారు. ఎంతో శ్రమించి నిజాం, మోను అనే ఇద్దరు యువకులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే, దురదృష్టవశాత్తూ మిగిలిన నలుగురు యువకులు హసీబుద్దీన్, షాహిద్, అన్ష్, షాన్‌లు అప్పటికే ఊపిరాడక నదిలోనే మరణించారు. గజఈతగాళ్లు వారి మృతదేహాలను నీటి నుంచి వెలికితీశారు.

ఈ ఘోర ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే లాలౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పంచనామా అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిమన్యు మంగ్లిక్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పోలీసు బలగాలు సంఘటనా స్థలంలో దర్యాప్తు జరుపుతున్నాయని, మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపారు.

సరదాగా గడపడానికి వెళ్లిన నలుగురు యువకులు శవాలుగా మారడంతో తపాని గ్రామం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. బిడ్డల మరణవార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో.. నదులు, చెరువుల వద్దకు వెళ్లేటప్పుడు ప్రజలు, యువత తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, లోతైన ప్రాంతాల్లోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us