సెమీకండక్టర్ హబ్‌గా భారత్.. ప్రధాని మోదీ సమక్షంలో టాటా, ఏఎస్ఎంఎల్ ఒక కీలక ఒప్పందం..
భారత్‌ను గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడింది. టాటా ఎలక్ట్రానిక్స్, ప్రపంచ ప్రఖ్యాత డచ్ సంస్థ ASMLతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా దేశంలోనే తొలి వాణిజ్య 300mm సెమీకండక్టర్ ఫ్యాబ్ నిర్మాణానికి వేగం పెరిగింది. గుజరాత్‌లోని ధోలేరాలో రూ.91 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్లాంట్‌కు ASML అత్యాధునిక లిథోగ్రఫీ సాంకేతికతను అందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందం భారత సెమీకండక్టర్ రంగానికి చారిత్రాత్మక మైలురాయిగా భావిస్తున్నారు.

భారతదేశాన్ని అంతర్జాతీయ సెమికండక్టర్ హబ్‌గా మార్చే దిశగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.. సులువైన మార్గదర్శకాలతోపాటు.. సెమీకండక్టర్ తయారీని వేగవంతం చేయడానికి సన్నాహాలను సైతం ప్రారంభించింది.. ఈ క్రమంలోనే.. భారతదేశంలో సెమికండక్టర్ తయారీని వేగవంతం చేయడానికి టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన చిప్ తయారీ పరికరాలను సరఫరా చేసే నెదర్లాండ్స్ దిగ్గజ సంస్థ ‘ASML’ తో సంయుక్తంగా టాటా ఎలక్ట్రానిక్స్ ఒక వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లోనే ప్రపంచ స్థాయి సెమికండక్టర్ ఫాబ్రికేషన్ (ఫ్యాబ్) ప్లాంట్లను నిర్మించే ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఈ మేరకు డచ్ సెమీకండక్టర్ పరికరాల తయారీ సంస్థ ASML, ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ మధ్య ఆదివారం ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ – డచ్ ప్రధానమంత్రి రాబ్ జెటెన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అత్యాధునిక చిన్న సెమీకండక్టర్ చిప్‌ల ఉత్పత్తిలో ఉపయోగించే లిథోగ్రఫీ యంత్రాల తయారీలో ASML ఒక ప్రముఖ సంస్థ. గుజరాత్‌లోని ధోలేరాలో ఏర్పాటు చేయనున్న భారతదేశపు మొట్టమొదటి ఫ్రంట్-ఎండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్ కోసం టాటా, ASML మధ్య కుదిరిన ఈ భాగస్వామ్యాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు.
“ఈ భాగస్వామ్యం ద్వారా, గుజరాత్‌లోని ధోలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేయనున్న 300 ఎంఎం (12-అంగుళాల) సెమీకండక్టర్ ‘ఫ్యాబ్’ (చిప్ తయారీ ప్లాంట్) విజయవంతమైన నిర్వహణకు ఏఎస్ఎంఎల్ మద్దతు ఇస్తుంది” అని టాటా ఎలక్ట్రానిక్స్ .. ఏఎస్ఎంఎల్ ప్రకటనలో తెలిపాయి. “సెమీకండక్టర్ కీలక సాంకేతికతల రంగంలో భారతదేశం, నెదర్లాండ్స్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సహకారంలో ఈ భాగస్వామ్యం ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది.”..
భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్
టాటా ఎలక్ట్రానిక్స్ ₹91,000 కోట్ల పెట్టుబడితో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ సహకారం ద్వారా ధోలేరా ఫ్యాబ్‌లో ఏఎస్ఎంఎల్ అధునాతన లిథోగ్రఫీ యంత్రాలు, సాంకేతికతలను వినియోగించుకోవడం జరుగుతుంది. దీనివల్ల భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య 300mm సెమీకండక్టర్ ఫ్యాబ్ సజావుగా పనిచేయడానికి వీలవుతుందని ఆ ప్రకటన తెలిపింది.
#WATCH | The Hague, Netherlands | Tata Electronics and ASML sign an MoU in the presence of Prime Minister Narendra Modi.
(Source: ANI/DD) pic.twitter.com/P5e7G2DsVX
— ANI (@ANI) May 16, 2026
ఈ భాగస్వామ్యం స్థానిక ప్రతిభకు శిక్షణ ఇవ్వడం, లిథోగ్రఫీ సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, సరఫరా గొలుసును బలోపేతం చేయడంపై కూడా దృష్టి సారిస్తుంది. చిప్ తయారీలో లిథోగ్రఫీ పోషించే కీలక పాత్రను దృష్టిలో ఉంచుకుని, ఈ ఫ్యాబ్ విజయవంతంగా పనిచేయడానికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి మౌలిక సదుపాయాలను రెండు కంపెనీలు కలిసి అభివృద్ధి చేస్తాయి.
భారతదేశ సెమీకండక్టర్ రంగానికి గొప్ప సామర్థ్యం ఉంది..
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ రంగం అపారమైన సామర్థ్యాన్ని అందిస్తోందని, ఈ రంగంలో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను నెలకొల్పడానికి తమ కంపెనీ కట్టుబడి ఉందని ఏఎస్ఎంఎల్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) క్రిస్టోఫ్ ఫుచ్స్ పేర్కొన్నారు. ఈ అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేయడం ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆయన తెలిపారు. టాటా ఎలక్ట్రానిక్స్, దాని విస్తృత ఎకోసిస్టమ్‌తో సన్నిహిత సహకారం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. తమ సెమీకండక్టర్ సామర్థ్యాలను విస్తరించాలనే ఆశయాలను సాకారం చేసుకునేందుకు టాటా ఎలక్ట్రానిక్స్ పటిష్టమైన స్థితిలో ఉందని ఆయన జోడించారు.
#WATCH | Semiconductors have become a clear priority for India, and Tata is the company set to build the country’s first semiconductor fab. I think this project is extremely important, and through this MoU, we want to provide @TataCompanies with all the support ASML can offer in… pic.twitter.com/47yoRv3KHl
— DD News (@DDNewslive) May 16, 2026
స్థానిక అభివృద్ధికి సహాయం చేయడం..
కాంపోజిట్ లిథోగ్రఫీ సొల్యూషన్స్‌లో ASMLకు ఉన్న అపారమైన నైపుణ్యం, ధోలేరాలోని ఫ్యాబ్ యూనిట్ కార్యకలాపాలు సకాలంలో జరిగేలా చూస్తుందని, ప్రపంచవ్యాప్త వినియోగదారులకు పటిష్టమైన, నమ్మకమైన సరఫరా గొలుసును సృష్టిస్తుందని, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని, అలాగే స్థానికంగా ప్రతిభను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని టాటా ఎలక్ట్రానిక్స్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రణధీర్ ఠాకూర్ అన్నారు.
కాగా.. భారతీయ సెమికండక్టర్ రంగానికి ఊతమిచ్చేలా టాటా ఎలక్ట్రానిక్స్ – నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ఏఎస్ఎంఎల్ (ASML) మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు.. పలువురు హర్షం వ్యక్తంచేశారు.
