Viral News: వీళ్లు కదా వీర వనితలంటే?.. చీరలనే ఆయుధంగా మలిచి.. యువకుల ప్రాణాలు కాపాడిన మహిళలు
ఆపదలో ఆయుధం దొరకనప్పుడు, ఆత్మవిశ్వాసమే ఒక మహాస్త్రం అవుతుంది. సాంకేతికత పెరిగి మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతున్న ఈ రోజుల్లో.. ఎలాంటి పరికరాలు లేకున్నా.. తమ ఒంటిపై ఉన్న చీరనే ఆయుధంగా మలుచుకొని.. ఆపదలో ఉన్న ఇద్దరు యువకులను కాపాడారు ముగ్గురు గ్రామీణ వీరనారులు. కష్టాల్లో ఉన్నవారిని కాపాడేందుకు కేవలం.. ఆయుధమే అవసరం లేదని.. సమయస్ఫూర్తి, మనోధైర్యం ఉంటే దేన్నైనా సాధించొచ్చని ఈ ఘటనతో ఆ ముగ్గురు మహిళలు నిరూపించారు.

ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఫోన్‌లు పట్టుకొని వీడియో తీసేందుకు ముందుకొచ్చే జనాలు ఉన్న ఈ రోజుల్లో.. ఇక్కడో ముగ్గురు మహిళలు మాత్రం.. తమ ధైర్యసాహసాలతో, ఎలాంటి ఆయుధాలు లేకుండా తమ చీర సహాయంతో నిండు ప్రాణాలను రక్షించారు. అవును, వినడానికి ఇదేదో సినిమా ఎలివేషన్‌లా అనిపించినా ఇది అక్షరాలా నిజం. నీట మునుగుతూ కాపాడాలని కేకలు వేసిన బాధితులను గమనించిన ఆ మహిళలు.. సమయస్ఫూర్తితో ఆలోచించి తమ ఒంటిపై ఉన్న చీరల సహాయంతో వారి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన తమిళనాడులోని కోట్టైపట్టినం అనే ప్రాంతంలో వెలుగుచూసింది.
సరదా ఈత.. అంతలోనే ప్రమాదం!
వివరాల్లోకి వెళ్తే.. కోట్టైపట్టినం గ్రామానికి చెందిన కొందరు యువకులు సరదాగా ఈత కొడదామని గ్రామ సమీపంలో ఉన్న ఓ కాలువలో దిగారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు వాళ్లు నీటిలో మునిగిపోసాగారు. దీంతో కాపాడాలని గట్టిగా కేకలు వేశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న అదే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు ఆ కేకలు విన్నారు. ఏంటని దగ్గరికి వెళ్లి చూడగా.. ఇద్దరు యువకులు నీట మునుగుతూ కనిపించారు.
ప్రాణాలు కాపాడిన అసాధారణ ఆలోచన
అది చూసిన వారికి తొలుత ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఎవరినైనా పిలుద్దాం అనుకున్నా చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. కనీసం వాళ్లను కాపాడుదామన్నా ఎటువంటి తాడు కూడా లేదు. అలా అని ఆలస్యం చేస్తే ఆ యువకుల ప్రాణాలకే ప్రమాదం ఉంది. అలాంటి కఠినమైన పరిస్థితిలో వారు దేని గురించీ ఆలోచించలేదు. వాళ్లకు ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడడమే ముఖ్యం అనిపించింది. అందుకే ఆ ముగ్గురు మహిళలు ఎవరూ చేయలేని ఓ సాహసోపేతమైన ఆలోచన చేశారు.
వెంటనే ఆ ముగ్గురు మహిళలు తమ ఒంటిపై ఉన్న చీరలను తీసి, ఒకదానికొకటి గట్టిగా ముడివేసి, ఒక పెద్ద తాడులా తయారు చేశారు. ఆ చీరను నీటిలోకి విసిరేసి.. దాని సహాయంతో నదిలో మునిగిపోతున్న ఇద్దరు యువకులను సర్వశక్తులూ ఒడ్డి ఎట్టకేలకు బయటకు లాగారు. దీంతో ఆ ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. భారతీయ వీరవనితలు కట్టుకునే చీర కేవలం అందానికి మాత్రమే ప్రతీక కాదని.. ఆపద సమయంలో అదే ప్రాణాలు కాపాడే సంజీవని కూడా కాగలదని ఈ ముగ్గురు మహిళలు నిరూపించారు.
వెల్లువెత్తుతున్న ప్రశంసలు
ఇక ప్రాణాలతో బయటపడిన సదరు యువకులు ఆ ముగ్గురు మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో స్థానిక గ్రామస్తులంతా వారి ధైర్యసాహసాలను ఎంతగానో మెచ్చుకున్నారు. కొందరు గ్రామస్థులు వారి సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆ ముగ్గురు మహిళలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. “నిజమైన హీరోలు సినిమాల్లో కాదు, ఇలాంటి గ్రామాల్లో ఉంటారు” అని కొనియాడుతున్నారు. వీరి అసాధారణ ధైర్యసాహసాలకు గాను ప్రభుత్వం ‘శౌర్య పురస్కారం’ అందించాలని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఇద్దరు యువకుల ఇళ్లలోని దీపాలు ఆరిపోకుండా కాపాడిన ఈ ముగ్గురు తల్లుల సాహసం నిజంగా చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
