కొత్త రూపు సంతరించుకుంటున్న యుపీఏ.. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో విపక్షాల కొత్త కూటమి.. ఏమో గుర్రమెగరావచ్చంటున్న విశ్లేషకులు
మోదీ వ్యతిరేక ఓటును చీల కుండా చూడడం ద్వారా విపక్షాలు తమ ఎంపీ స్థానాలను గణనీయంగా పెంచుకోవచ్చని పలువురు రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా 2024 సార్వత్రిక ఎన్నికలపైనే చర్చ. ఇందుకు కారణం ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థ ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి? ఎవరికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి? అనే అంశంపై తాము నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడించడమే. ఆ జాతీయ సంస్థ వెల్లడించిన సర్వే వివరాలను పరిశీలిస్తే ముచ్చటగా మూడోసారి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్.డి ఏ) అధికారంలోకి రావడం ఖాయం అన్న అభిప్రాయం కలుగుతుంది. బిజెపి తన మిత్రపక్షలతో కలిసి 298 నుంచి 338 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుందని ఆ జాతీయ మీడియా సంస్థ తాము నిర్వహించిన సర్వే ఫలితాల్లో వెల్లడించింది. ఈ సర్వేపై రకరకాల వ్యాఖ్యానాలు, మరిన్ని రకాల విశ్లేషణలు మనకు వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే దేశంలో విపక్షాలన్నీ ఒక్కటిగా జట్టు కడితేనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని ఓడించడం సాధ్యమని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మోదీ వ్యక్తిగత పేరు ప్రతిష్టలు బాగా పెరిగాయని, విపక్షాలు తమ భేషజాలను, సొంత ప్రయోజనాలను పక్కనపెట్టి ఒకటిగా మారితేనే మోదీని ఓడించడం సాధ్యమవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయని కూడా అనిపిస్తోంది. ముఖ్యంగా ఇంతకాలం యూపీఏ గెలిస్తే రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అన్న పట్టుదల నుంచి కాంగ్రెస్ పార్టీ క్రమంగా సడలిపోతోంది. పెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాలలో బిజెపి ఎంపీ అభ్యర్థులను నిలువరించేందుకు ఉమ్మడి అభ్యర్థులనే బరిలోకి దింపడం ద్వారా సానుకూల ఫలితాలను పొందవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మోదీ వ్యతిరేక ఓటును చీల కుండా చూడడం ద్వారా విపక్షాలు తమ ఎంపీ స్థానాలను గణనీయంగా పెంచుకోవచ్చని పలువురు రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు.
యుపీఏలోకి కొత్త పార్టీలు
తాజా పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కొత్త రూపును సంతరించు కుంటున్నట్లు కనిపిస్తోంది. యూపీఏలో ఇప్పటివరకు ఎన్సీపీ, డీఎంకె వంటి పార్టీలు ముఖ్య భాగస్వామ్య పక్షాలుగా ఉండేవి .తాజాగా నితీష్ కుమార్ సారథ్యంలోని జెడియు కూడా యూపీఏలో దాదాపు భాగస్వామ్యం అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో పనిచేసేందుకు ఇంతకాలం బెట్టు చేసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తాజాగా మెట్టు దిగినట్లు కనిపిస్తోంది. మోదీని గద్దె దింపేందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు ఆమె సంసిద్ధమవుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికిప్పుడు టక్కున కాంగ్రెస్ పార్టీతో జతకట్టకపోయినా.. ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో కలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిగిలింది భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు. బీజేపీని ఇంటికి సాగనంపుతానని ప్రతిన బూనిన కెసిఆర్.. వివిధ రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మహారాష్ట్రపై ప్రస్తుతం కెసిఆర్ ప్రయోగాలు చేస్తున్నారు. కేసీఆర్ పార్టీ మహారాష్ట్రలో నిర్వహిస్తున్న సభలకు మీడియా కవరేజ్ బహు చక్కగా లభిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలోకి కేసీఆర్ పార్టీ దిగకపోవడం గమనార్హం.
పార్టీల ఐక్యతకు లిక్కర్ స్కామ్ ఊతం
ఇక్కడ మరొక అంశం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రతిపక్షాల మధ్య ఐక్యతను సృష్టించడమే ఈ ఆశ్చర్యానికి కారణం. సహజంగా ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వస్తే ఆ వ్యక్తిని లేదా ఆ పార్టీని ఐసోలేట్ చేసేందుకు రాజకీయపక్షాలు ప్రయత్నిస్తాయి. దాన్ని తమ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం వాడుకుంటాయి. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాం మాత్రం జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు కారణమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కాం ఢిల్లీకి పరిమితం కాకుండా అనేక రాష్ట్రాలకు విస్తరించింది. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో లిక్కర్ స్కాం మూలాలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలలో విపక్షాలకు చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఈ నాలుగు రాష్ట్రాలలో అధికార పార్టీకి చెందిన నేతలపైనే అభియోగాలు నమోదు అవుతున్నాయి. ఈ లెక్కన తమను లక్ష్యంగా చేసుకున్న కేంద్ర ప్రభుత్వంపై వీరు ఆగ్రహంతో ఉన్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఈ కారణమే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీని కాంగ్రెస్ పార్టీకి చేరువ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే తమ తమ రాష్ట్రాలలో తమకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నేపథ్యంలో వెనువెంటనే ఈ పార్టీలు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏలో చేరకపోవచ్చు ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే ఏ కోణంలో చూసిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి పార్టీలు జతకట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ద్వారా ప్రతిపక్ష పార్టీల నేతలను ఇబ్బందులకు గురిచేస్తుంది అన్న ఒక పాయింట్ దేశంలో పొలిటికల్ పోలరైజేషన్‌కు తెరలేపుతోంది. కాంగ్రెస్, బిఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒకరి పట్ల మరొకరు మిత్రత్వాన్ని ప్రదర్శించే ధోరణిలో జాయింట్ స్టేట్మెంట్స్ జారీ చేస్తున్నాయి. గత 12 సంవత్సరాలుగా ఈ మూడు పార్టీలు పరస్పరం ప్రత్యర్థి వైఖరిని పాటించాయి. కానీ రాజకీయాలలో శత్రుత్వాలు శాశ్వతం కావు.. మిత్రుత్వాలు శాశ్వతం కావు అన్న నానుడిని నిజం చేస్తూ ఈ మూడు పార్టీలు సమీప భవిష్యత్తులో ఏకమయ్యే సంకేతాలు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం ప్రస్తావనార్హంగా కనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్, కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న పరిస్థితిని మూడు, నాలుగేళ్ల క్రితమే ఎదుర్కొన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహజంగానే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి. దానికి అనుగుణంగానే ఆమె కాంగ్రెస్ పార్టీతో పని చేసేందుకు ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. జాతీయ పార్టీగా తన పార్టీని మార్చుకున్న తర్వాత తొలిసారి జరుగుతున్న ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్ దూరంగా ఉండడం ఆశ్చర్య పడాల్సిన విషయమే అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయవకాశాలను ప్రభావితం చేయడం ఇష్టం లేకనే కేసీఆర్.. కర్ణాటక ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. ఇక గతంలో గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో తమ పార్టీ అభ్యర్థులను నిలిపిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఈసారి కర్ణాటక విషయంలో అంత గట్టిగా కనిపించడం లేదు. కర్ణాటకలో పెద్ద ఎత్తున పోటీకి దిగినప్పటికీ ప్రచార పథంలో మాత్రం అంత యాక్టివ్ గా కనిపించడం లేదు.




త్యాగాలకు సిద్దమవుతున్న కాంగ్రెస్
గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ తమ కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో మరిన్ని త్యాగాలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగా యూపీఏ సారధ్య బాధ్యతలను ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరకాలంగా ప్రధాని పీఠంపై కన్నేసిన శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ కనక యుపిఏ సారధ్య బాధ్యతలను ఆఫర్ చేస్తే తక్షణం స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. శరద్ పవార్ కనక యుపిఏ సారధిగా మారితే ఆ కూటమిలో చేరేందుకు కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేసీఆర్ వంటి నేతలకు ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో గనక టిడిపి-బిజెపి-జనసేన జతకడితే వైఎస్ఆర్సీపీ కూడా శరద్ పవర్ సారథంలోని యూపీఏలో చేరే అంశాన్ని పరిశీలించవచ్చు. ఇవన్నీ ఊహాజనితమైన అంశాలే అయినప్పటికీ నిజంగా కూడా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే గనక జరిగితే రూపుమారిన యూపీఏ వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిపై ఆధిపత్యం సాధించే అవకాశాలు లేకపోలేదు. అయితే తమ తమ ప్రయోజనాలను కాపాడుకుంటూనే ప్రాంతీయ పార్టీలను యూపీఏ కీలక భాగస్వామ్య పక్షాలు ఎలా కలుపుకుపోతాయన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమో గుర్రం ఎగరావచ్చు !!




