Pralhad Joshi: మోదీ-నితీష్ నాయకత్వానికే జై.. బీహార్‌లో గెలుపు మాదే.. ప్రహ్లాద్ జోషి ధీమా..
బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ఎన్డీఏ ముమ్మరం చేసింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్ జోషి, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సారి ఎన్డీఏ భారీ విజయాన్ని నమోదు చేస్తుందని జోషి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని విమర్శించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను ఆకర్షించడానికి అన్ని ప్రధాన పార్టీలు రంగంలోకి దిగడంతో రాజకీయ వేడి రాజుకుంది. అధికార ఎన్డీఏ కూటమికి చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కీలక సమావేశాలు, బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సీతామర్హిలో బీజేపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని నమోదు చేస్తుందని ప్రహ్లాద్ జోషి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం నితీష్ కుమార్ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని.. అత్యధిక సీట్లు తామే గెలుచుకుంటామని చెప్పారు. కాంగ్రెస్, ఆర్జేడీల విధానం చిన్న పార్టీలను అగౌరవపరిచేలా ఉన్నాయని విమర్శించారు. బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం శర్మ కోరారు.
#WATCH | Sitamarhi: On Bihar assembly elections, Union Minister Pralhad Joshi says, “We will achieve a much bigger victory than the ones we have achieved so far…The public is going to give its blessings in large numbers to the leadership of PM Modi and CM Nitish Kumar. The… pic.twitter.com/WWIFIN4XpS
— ANI (@ANI) October 17, 2025
సరన్‌లో అమిత్ షా బహిరంగ సభ.. జంగిల్ రాజ్ విమర్శలు
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరన్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. గత 20 ఏళ్లలో సీఎం నితీష్ కుమార్ బీహార్‌ను జంగిల్ రాజ్ నుండి రాష్ట్రాన్ని విముక్తి చేశారని ఆయన అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక మెజారిటీతో ఎన్డీఏ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సరన్ ప్రాంతం లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్, భిఖారి ఠాకూర్ వంటి గొప్ప వ్యక్తుల కార్యస్థలం అని గుర్తు చేసిన షా.. ఈ భూమి లాలూ-రబ్రీ హయాంలోని’జంగిల్ రాజ్‌ను కూడా గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించారు.
నాలుగు దీపావళులు
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఈ ఏడాది బీహార్ ప్రజలు నాలుగుసార్లు దీపావళి జరుపుకుంటున్నారని అన్నారు
- సాంప్రదాయ దీపావళి
- జీవికా దీదీ పథకం ద్వారా నిధులు పడినప్పుడు..
- ప్రభుత్వం జీఎస్‌టీని తగ్గించినప్పుడు.
- నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పుడు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తావించిన షా, ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిరాన్ని పునర్నిర్మించారని మరియు ఆర్టికల్ 370ని రద్దు చేశారని తెలిపారు. ఆర్జేడీపై తీవ్ర ఆరోపణలు అంతేకాకుండా షా భద్రత, ఉగ్రవాదం అంశాలను కూడా ప్రస్తావించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులు దేశంలో రక్తపాతం పారించారని.. కానీ ప్రధాని మోదీ పహల్గామ్ దాడి తర్వాత పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారని అన్నారు. ఈ సందర్భంగా గ్యాంగ్‌స్టర్ షాబుద్దీన్ కుమారుడి పేరు కూడా ఆర్జేడీ అభ్యర్థుల జాబితాలో ఉందని ప్రస్తావించి.. అలాంటి వ్యక్తులు బీహార్‌ను రక్షించలేరని తీవ్రంగా విమర్శించారు.
బీహార్ ఎన్నికల ప్రచారం ఉధృతమవుతున్న కొద్దీ.. ఎన్డీయే నాయకులు మోదీ చరిష్మా, సీఎం నితీష్ కుమార్ సుపరిపాలన, కేంద్రం విజయాలను హైలైట్ చేస్తూ.. కాంగ్రెస్-ఆర్జేడీలపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




