PM Modi: 75 గంటల్లో 303 నక్సలైట్లు సరెండర్.. ప్రధాని మోదీ సంచలన కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ మావోయిస్టు ఉగ్రవాదాన్ని, అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. హస్తం పాలనలో దేశంలోని చాలా ప్రాంతాలు నక్సలిజం బారిన పడ్డాయని, బాధితుల గొంతులను కూడా ఆ పార్టీ అణచివేసిందని విమర్శించారు. వారు రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని.. మావోయిస్టులను రక్షించడానికి పగలు - రాత్ తేడా లేకుండా పనిచేస్తున్నారని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నక్సలిజం, జాతీయ భద్రత, యువత భవిష్యత్తుకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం అనేది కేవలం పదం మాత్రమేనని.. వాస్తవానికి అది మావోయిస్టు ఉగ్రవాదం అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ ఉగ్రవాదాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చెందిన అర్బన్ నక్సల్స్ వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉందని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఈ ఉగ్రవాదం గురించి దేశ ప్రజలకు తెలియకుండా అర్బన్ నక్సల్స్ అనే వ్యవస్థ పెద్ద ఎత్తున దాచిపెట్టే పని చేసిందన్నారు.
చాలా మంది మావోయిస్టు ఉగ్రవాద బాధితులు తమ కాళ్లు, చేతులు పోగొట్టుకుని ఢిల్లీకి వచ్చినా.. వారి బాధను బయటి ప్రపంచానికి తెలియకుండా ఈ కాంగ్రెస్ వ్యవస్థ అడ్డుకుందని మోదీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని తిరిగేవాళ్లు.. ఇప్పటికీ మావోయిస్టులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని విమర్శలు గుప్పించారు. మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకున్నారని అన్నారు.
11 సంవత్సరాల క్రితం 125కు పైగా జిల్లాల్లో ఉన్న మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు కేవలం 11 జిల్లాలకు తగ్గిందని మోదీ చెప్పారు. ‘‘గత 75 గంటల్లోనే 303 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో కొందరిపై కోటి రూపాయల వరకు బహుమతులు ఉన్నాయి. ప్రభుత్వ మానవతా విధానం ఫలితంగానే ఈ మార్పు వచ్చింది. ఇంతకుముందు నక్సల్స్ కోటగా ఉన్న బస్తర్ ప్రాంతంలో ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి. నక్సలిజం లేని ప్రాంతాలలో ఈ సారి దీపావళి సంతోషంగా జరుపుకుంటారు. త్వరలోనే దేశం మొత్తం ఉగ్రవాదం నుండి పూర్తిగా విముక్తి పొందుతుంది’’ అని మోదీ హామీ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




