UP Elections 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ సరికొత్త వ్యూహం..
UP Assembly Elections 2022: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ(BJP) ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.

UP Assembly Elections 2022: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ(BJP) ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. బీజేపీ వ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినం సెప్టెంబర్ 25న పార్టీ నేతలు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ వరకు కమిటీలు, కార్యకర్తలను ఏర్పాటు చేసుకున్న భారతీయ జనతా పార్టీ.. బూత్ స్థాయి కంటే మరీ సూక్ష్మస్థాయికి వెళ్లి పన్నా ప్రముఖ్‌లను కూడా ఏర్పాటు చేసుకుంది. సెప్టెంబర్ 25న జరిగే సమావేశంలో పన్నా ప్రముఖ్‌లకు కూడా చోటు కల్పించి, అభ్యర్థుల ఎంపికలో వారి అభిప్రాయాలకు కూడా చోటు కల్పించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే క్షేత్రస్థాయిలో లోపాలు, సమస్యలు తెలుసుకుని, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. పన్నా ప్రముఖ్, బూత్, మండల స్థాయి కార్యకర్తలతో జరిగే సమావేశంలో పాల్గొనాల్సిందిగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అనేక సర్వేల ఫలితాలు యూపీలో మళ్లీ బీజేపీదే విజయమని చెబుతున్నప్పటికీ, ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ప్రణాళికలు రచిస్తోంది.
‘పన్నా’ ప్రముఖ్ అంటే.. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో అత్యంత దిగువన ఉన్న పదవే ‘పన్నా ప్రముఖ్’. ఏ రాజకీయ పార్టీకైనా మండలస్థాయి, ఇంకా దిగువన గ్రామ స్థాయిలో పార్టీ కమిటీలు ఉంటాయి. బీజేపీ ఇంకా ఒక అడుగు ముందుకేసి బూత్ కమిటీలను ఇదివరకే ఏర్పాటుచేసుకోగా, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ‘పన్నా ప్రముఖ్’లను ఏర్పాటు చేసుకుంది. సగటున ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఉండేలా ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్‌లను చేస్తోంది. కరోనా వేళ ఈ సంఖ్యను మరింత తగ్గించి, ఎక్కువ బూత్‌లను ఏర్పాటు చేస్తోంది. ఆయా గ్రామాల్లో జనాభాను అనుసరించిన బూత్‌లు ఉంటాయి. ఒకే బూత్ ఉన్న గ్రామాల్లో గ్రామ కమిటీయే బూత్ కమిటీగా వ్యవహరిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ బూత్‌లు ఉన్న గ్రామాల్లో ప్రతి బూత్‌కి ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ బూత్ పరిధిలోని ఓటర్లను బీజేపీకి ఓటేసేలా పనిచేయడమే బూత్ కమిటీ బాధ్యతగా పార్టీ నిర్దేశించింది.

BJP
ఈ లెక్కన బూత్ కమిటీ పరిధిలో ఎంతలేదన్నా 6-7 వందల మందికి పైగానే ఉంటారు. అంతమంది ఓటర్లతో నిత్యం మాట్లాడుతూ, వారి అవసరాలు చూస్తూ పార్టీకి ఓటేసేలా చేయడం బూత్ కమిటీలు చేసే పని. ఇందుకోసం బూత్ కమిటీ కార్యకర్తలు ఓటర్ల జాబితాపై ఆధారపడి పనిచేస్తుంటారు. అయితే ఓటర్ల జాబితాలో ప్రతి పేజికి సగటున 30 మంది ఓటర్ల పేర్లుంటాయి. ఆ 30 మంది ఓటర్లకు ఒక ప్రతినిధిని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. పేజిని హిందీలో పన్నా అంటారు. ఆ పేజి ఓటర్ల వ్యవహారాలు చూసుకునే వ్యక్తిని ‘పన్నా ప్రముఖ్’గా నామకరణం చేసింది.
పన్నా ప్రముఖ్ చేయాల్సిన పని తనకు అప్పగించిన పేజిలోని ఓటర్లందరితో సత్సంబంధాలు కలిగి ఉంటూ, వారి సమస్యలు పరిష్కరిస్తూ, అవసరాలు తీర్చుతూ ఎన్నికల సమయంలో పార్టీకి ఓటేసేలా పనిచేయడమే.
(మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ)
Also Read..
MLA Roja: పిల్లలు పుట్టరని చెప్పారు.. సంపాదించిందంతా అప్పులకే పోయింది. కంటతడి పెట్టుకున్న రోజా..