AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Fires on TMC: టీఎంసీ పార్టీకి కొత్త నిర్వచనం చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. అదేంటంటే?

ప్రచారంలో పంచ్ డైలాగులు, సామెతలతో పోలికలు చాలా కీలకం. తాము చెప్పదల్చుకున్న విషయాన్ని గుచ్చుకునేలా ప్రజల్లోకి తీసుకెళ్తాయి. సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కల్గిన నేతల్లో ఒకరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడినా వైరల్‌గా మారుతుంది. ఏం చేసినా చర్చనీయాంశమవుతుంది. అలాంటిది.. ఇప్పుడసలే ఎన్నికల సమయం. రాజకీయ ప్రత్యర్థులపై ఆయన విసిరే ‘పంచ్‌’ డైలాగులు, సూటి విమర్శలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంటాయి. తాజాగా బెంగాల్ పర్యటనలో ఆయన అక్కడి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై […]

Modi Fires on TMC: టీఎంసీ పార్టీకి కొత్త నిర్వచనం చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. అదేంటంటే?
Pm Narendra Modi On Tmc
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Mar 03, 2024 | 12:06 PM

Share

ప్రచారంలో పంచ్ డైలాగులు, సామెతలతో పోలికలు చాలా కీలకం. తాము చెప్పదల్చుకున్న విషయాన్ని గుచ్చుకునేలా ప్రజల్లోకి తీసుకెళ్తాయి. సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కల్గిన నేతల్లో ఒకరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడినా వైరల్‌గా మారుతుంది. ఏం చేసినా చర్చనీయాంశమవుతుంది. అలాంటిది.. ఇప్పుడసలే ఎన్నికల సమయం. రాజకీయ ప్రత్యర్థులపై ఆయన విసిరే ‘పంచ్‌’ డైలాగులు, సూటి విమర్శలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంటాయి. తాజాగా బెంగాల్ పర్యటనలో ఆయన అక్కడి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు వైరల్‌గా మారాయి.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆంగ్లంలో సంక్షిప్తంగా టీ.ఎం.సీ (TMC)గా వ్యవహరిస్తారు. అయితే ఆయన టీఎంసీకి సరికొత్త అర్థం చెప్పారు. టీఎంసీలో టీ(T) అంటే ‘తూ’, ఎం(M) అంటే ‘మై’, సీ(C) అంటే ‘కరప్షన్’ అంటూ పదునైన విమర్శలు సంధించారు. ‘తూ’, ‘మై’, ‘కరప్షన్’ అన్న హిందీ పదాలకు తెలుగు అనువాదం ‘నువ్వు’, ‘నేను’, ‘అవినీతి’ అని అర్థం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీ నేతలు అనేక కుంభకోణాలు, అవినీతి, అక్రమాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసులను సైతం ఎదుర్కొంటున్నారు. అందుకే నువ్వు-నేను-అవినీతి అన్న అర్థం వచ్చేలా టీఎంసీ పార్టీకి సరికొత్త వివరణ ఇచ్చారు.

పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టీఎంసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని.. టీఎంసీకి అర్థం మారిపోయిందని అన్నారు. అవినీతి, కుంభకోణాలతో ఆ పార్టీ బెంగాల్ ప్రతిష్టను దిగజార్చిందని దుయ్యబట్టారు. ప్రతి పథకాన్ని స్కామ్‌గా మారుస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు టీఎంసీ స్టిక్కర్‌లు అతికించి, తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు.

బెంగాల్‌ను నిరాశపరిచింది: ప్రధాని మోదీ

బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం నడుస్తున్న తీరు బెంగాల్‌ను నిరాశపరిచిందని ప్రధాని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు చాలా అంచనాలతో ఆ పార్టీకి పదేపదే విజయాన్ని అందిస్తూ వచ్చారని, అయితే TMC నిరంకుశత్వానికి, ద్రోహానికి మరో పేరుగా మారిందని అన్నారు. టీఎంసీ ప్రాధాన్యత బెంగాల్ అభివృద్ధి కాదని, అవినీతి – బంధుప్రీతి మాత్రమే ఆ పార్టీ ప్రాధాన్యాంశాలని దుయ్యబట్టారు. టీఎంసీ దుష్టపాలనలో మట్టి, మనుషులు ఏడుస్తున్నారని అన్నారు.

పేదలకు కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల వైద్య సహాయం అందిస్తోందని, అయితే కేంద్ర ప్రభుత్వం కల్పించే ఈ ప్రయోజనాన్ని బెంగాల్ ప్రజలకు అందించకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ వైద్యారోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు తాము చాలా కృషి చేశామని చెప్పారు. 2014కి ముందు బెంగాల్‌లో 14 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవని, గత 10 ఏళ్లలో ఈ సంఖ్య దాదాపు రెట్టింపై 26కి చేరుకుందని గణాంకాలు వెల్లడించారు. బెంగాల్ ప్రజలు పేదలుగా ఉండాలని టీఎంసీ కోరుకుంటోందని, తద్వారా వారి మురికి రాజకీయాలు కొనసాగించాలని చూస్తోందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌కు తొలి ఎయిమ్స్‌ వస్తుందని తాను చెప్పానని, కొద్ది రోజుల క్రితమే తాను ఎయిమ్స్‌ ప్రారంభించానని గుర్తుచేశారు. అయితే తాము ప్రారంభించిన ఎయిమ్స్‌తో బెంగాల్ ప్రభుత్వానికి సమస్య వచ్చిందని అన్నారు.

సందేశ్‌ఖలీ ప్రస్తావన

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సందేశ్‌ఖలీ ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ.. సందేశ్‌ఖలీ సోదరీమణులు న్యాయం కోసం వేడుకుంటున్నారని అన్నారు. టీఎంసీ ప్రభుత్వం వారి గోడు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్‌లో పరిస్థితి ఏమిటంటే, ఎప్పుడు లొంగిపోవాలో, ఎప్పుడు అరెస్టు చేయాలో పోలీసులు కాదు, నేరస్తులే నిర్ణయించుకుంటారని ప్రధాని ఎద్దేవా చేశారు. సందేశ్‌ఖలీ ఘటనలో నిందితులను అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపించారు. అయితే కలకత్తా కాళీలా మారిన బెంగాల్ మహిళా శక్తి, బీజేపీ కార్యకర్తల పోరాటం ముందు రాష్ట్ర ప్రభుత్వం తలవంచాల్సి వచ్చిందని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో, పెట్టుబడి, ఉపాధి కోసం బీజేపీ అసంఖ్యాక అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. ఇందుకోసం లోక్‌సభ ఎన్నికలలో బెంగాల్ ప్రజల సహకారం కావాలని కోరారు. రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లో కమలం వికసిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..