AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Changes: చరిత్రలోనే అత్యంత వేడి ఏప్రిల్.. మండుతున్న భూగోళం

భూగోళం భగభగ మండిపోతోంది. చరిత్రలోనే ఎన్నడూ లేని గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ఎక్కడో సహారా ఎడారిలోనో.. మరే ఉష్ణమండల ప్రాంతంలోనో కాదు.. యావత్ భూగోళమే అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతోంది. తాజాగా కొద్ది రోజుల క్రితం ముగిసిన ఏప్రిల్ నెల చరిత్రలోనే అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నెలల్లో ఒకటిగా రికార్డుల్లోకెక్కింది. గత 11 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెల రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇలాంటి విపత్తులు మరిన్ని ఎదుర్కోక తప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Weather Changes: చరిత్రలోనే అత్యంత వేడి ఏప్రిల్.. మండుతున్న భూగోళం
Weather Changes
Mahatma Kodiyar
| Edited By: Srikar T|

Updated on: May 08, 2024 | 2:31 PM

Share

భూగోళం భగభగ మండిపోతోంది. చరిత్రలోనే ఎన్నడూ లేని గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ఎక్కడో సహారా ఎడారిలోనో.. మరే ఉష్ణమండల ప్రాంతంలోనో కాదు.. యావత్ భూగోళమే అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతోంది. తాజాగా కొద్ది రోజుల క్రితం ముగిసిన ఏప్రిల్ నెల చరిత్రలోనే అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నెలల్లో ఒకటిగా రికార్డుల్లోకెక్కింది. గత 11 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెల రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇలాంటి విపత్తులు మరిన్ని ఎదుర్కోక తప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ వాతావరణ విభాగం “కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీస్ (C3S)” ప్రకారం భూగోళంపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ఏప్రిల్ నిలిచింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం 2023 కంటే 2024 మరింత వేడి సంవత్సరంగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను గుర్తించేందుకు కొలమానంగా ప్రపంచీకరణకు ముందు, ప్రపంచీకరణ తర్వాత గణాంకాలను పరిశీలిస్తారు. ఆ ప్రకారం 1850-1900 మధ్యకాలంలో రికార్డయిన ఉష్ణోగ్రతలను బేస్‌లైన్‌గా తీసుకుని తదుపరి నమోదైన ఉష్ణోగ్రతలను పోల్చి చూస్తుంటారు. ఆ ప్రకారం గత ఏప్రిల్ నెలలో ప్రపంచవ్యాప్తంగా సగటున 1.58 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1991 – 2020 మధ్యకాలంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చి చూస్తే సగటు 0.67 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ లెక్కల ప్రకారం గత 174 ఏళ్లలో 2023 అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఏడాది సగటు ఉష్ణోగ్రతలు బేస్‌లైన్ (1850-1900) సగటు ఉష్ణోగ్రత కంటే 1.45 డిగ్రీల సెల్సియస్ అధికం. ఈ ఏడాది (2024) గత ఏడాది కంటే అధిక వేడి సంవత్సరంగా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

భూతాపానికి కారణాలు ఇవే..

భూమ్మీద నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే మనిషే. మనిషులు తమ అవసరాలకు మించి ప్రకృతిని నాశనం చేస్తున్నారని పర్యావరణ ప్రేమికులు నిందిస్తుంటారు. పారిశ్రామీకరణ కారణంగా వాతావరణంలో గ్రీన్‌హౌజ్ వాయువులైన కార్బన్ డై ఆక్సైడ్ (CO2), మీథేన్‌ల సాంద్రత వేగంగా పెరగవడం వల్ల భూవాతావరణంలో ఉష్ణోగ్రతలు 185-1900 సగటుతో పోల్చితే ఇప్పటికే దాదాపు 1.15 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. 2023లో ఆ సగటు పెరుగుదల 1.45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత మొదటిసారిగా జనవరిలో మొత్తం సంవత్సరానికి 1.5 డిగ్రీల సెల్సియస్ థ్రెషోల్డ్‌ను దాటింది. ఈ గణాంకాలు వాతావరణ నిపుణులను భయపెడుతున్నాయి. భూమ్మీద శరవేగంగా అడవులు తరిగిపోతున్నాయి. వాతావరణ సమతౌల్యత దారుణంగా దెబ్బతింటోంది. అసలు వర్షం అన్నదే ఎరుగని ఎడారి ప్రాంతాల్లో భారీ వర్షాలే కాదు, అతలాకుతలం చేసే స్థాయిలో వరదలు సంభవిస్తున్నాయి. రుతుపవనాలపై ఆధారపడ్డ భారత్ వంటి దేశాల్లోనూ వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదివరకు వర్షాకాలంలో వారం రోజుల పాటు ఓ మోస్తరుగా కురిసే వర్షాలు ఒకట్రెండు గంటల్లో కురిసి మళ్లీ వర్షం జాడ లేకుండా పోతోంది. గణాంకాల ప్రకారం చూస్తే సగటు వర్షపాతానికి అటూఇటూగానే ఉంటున్నప్పటికీ.. వర్షాలు కురిసే తీరులో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుఫాన్ల తీవ్రత కూడా పెరుగుతోంది. మొత్తంగా ప్రకృతిలో సహజసిద్ధంగా ఉండాల్సిన వాతావరణంలో పెనుమార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతల ధాటికి పాఠశాలలు మూసివేయాల్సి వచ్చింది. భారత్‌లోని దక్షిణాది రాష్ట్రాలతో పాటు వియత్నాం, ఫిలిప్పైన్స్ వంటి వరి ఎక్కువగా పండించే ప్రాంతాల్లో ఎండిపోయి బీటలువారిన పొలాల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఈ ఎండవేడికి తాళలేక సతమతమవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న అత్యల్ప పోలింగ్ శాతానికి కారణం ఈ ఉష్ణోగ్రతలేనని ఎన్నికల అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇండోనేషియా, మలేషియా, మయన్మార్‌తోపాటు భారత్‌లోనూ ఉష్ణోగ్రత రికార్డులు బద్దలయ్యాయి. వీటన్నింటికీ కారణం మనిషి తన అవసరాలకు మించి చేస్తున్న పారిశ్రామీకరణ, వాహన ఉద్గారాల ద్వారా భూ ఉపరితలంలో పెరిగిపోతున్న గ్రీన్‌హౌజ్ వాయువులేనని నిపుణులు సూత్రీకరిస్తున్నారు. శిలాజ ఇంధనాలు (బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు) వినియోగం పెరగడం వల్ల వాతావరణంలో గ్రీన్‌హౌజ్ వాయువుల సాంద్రత నానాటికీ పెరుగుతోంది.

ఎల్ నినో..

పసిఫిక్ మహాసముద్రంలో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడే ఎల్-నినో, లా-నినా వంటి పరిస్థితులు భారత్‌లో రుతుపవనాలను, వర్షపాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎల్-నినో ఏర్పడినప్పుడు రుతుపవనాలు బలహీనంగా మారి సాధారణంగా కంటే తక్కువ వర్షపాతాన్ని కల్గిస్తాయి. లా-నినా వంటి పరిస్థితులు రుతుపవనాలకు మరింత బలాన్నిచ్చి అధిక వర్షాలు కురిపిస్తాయి. ఈ తరహా పరిస్థితి సగటున ప్రతి రెండేళ్ల నుంచి ఏడేళ్ల మధ్యకాలంలో ఏర్పడుతుంటాయి. అలాగే ఎల్-నినో లేదా లా-నినా ఏర్పడితే సాధారణంగా 9 నెలల నుంచి 12 నెలల వరకు కొనసాగుతుంది. ఇవి సముద్ర ఉష్ణోగ్రతలో చోటుచేసుకునే మార్పుల కారణంగా ఏర్పడుతుంటాయి. ఏప్రిల్‌ నెలలో ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కోపర్నికస్ డేటా ప్రకారం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 21.04 డిగ్రీలకు చేరుకున్నాయి. ఇది ఏప్రిల్‌ నెలలో గతంలో ఎప్పుడూ నమోదుకాని అత్యధిక ఉష్ణోగ్రత. కొంతలో ఊరట కల్గించే అంశం ఎల్-నినో పరిస్థితులు బలహీనపడుతోంది. ఎల్-నినో తర్వాతి ఏడాది సాధారణంగా వేడిగా ఉంటుంది. కొన్ని అంచనాల ప్రకారం 2024 అత్యంత వేడిగా ఉండే సంవత్సరంగా నమోదయ్యేందుకు 66% అవకాశం ఉంది. అలాగే రెండవ అత్యంత వేడి సంవత్సరంగా రికార్డయ్యేందుకు 99% అవకాశం ఉంది. బేస్‌లైన్ సగటు ఉష్ణోగ్రతల కంటే సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భూతాపంతో ఏం జరుగుతుంది.?

ప్రపంచవ్యాప్తంగా ఈ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల కంటే తక్కువకు పరిమితం చేయాలని దేశాలు అంగీకరించాయి. ఇది ఒక నెల లేదా సంవత్సరం కాకుండా దశాబ్దాలుగా దీర్ఘకాలికంగా పెరిగిన వేడిని సూచిస్తున్నప్పటికీ, గత రెండేళ్లలో ఒక్కసారిగా పెరిగిన అధిక ఉష్ణోగ్రతలు మాత్రం ప్రమాద సూచికగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023లో ఊహించని విధంగా నమోదైన అధిక ఉష్ణోగ్రతలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఊహించినదానికంటే ఎక్కువ వేగంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చోటుచేసుకోబోయే పరిణామాలను ఊహించడానికి ఈ విశ్లేషణ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరిగే దిశగా అడుగులు పడుతున్నాయని, ఇది విపత్కర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎల్-నినో వంటి సహజ వాతావరణ పరిస్థితులు వస్తూ పోతూ ఉంటాయి. కానీ గ్రీన్ హౌజ్ వాయువుల సాంద్రత పెరుగుదల పూర్తిగా మానవ తప్పిదమే. దీన్ని ఇప్పటికైనా అరికట్టకపోతే ప్రమాదకరమైన భవిష్యత్తుకు స్వాగతం పలికినట్టేనని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.