Flight Tickets Price: ఇండిగో సంక్షోభం.. విమాన టికెట్ల ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం
విమాన టికెట్ల ఛార్జీలకు సంబంధించి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. టికెట్ల ధరలను పెంచవద్దని, తాము చెప్పినట్లే ధరలను నిర్ణయించాలని ఆదేశాలిచ్చింది. ఇండిగో విమానల రద్దుతో దేశవ్యాప్తంగా వేలాదిమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న క్రమంలో మిగతా సంస్థలు ఛార్జీలను పెంచుతున్నాయి.

Indigo Flights News: ఇండిగో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. గత ఐదు రోజుల నుంచి వరుసగా విమాన సర్వీసులను రద్దు చేస్తూ వస్తోంది. ఇప్పటికే వెయ్యకిపైగా విమానాలను సడెన్‌గా క్యాన్సిల్ చేయడంతో దేశవ్యాప్తంగా వేలాదిమంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర ప్రయాణాలు చేసేవారు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఇండిగోకు వ్యతిరేకంగా ప్రయాణికులు నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ సంక్షోభంపై ఇప్పటికే స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రయాణికులకు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా తాజాగా ప్రయణికులకు ఊరటనిచ్చేలా మరో ప్రకటన చేసింది.
ఇండిగో ఫ్లైట్లు రద్దు కావడంతో మిగతా విమానయాన సంస్థలు టికెట్ రేట్లు పెంచాయి. ప్రయాణికులపై భారం పడకుండా దీనిని అడ్డుకునే చర్యలు కేంద్రం చేపట్టింది. విమాన టిక్కెట్ల ధరలపై క్యాపింగ్ విధించారు. ఇండిగో విమానాలు రద్దయిన మార్గాల్లో తాము నిర్ణయించిన రేట్ల ప్రకారమే ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా నిర్ణయించిన ధరలను ప్రతీ విమానయాన సంస్థ పాటించాలని అన్నీ ఎయిర్‌లైన్స్ సంస్థలను ఆదేశించింది. టిక్కెట్ల ధరపై విధించిన లిమిట్ సామాన్య పరిస్థితులు నెలకొనే వరకు అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. టిక్కెట్ ధరలపై రియల్ టైమ్ నిఘా ఉంటుందని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. సంక్షోభం నుంచి బయటపడి సాధారణ పరిస్థితికి మరో 15 రోజుల టైమ్ పడుతుందని ఇండిగో ప్రకటించింది. దీంతో మిగతా సంస్థలు టికెట్ల రేట్లు పెంచకుండా కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
ఇటు హైదరాబాద్‌లో 69 సర్వీసులను ఇండిగో క్యాన్సిల్ చేసింది. 23 ఇన్‌కమింగ్, 43 అవుట్‌గోయింగ్ ఫ్లైట్స్‌ను రద్దు చేసింది. దీని వల్ల వేలాదిమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే చిక్కుకున్నారు. కార్యకలాపాలు సాధారణ స్థితికి రావడానికి మరో 10 రోజుల టైమ్ పట్టే అవకాశముందని ఎయిర్‌పోర్ట్ అధికారులు చెబుతున్నారు. అటు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దవ్వగా. .వీటిల్లో చెన్నై, బెంగళూరు,అహ్మదాబాద్‌కు వెళ్లేవి ఉన్నారు. విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇండిగో కౌంటర్స్ ముందు భారీగా క్యూలైన్లు కట్టి సిబ్బందితో గొడవ పడుతున్నారు. సర్వీసుల రద్దుపై తమకు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. తమ అత్యవసర ప్రయాణాలు ఆగిపోయాయంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




