Diwali: దీపావళి బాణాసంచా కాల్చడంపై ఆంక్షలు.. కేవలం రెండు గంటలు మాత్రమే పర్మిషన్.. అంతే కాకుండా
దీపావళి.. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రాంతంలో జరుపుకునే వేడుక. ఈ పర్వదినాన దీపాలను వెలిగించడంతో పాటు, బాణాసంచా కాల్చడం అనాదిగా వస్తోంది. అయితే బాణాసంచా కాల్చడం ద్వారా వచ్చే పొగతో కాలుష్యం..
దీపావళి.. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రాంతంలో జరుపుకునే వేడుక. ఈ పర్వదినాన దీపాలను వెలిగించడంతో పాటు, బాణాసంచా కాల్చడం అనాదిగా వస్తోంది. అయితే బాణాసంచా కాల్చడం ద్వారా వచ్చే పొగతో కాలుష్యం ఏర్పడుతుంది. దీనిని పరిగణలోకి తీసుకుని దీపాల వెలుగులో పండుగ జరుపుకోవాలని, అవసరమనుకుంటే ఇకో-క్రాకర్స్ ను పేల్చుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో పండుగ నిర్వహణ, వేడుకల పట్ల ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ మేరకు దీపావళి రోజున కాల్చే బాణాసంచా విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. కేవలం 2 గంటల మాత్రమే బాణసంచా కాల్చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగను ఈనెల 24న జరుపుకోనున్న విషయం తెలిసిందే. పండుగ వేళ బాణసంచా ఏఏ సమయాల్లో పేల్చాలో తెలుపుతూ పూర్తి వివరాలను అందులో వెల్లడించారు.
పండుగ రోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఒక గంట, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరో గంట మాత్రమే.. టపాకాయలు కాల్చుకునేందుకు పొల్యూషన్ బోర్డ్ అనుమతించింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు, స్థానిక సంస్థల అధికారులు ఈ విషయంపై అవగాహన కలిగించాలని సూచించింది. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. భారీ శబ్దాలు, పొగలు వచ్చే బాణా సంచాకు దూరంగా ఉండాలని, ఇకో ఫ్రెండ్లీ టపాసులను మాత్రమే కాల్చుకోవాలని సూచించింది.
మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో పటాసుల పేల్చడంపై నిషేధం విధించాలని పర్యావరణ వేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా.. సర్వోన్నత న్యాయస్థానం దానిని తిరస్కరించింది. తాము ఇదివరకు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. తమ ఉత్తర్వులు స్పష్టం చేశామని తెలిపింది. కాగా.. చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళి. చిమ్మ చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించింది. అందుకోసమే అంతా దీపాలు వెలిగిస్తారు. టపాసులు పేల్చి ఆనందోత్సవాల మధ్య పండుగ జరుపుకుంటారు.