Gujarat: దంపతులకు విచిత్ర అనుభవం.. కుమారిడితో కలిసి వెళ్తుండగా.. కిడ్నాప్ చేస్తున్నారని అడ్డుకున్నారు.. ఆఖరుకు..
గుజరాత్ లో ఓ దంపతులకు ఎదురైన విచిత్ర అనుభవం ఏ తల్లిదండ్రులకు రాకూడదు. చిన్నారులన్నాక అమ్మానాన్నల దగ్గర గొడవ పడడం, వారితో పేచీ పెట్టుకోవడం షరా మామూలే. కానీ దానిని చూసి తప్పుగా అనుకోకూడదు. కానీ..

ఓ దంపతులకు ఎదురైన విచిత్ర అనుభవం ఏ తల్లిదండ్రులకు రాకూడదు. చిన్నారులన్నాక అమ్మానాన్నల దగ్గర గొడవ పడడం, వారితో పేచీ పెట్టుకోవడం షరా మామూలే. కానీ దానిని చూసి తప్పుగా అనుకోకూడదు. కానీ గుజరాత్ లో కొంత మంది ప్రజలు వారిని చూసి అలాగే అనుకున్నారు. పిల్లాడిని కిడ్నాప్ చేస్తున్నారని భావించారు. వారిని అడ్డగించి, పోలీసులకు పట్టించారు. జరుగుతున్న పరిణామానికి ఆ దంపతులిద్దరూ షాక్ అయ్యారు. తమ కుమారుడేనని ఎంత చెప్పినా వారు వినలేదు. ఆఖరికి ఆధార్ సహా డాక్యుమెంట్లు చూపించడంతో అతను వారి కుమారుడేనని నిర్ధారించుకుని విడిచిపెట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన దంపతులు.. తమ కుమారుడితో కలిసి నవపురాలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో వ్యాన్‌లో వెళ్తున్నారు. అదే సమయంలో ఐదేళ్ల వయసున్న ఆ బాలుడు పెద్దగా అరుస్తున్నాడు. తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. ఈ సంఘటనను చూసిన మార్కెట్ లోని స్థానికులు వారి వాహనాన్ని అడ్డుకున్నారు. వ్యాన్ నుంచి వారిని కిందికి దింపారు. బాలుడిని కిడ్నాప్ చేస్తున్నారా? అని గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ దంపతులిద్దరూ అవాక్కయ్యారు.
కానీ అప్పటికే పెద్దఎత్తున జనం గుమిగూడారు. బాలుడు తమ కుమారుడేనని తల్లిదండ్రులిద్దరూ ఎంతగా నచ్చజెప్పినా అక్కడ ఉన్న వారు వినలేదు. బాలుడు బధిరుడు కావడం, మాటలు రాకపోవడంతో అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. దీంతో జనాలు వారిని నమ్మలేదు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ఆ ప్రాంతంలో దావానలంలా వ్యాపించింది. కిడ్నాప్‌లపై పుకార్లు, బాలుడి ప్రవర్తన వారిలో అనుమానాన్ని మరింత పెంచాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. వారికి ఆ తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయినా పోలీసులు నమ్మలేదు.




బాలుడు తమ కుమారుడే అంటూ నిర్ధారించుకోవడానికి అవసరమైన ఆధారాలు చూపాలని అడిగారు. దీంతో అందరూ కలిసి ఇంటికి వెళ్లారు. ఆధార్, ఇతర డాక్యుమెంట్‌లతో ఆ చిన్నారి వారి కుమారుడేనని నిర్ధారించుకున్నారు. ఈ వ్యవహారంపై బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. అలాంటి ఆరోపణ ఎలా చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండటం, పోలీసులను పిలవడం మంచి సంకేతమని వారికి చెప్పినట్లు పోలీసులు వారికి వివరించారు.



