Loksabha Polls 2024: ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ ఆడపడుచు..!
గతంలో సినీనటి జయప్రద సమాజ్ వాది పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. దాదాపు దశాబ్దం పైగా జయప్రద ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కృపాశంకర్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబు సింగ్ కుష్వాహా బరిలోకి దిగారు. దీంతో పోరు రసవత్తరంగా మారింది.
ఒకప్పుడు రాజకీయాలంటేనే పురుషుల ఆదిపత్యం ఉండేది. కానీ ఇప్పుడు మహిళలు.. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో కూడా నారీ శక్తిని చాటుతున్నారు. తెలుగింటి ఆడపడుచులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తర భారత దేశంలోని ఎన్నికల్లో కూడా పోటీపడుతున్నారు. గతంలో సినీ నటి జయప్రద ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తాజాగా తెలంగాణ ఆడపడుచు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ పడుచు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పురుషులతో పాటు మహిళలు కూడా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో తమ అదృష్టాన్ని మహిళలు పరీక్షించుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన తెలంగాణ ఆడపడుచు ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపీ ఎన్నికల బరిలో నిలిచారు. యూపీలోని జౌన్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమెకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరపున ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఆడపడుచు అయిన శ్రీ కళా రెడ్డి మెట్టినింటి నుంచి పలమట్టి ఎన్నికల బరిలో ఉన్నారు.
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కుమార్తె శ్రీ కళా రెడ్డి. 1972 లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కీసర జితేందర్ రెడ్డి గెలిచారు. చెన్నైలోనీ నిప్పు బ్యాటరీ ఇండస్ట్రీస్ అధినేత జితేందర్ రెడ్డి. శ్రీకళా రెడ్డి అమెరికాలో ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేశారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన శ్రీ కళా రెడ్డికి సామాజిక సేవా రాజకీయాలపై ఆసక్తి ఉండేది. దీంతో 2004లో టిడిపిలో చేరి కోదాడ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆ తర్వాత బిజెపి, వైఎస్ఆర్సిపి నుంచి కూడా టికెట్ ఆశించారు.
పలు రాష్ట్రాల్లో ఇంటీరియర్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ రంగాల్లో వ్యాపారాలు చేసిన శ్రీకళా రెడ్డి 2017లో యూపీకి చెందిన ధనుంజయ్ సింగ్ ను వివాహమాడారు. జౌన్‌పుర్ మాజీ ఎంపీగా, బీఎస్పీ అధినేత్రి మాయావతికి సన్నిహితుడిగా ధనంజయ్ సింగ్ కు పేరుంది. ఆయనకు కొన్ని కేసుల్లో నిందితుడిగా శిక్ష పడింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ధనుంజయ్ సింగ్ కు కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. దీంతో జౌన్ పుర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా శ్రీకళారెడ్డి 2022లో గెలుపొందారు.
ప్రస్తుతం జౌన్ పూర్ సిట్టింగ్ ఎంపీగా బీఎస్పీ కి చెందిన శ్యామ్ సింగ్ యాదవ్ ఉన్నారు. అయితే జౌన్ పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ధనుంజయ్ సింగ్ కుటుంబానికి గట్టిపట్టు ఉంది. దీంతో మాయావతి సిట్టింగ్ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్ ను కాదని ధనుంజయ్ సింగ్ భార్య అయిన శ్రీకళారెడ్డికి టికెట్ ఇచ్చింది. శ్రీకళారెడ్డి పుట్టిళ్లు తెలంగాణ అయినా.. మెట్టినిల్లు యూపీ నుంచి శ్రీకళారెడ్డి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు.. గతంలో సినీనటి జయప్రద సమాజ్ వాది పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. దాదాపు దశాబ్దం పైగా జయప్రద ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కృపాశంకర్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబు సింగ్ కుష్వాహా బరిలోకి దిగారు. దీంతో పోరు రసవత్తరంగా మారింది. మెట్టింటి నుంచి ఎన్నికల బరిలో ఉన్న తాను జౌన్ పూర్ నుంచి ఎంపీగా విజయం సాధిస్తానని శ్రీకళా రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నుంచి ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశం దక్కనప్పటికీ.. మెట్టింటి నుంచి ప్రజాసేవ చేస్తున్నానని ఆమె చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..