Tamil Nadu Rains: రెడ్ అలర్ట్.. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు..

భారీ వర్షాలతో తమిళనాడు చిగురుటాకులా వణికిపోతోంది.10రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వానలతో విలవిలలాడిపోతోంది. అయితే.. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Tamil Nadu Rains: రెడ్ అలర్ట్.. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
Rain Alert
Follow us

|

Updated on: Nov 12, 2022 | 5:06 AM

భారీ వర్షాలతో తమిళనాడు చిగురుటాకులా వణికిపోతోంది. 10 రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వానలతో విలవిలలాడిపోతోంది. అయితే.. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తాజాగా మరో 3 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మొత్తం 12 జిల్లాలకు రెడ్ అలర్డ్ కొనసాగుతోంది. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా చెన్నై, కాంచీపురం, చెంగల్‌పేట్, తిరువళ్లూరు, మైలాడుతురై, విల్లుపురం సహా దాదాపు 12 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 8:30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో చెన్నైలో సగటున 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తమిళనాడు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కెఎన్ నెహ్రూ తెలిపారు. తమిళనాడు సహా పుదుచ్చేరి, కారైకాల్ లో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ బాలచంద్రన్ తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. చెన్నై సహా 21 ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కుండపోత వానలకు చెన్నై మహానగరంలో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చెరి, కారైకల్‌లోనూ హెవీ రెయిన్స్‌ పడుతున్నాయి. దీంతో అక్కడ కూడా అధికారులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. పలుచోట్ల సబ్‌వేలు మూసివేశారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. భారీ మోటార్లతో రోడ్లపై నిలిచిన నీటిని తోడేస్తున్నారు. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇక రానున్న 24 గంటల్లో చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వానలు పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.

మరో మూడు రోజులు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..బలమైన గాలులు వీచే అవకాశముందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ప్రస్తుతం తమిళనాడు-పుదుచ్చేరి మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ద్రోణి రేపు తీరం దాటవచ్చని తెలుస్తోంది. దీంతో ఈ నెల 13 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ జనాన్ని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అధికారులతో సీఎం స్టాలిన్ వరుస రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా ప్రాణనష్టం లేకుండా చూడాలని ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..