Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan Election: రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ మారుతుందా? మార్పు అనివార్యమా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన 5 హామీల మాదిరిగా తెలంగాణలో 6 హామీలు, రాజస్థాన్‌లో 7 హామీలను ప్రకటించి విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే కర్ణాటక విజయంలో హామీలకు అప్పటి వరకు పరిపాలించిన భారతీయ జనతా పార్టీ మీద ఏర్పడ్డ వ్యతిరేకత కూడా కలిసొచ్చింది. తెలంగాణలోనూ అదే మాదిరి ఆశాభావంతో ఉంది. రాజస్థాన్‌లో పరిస్థితి పూర్తి భిన్నం.

Rajasthan Election: రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ మారుతుందా? మార్పు అనివార్యమా?
Cm Ashok Gehlot
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Balaraju Goud

Updated on: Nov 22, 2023 | 3:34 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన 5 హామీల మాదిరిగా తెలంగాణలో 6 హామీలు, రాజస్థాన్‌లో 7 హామీలను ప్రకటించి విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే కర్ణాటక విజయంలో హామీలకు అప్పటి వరకు పరిపాలించిన భారతీయ జనతా పార్టీ మీద ఏర్పడ్డ వ్యతిరేకత కూడా కలిసొచ్చింది. తెలంగాణలోనూ అదే మాదిరి ఆశాభావంతో ఉంది. రాజస్థాన్‌లో పరిస్థితి పూర్తి భిన్నం. ఐదేళ్లుగా అక్కడ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. ప్రతిపక్ష బీజేపీ కంటే స్వపక్షంలో సచిన్ పైలట్ నుంచే ఎక్కువ అసమ్మతి సెగను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎదుర్కోవాల్సి వచ్చింది. పైగా ప్రతీ ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ ఆ రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. వాటన్నింటినీ దాటుకుని వరుసగా రెండోసారి అధికారం చేపట్టడానికి ఈ ఏడు హామీలు సరిపోతాయా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో విజయం సాధిస్తే, 2024 సార్వత్రికి ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ బలపడిందని, బలీయమైన శక్తిగా ఎదిగిన బీజేపీకి సమఉజ్జీగా మారిందన్న భావన దేశవ్యాప్తంగా కలగడంతో పాటు ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే, సార్వత్రిక ఎన్నికల ఖర్చులకు అవసరమైన నిధుల సమీకరణ సైతం సులభంగా మారుతుంది. అందుకే విజయం కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధం అన్నట్టుగా ఆ పార్టీ ప్రవర్తిస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్‌లో యువత, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఏడు కీలక హామీలతో పాటు ప్రజాకర్షక మేనిఫెస్టోను నవంబర్ 21న విడుదల చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ సీపీ జోషి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ.. రాష్ట్రంలోని 3.5 కోట్ల మంది ప్రజలను సంప్రదించి తయారు చేశామని, ఇందులో అందరికీ చోటు కల్పించామని చెప్పారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక ప్రజాకర్షక వాగ్దానాలున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య పథకం పరిమితిని రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచడంతోపాటు మహిళలకు ఏటా రూ. 10,000 అందజేస్తానని హామీ ఇచ్చింది. రాజస్థాన్‌లో కుల గణన నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ ఇచ్చేలా సరైన చట్టాన్ని రూపొందిస్తామని పేర్కొంది. రైతులను ఆదుకునేందుకు స్వామినాథన్ నివేదికను అమలు చేస్తామని వెల్లడించింది. చిరంజీవి స్వాస్థ్య యోజన మొత్తాన్ని రెట్టింపు చేయడం, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, కుల గణన తమకు గేమ్ ఛేంజర్‌గా మారతాయని ఆ పార్టీ భావిస్తోంది.

రెట్టింపు ప్రయోజనంతో చిరంజీవి ఆరోగ్య పథకం

రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత వైద్య సదుపాయాలను అందించడానికి చిరంజీవి ఆరోగ్య రక్షణ బీమా పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా గతంలో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం ఉండేదని, క్రమంగా దాన్ని రూ.25 లక్షలకు పెంచామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఆ పరిమితిని రూ.50 లక్షల వరకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ చిరంజీవి యోజన కింద, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఔట్ పేషెంట్ సేవలు పూర్తిగా ఉచితం. అలాగే బ్లాక్ ఫంగస్, గుండె శస్త్రచికిత్స, అవయవ మార్పిడి వంటి అరుదైన, తీవ్రమైన వ్యాధుల చికిత్స కూడా ఈ పథకంలో చేర్చింది. దేశంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకంగా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. తాజాగా చిరంజీవి పథకంలో కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో చేసే వైద్య విధానం IVFను కూడా చేర్చింది. అధిక వ్యయం కారణంగా చాలా మంది పిల్లల్లేని దంపతులు IVF చేయించుకోలేకపోతున్నారని, కానీ ఇప్పుడు వారికి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

చిరంజీవి ఆరోగ్య పథకం కాంగ్రెస్‌కు బూస్టర్ డోస్‌గా ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. వైద్యం కోసం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బిల్లులు కట్టడం కోసం రాజస్థాన్‌లోని ఏ పేద లేదా మధ్యతరగతి కుటుంబం తమ ఆస్తులను విక్రయించాల్సిన అవసరం లేదని, ఖరీదైన వైద్యం కోసం కూడా తమ నగలను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ స్వయంగా ట్వీట్ చేశారు. సీఎం గెహ్లాట్ ప్రతి ఎన్నికల సమావేశంలో చిరంజీవి యోజన గురించి ప్రస్తావిస్తున్నారు, ఎందుకంటే రాష్ట్రంలో అధిక జనాభా దానిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ దాని మొత్తాన్ని రెట్టింపు చేయడంతో రాజకీయ వర్గాల్లో ఓట్లు రాబట్టుకుని మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.

కుల గణనపై కాంగ్రెస్ వాగ్దానం

రాజస్థాన్ రాజకీయాలలో, కుల గణన అంశాన్ని చూపిస్తూ భారతీయ జనతా పార్టీపై ఓబీసీ వ్యతిరేక ముద్ర వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ ప్రతి ర్యాలీలో కుల గణన అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఇప్పుడు తన మేనిఫెస్టోలో కుల సర్వేకు ప్రాధాన్యత కల్పించింది. మేనిఫెస్టోలోని పీఠికలోని మొదటి పంక్తి ‘సామాజిక న్యాయం’, ‘సామాజిక భద్రత’ పదాలతో మొదలవుతుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ విషయాన్ని ప్రకటించగా, ఇప్పుడు మేనిఫెస్టోలో చేర్చి ట్రంప్ కార్డులా వాడుతున్నారు.

కుల గణన తర్వాత బీహార్‌లో రిజర్వేషన్లు ఎలా పెంచారో, అదే విధంగా రాజస్థాన్‌లో రిజర్వేషన్లు పెరుగుతాయన్న ఆశలు ఆయా సామాజికవర్గాల్లో ఉన్నాయి. అందుకే కుల సర్వేను అస్త్రంగా ప్రయోగించి ఓబీసీల ఓట్లను దండుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాజస్థాన్‌లో, OBCలకు 21 శాతం రిజర్వేషన్లు లభిస్తుండగా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఇది 27 శాతం వరకు ఉంది. రాష్ట్రంలో OBC కులాల జనాభా 50 శాతానికి పైగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓబీసీ రిజర్వేషన్ల పరిధిని 21 శాతం నుంచి 27 శాతానికి పెంచాలని గెహ్లాట్ ప్రయత్నించగా, బీహార్ తరహాలో సర్వే నిర్వహించి పెంచాలన్నది వ్యూహంగా భావిస్తున్నారు. పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సీటును ఆశిస్తున్న సచిన్ పైలట్ ఇద్దరూ కూడా ఓబీసీ వర్గాల నుంచి వచ్చినవారే కావడం ఆ పార్టీకి కలిసొచ్చే అశం.

పాత పెన్షన్ స్కీమ్

కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తూనే సీపీ జోషి ప్రభుత్వ ఉద్యోగులపైనా దృష్టి సారించారు. పాత పెన్షన్ స్కీమ్ (OPS) కోసం చట్టం చేయడం గురించి ఆయన మాట్లాడారు. గెహ్లాట్ ప్రభుత్వం ఇప్పటికే రాజస్థాన్‌లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసింది. ఇప్పుడు దానిని చట్టబద్ధంగా అమలు చేయడానికి పూనుకుంది. రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రయోగించిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) ఎత్తుగడ బూస్టర్ డోస్ కంటే తక్కువేమీ కాదు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ‘ఓపీఎస్‌కు చట్టబద్ధమైన హోదా’ హామీ అంటే కాంగ్రెస్ ‘ఓపీఎస్’ని కేవలం ఎన్నికల హామీకి పరిమితం చేయలేదు. మొదట ఓపీఎస్‌ను అమలు చేశామని, ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ చెప్పగలదు. బీజేపీ తన మేనిఫెస్టోలో ఎక్కడా పాత పెన్షన్ విధానాన్ని ప్రస్తావించలేదు.

రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లకు రాజకీయ సమీకరణాలు మార్చగలిగే సామర్థ్యం ఉంది. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు/రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. అంతే కాకుండా ప్రభుత్వోద్యోగుల కుటుంబాల ఓట్లు కూడా కలుపుకుంటే మంచి ఓటు బ్యాంకు ఏర్పడుతుంది. ఈ లెక్కన ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 వేల ఓట్లు వస్తాయి. అందుకే ఈ సంఖ్య రాజకీయ సమీకరణాలను మార్చగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రైతులపై వరాల జల్లు

స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేయడం ద్వారా గిట్టుబాటు ధర కల్పిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అలాగే రైతులకు రూ.2 లక్షల వరకు వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పింది. రాజస్థాన్‌లో 80 లక్షల మంది రైతులు ఉన్నారు. రైతులు చాలా కాలంగా గిట్టుబాటు ధర కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ద్వారా రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే బీజేపీ కూడా గోధుమ పంటను క్వింటాల్‌కు రూ. 2,700కు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే కిసాన్ సమ్మాన్ నిధిని రూ. 7,000కు పెంచుతామని చెప్పింది. రాజస్థాన్ రాజకీయాల్లో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏ పార్టీనైనా గద్దె దించే శక్తి రైతులకు ఉంది. రైతుల విశ్వాసాన్ని చూరగొనడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నించడానికి ఇదే కారణం.

రైతుల మాదిరిగానే యువత, మహిళలు కూడా రాజస్థాన్ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్, బీజేపీలు వరుస వాగ్దానాలు చేశాయి. ఐదేళ్లలో 2.5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ప్రకటించగా, 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ఈ విధంగా బీజేపీ కంటే రెట్టింపు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పడం ద్వారా పైచేయి సాధించాలని చూస్తోంది. రాజస్థాన్‌లో 22 లక్షల మందికి పైగా మొదటిసారి ఓటర్లు ఉన్నారు. 30 ఏళ్ల లోపు ఓటర్లు 1.53 కోట్ల మంది ఉన్నారు. ఇది మొత్తం ఓటర్లలో 30 శాతం.

మహిళల భద్రతను బీజేపీ అతిపెద్ద ఎన్నికల అస్త్రంగా మార్చుకుంటోంది. రాజస్థాన్‌లోని ప్రతి నగరంలో యాంటీ రోమియో ఫోర్స్‌ని సిద్ధం చేస్తామని ప్రకటించింది. అంతే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పింది. లాడో ఇన్సెంటివ్ స్కీమ్ కింద, అన్ని పేద కుటుంబాల నుండి ఆడపిల్లలు పుట్టినప్పుడు ‘సేవింగ్ బాండ్స్’ ఇస్తామని ఆ పార్టీ చెబుతోంది. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద అన్ని పేద కుటుంబాల మహిళలకు రూ.450కే సిలిండర్లు అందజేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

కాంగ్రెస్ కూడా మహిళలను ఆకట్టుకోవడం కోసం మహిళల భద్రతకు గార్డులను నియమిస్తామని, బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెబుతోంది. ప్రతి ఇంటి ఆడపడుచుకు ఏడాదికి రూ.10వేలు, గ్యాస్‌ సిలిండర్‌ రూ.400లకే ఇస్తామని ప్రకటించి జనాభాలో సగభాగాన్ని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ వేసింది. రాజస్థాన్‌లో 2. 53 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా ఓటర్లు ఎవరిని నమ్ముతారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…