AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌కు పుతిన్.. ప్రధాని మోదీతో ఆ డీల్‌పై కీలక చర్చలు.. ప్రపంచ రాజకీయాల్లో ఆసక్తి..

రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4, 5న భారత్‌లో పర్యటిస్తారు. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనున్నారు. S400 క్షిపణులు, Su-57 యుద్ధ విమానాల కొనుగోలు, చమురు డిస్కౌంట్‌లు, ఉక్రెయిన్ వివాదంపై కీలక చర్చలు జరుగుతాయి.

భారత్‌కు పుతిన్.. ప్రధాని మోదీతో ఆ డీల్‌పై కీలక చర్చలు.. ప్రపంచ రాజకీయాల్లో ఆసక్తి..
Putins India Visit
Krishna S
|

Updated on: Nov 29, 2025 | 11:59 AM

Share

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం డిసెంబర్ 4 నుండి 5 వరకు భారత్‌ను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ఆయన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ పర్యటనను ధృవీకరించింది.‘‘ ఈ పర్యటన ఇరు దేశాల నాయకత్వానికి ప్రత్యేకం. విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అలాగే ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది’’అని తెలిపింది.

రక్షణ సహకారం – S400 క్షిపణి వ్యవస్థలు

ఈ శిఖరాగ్ర సమావేశంలో రక్షణ అంశాలు అజెండాలో ప్రముఖంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 వ్యవస్థ చాలా బాగా పనిచేశాయని రుజువు కావడంతో, భారత్ రష్యా నుంచి మరిన్ని S-400 వ్యవస్థలను కొనుగోలు చేయాలని చూస్తోంది. అయితే S-400 క్షిపణి వ్యవస్థల డెలివరీలో ఆలస్యం జరుగుతోంది. ఈ జాప్యానికి గల కారణాలను, మిగిలిన డెలివరీలు ఎప్పుడు పూర్తవుతాయో రష్యాను అడుగుతామని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. కనీసం రెండు స్క్వాడ్రన్ల అత్యాధునిక Su-57 యుద్ధ విమానాలను కొనుగోలు చేసే విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే UH, సుఖోయ్ అప్‌గ్రేడేషన్ వంటి ఇతర ప్రధాన కార్యక్రమాలలో జాప్యాలను కూడా చర్చించి, వాటిని వేగవంతం చేయడానికి కృషి చేస్తామని సింగ్ తెలిపారు.

చమురు – ఉక్రెయిన్ వివాదం

పుతిన్ పర్యటనలో అంతర్జాతీయ అంశాలు కూడా కీలకంకానున్నాయి. అమెరికా ఆంక్షల తర్వాత భారత్ చమురు కొనుగోళ్లను తగ్గించింది. అందుకే భారత్‌కు ముడి చమురు కొనడానికి రష్యా మరిన్ని డిస్కౌంట్‌లు ఇచ్చే అవకాశం ఉంది. ఉక్రెయిన్ వివాదం త్వరగా ముగియాలని, శాశ్వత శాంతి నెలకొనాలని ప్రధాని మోదీ పదేపదే కోరుతున్నారు. ఈ యుద్ధాన్ని ఆపే శాంతి మార్గం గురించి కూడా మోదీ, పుతిన్ చర్చిస్తారు. ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో చర్చించి, వివాదాన్ని త్వరగా ముగించడానికి, శాశ్వత శాంతిని నెలకొల్పడానికి భారత్ మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. ఈ అంశంపై పుతిన్, మోదీ మధ్య చర్చల్లో కీలక స్థానం లభించే అవకాశం ఉంది.

రష్యా ఎప్పుడూ భారతదేశానికి ఒక నమ్మకమైన స్నేహితుడిగా ఉంది. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పుతిన్‌కు విందు ఇవ్వనున్నారు. పుతిన్ చివరిసారిగా డిసెంబర్ 2021లో భారతదేశంలో పర్యటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us