బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌తో రాజీ.. సీఎం – డిప్యూటీ సీఎం సైలెంట్ వెనక సస్పెన్స్ ఏంటీ..?
కర్ణాటక కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదానికి తాత్కాలిక బ్రేక్ పడిందా.. సీఎం సిద్ధరామయ్య - డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య రాజీ కుదిరిందా.. అసలు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో ఈ ఇరువురు నేతలు ఏం చర్చించారు. పైకి తమ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని చెబుతున్నప్పటికీ.. లోపల ఎవరి ప్రయత్నాల్లో వారున్నారా..? అనేది తెలుసుకుందాం..

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య – డిప్యూటీ సీఎం మధ్య నెలకొన్న అధికార పోరుకు తాత్కాలికంగా తెరపడినట్లు కనిపిస్తోంది. శనివారం ఉదయం వీరిద్దరూ కలిసి నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ అనంతరం, ఇరువురు నేతలు తాము రాజీకి వచ్చినట్లు ప్రకటించారు. రాజకీయ విశ్లేషకులు ఈ భేటీని కాంప్రమైజ్ మీటింగ్‌గా అభివర్ణించారు. సమావేశం తర్వాత ఇద్దరు నేతలు తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దానికి కట్టుబడి ఉంటామని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రకటించారు.
ఈ క్రమంలో ఈ ఇద్దరు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. నెల రోజులుగా పార్టీలో గందరగోళం సృష్టించడానికి కొందరు ప్రయత్నించారని, అయితే తమ మధ్య విభేదాలు లేవని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ‘‘నెల రోజులుగా కొందరు కావాలనే గందరగోళాన్ని సృష్టించారు. ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నం చేసినా, మా ప్రభుత్వాన్ని కూల్చలేరు. మాకు అధిష్టానం నిర్ణయమే ముఖ్యం’’ అని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ఏకైక లక్ష్యం 2028లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించడమేనని ఇరువురు నేతలు ప్రకటించారు.
మంత్రుల ప్రకటనలకు చెక్
ఇద్దరు నేతలు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని పైకిచెబుతున్నప్పటికీ.. లోపల ఎవరి ప్రయత్నాల్లో వారున్నారని కొంతమంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. సీఎం మార్పు అంశంపై అధిష్ఠానం ఆయనతో కీలక చర్చలు జరపనుంది. కాగా సీఎం మార్పుపై గత కొద్ది రోజులుగా ఇరువర్గాల నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సంయుక్త ప్రకటన పార్టీలో గందరగోళానికి తాత్కాలికంగా తెరదించే అవకాశం ఉంది. రాజీ ఫార్ములా ప్రకారం, సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణీత కాలం పాటు కొనసాగుతారా..? లేదా డీకేఎస్‌కు భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా అనేది హైకమాండ్ డిసైడ్ చేయనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
