Presidential Election 2022: ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు.. మరికాసేపట్లో లెక్కింపు.. ముర్ము విజయం లాంఛనమే..
Draupadi Murmu or Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా బ్యాలెట్ పేపర్లను క్రమపద్దతిలో..
ఇవాళ దేశ 15వ రాష్ట్రపతి నిర్ణయం జరుగనుంది. పార్లమెంట్ హౌస్‌లో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా బ్యాలెట్ పేపర్లను క్రమపద్దతిలో అమర్చనున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారులు వాటిని పరిశీలించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు వచ్చిన తొలి ప్రాధాన్యత ఓటు ఆధారంగా బ్యాలెట్ పేపర్లను విడి విడిగా కట్టలు కట్టి టేబుల్పై ఉన్న ట్రేలలో పెడతారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందులో మొదట ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఎంపీల బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు.
99 శాతానికి పైగా ఓటింగ్..
పార్లమెంటు ఉభయ సభలు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ ఎంపీలు మినహా అన్ని రాష్ట్రాల శాసనసభల సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారు. సోమవారం జరిగిన ఓటింగ్‌లో 99 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. భారతీయ జనతా పార్టీ ఎంపీలు సన్నీ డియోల్, సంజయ్ ధోత్రే సహా ఎనిమిది మంది ఎంపీలు ఓటు వేయలేకపోయారు. పోలింగ్ సమయంలో డియోల్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లగా, ధోత్రే ఐసీయూలో ఉన్నారు. బీజేపీ, శివసేన, బహుజన్ సమాజ్ పార్టీ (BSP), కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (SP), ఏఐఎంఐఎంలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయలేదు.
776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు సహా మొత్తం 4,809 మంది ఓటర్లు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులు. నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు ఇందులో ఓటు వేయలేరు. రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ హౌస్‌తో పాటు 31 చోట్ల, అసెంబ్లీ పరిధిలోని 30 కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. అనేక రాష్ట్రాల్లో ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఇదిలావుంటే.. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 10,69,358 ఓట్లకు గాను కోవింద్ 7,02,044 ఓట్లతో విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి మీరా కుమార్‌కు 3,67,314 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం లాంఛనమే అని చెప్పాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలిస్తే దేశంలోనే తొలి గిరిజన మహిళ అధ్యక్షురాలిగా అవతరిస్తారు.
15 ఏళ్ల క్రితం ఈరోజు జూలై 21న దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా ప్రతిభా దేవిసింగ్ పాటిల్ ఎంపికయ్యారు. 21 జూలై 2007న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రతిభా దేవిసింగ్ పాటిల్ విజయం సాధించారు. ఆ తర్వాత 2007 జూలై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.