PM Narendra Modi: ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఇవాళ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగం..
మోదీ ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడంపై ప్రధాని మోడీ నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
PM Modi to address BJP’s officer bearers: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు నాయకులతో సంభాషించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం జరిగే బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. మోదీ ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడంపై ప్రధాని మోడీ నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతోపాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై, వ్యూహాలపై మోడీ కీలక సూచనలు ఇవ్వనున్నారు. కాగా.. గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశంతో ఆ పార్టీ జాతీయ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కుషాభౌ ఠాక్రే, సుందర్ సింగ్ భండారీ జీవిత చరిత్ర ఆధారంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించనున్నారు.
ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శుల నుంచి ఆయా రాష్ట్రాల సవివర నివేదికలను నడ్డా తీసుకున్నారని, పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం.
బీజేపీ సమావేశంలో జాతీయ ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర పార్టీ ముఖ్యులు, సంస్థాగత కార్యదర్శులతో సహా పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. నడ్డా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సంస్థాగత అంశాలపై దృష్టి సారించడంతో పాటు ఈ ఏడాది, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహక అంశాలపై కూడా చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా.. ఈ ఏడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర, మధ్యప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌లలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై కూడా చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..