AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలా..? మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై ప్రతిపక్షాలవి బాధ్యతారహిత వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ప్రస్తుత ఘర్షణల నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంలో దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల ప్రాధాన్యంగా చూసేలా వ్యాఖ్యలు చేయడం.. విపక్ష నేతల బాధ్యతారాహిత్యమని.. ఇలాంటివి తగవంటూ కిషన్ రెడ్డి విమర్శించారు.

ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలా..? మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై ప్రతిపక్షాలవి బాధ్యతారహిత వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి
Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Mar 12, 2026 | 1:25 PM

Share

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ప్రస్తుత ఘర్షణల నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంలో దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల ప్రాధాన్యంగా చూసేలా వ్యాఖ్యలు చేయడం.. విపక్ష నేతల బాధ్యతారాహిత్యమని.. ఇలాంటివి తగవంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి.. గురువారం ప్రకటన విడుదల చేశారు. 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భారత ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో దేశాన్ని “ఫ్రాజైల్ 5” దేశాల జాబితాలో చేర్చారని తెలిపారు. విదేశీ మారక నిల్వలను ఆదా చేయడానికి ఇంధన వినియోగాన్ని 3 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రచారం ప్రారంభించిందని చెప్పారు.

ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పెట్రోల్ బంకులను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూసివేయాలని సూచించారని, అప్పటి పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ ఆ ప్రతిపాదనను పరిశీలించారని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు, వ్యాపారవేత్తలు, మేధావులు, సామాజిక వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని తెలిపారు.

అప్పటి యూపీఏ ప్రభుత్వం శాంతి సమయంలోనే దేశ ఇంధన భద్రతను సమర్థంగా నిర్వహించలేకపోయిందని, అలాంటి పరిస్థితిలో మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు ఏర్పడితే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చని కిషన్ రెడ్డి వివరించారు..

ప్రస్తుతం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వ్యూహాత్మకంగా బలపడిందని కిషన్ రెడ్డి తెలిపారు. గత 12 సంవత్సరాల్లో భారత్ స్వతంత్రంగా గ్లోబల్ శక్తిగా ఎదిగిందని చెప్పారు.

గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ పనిచేస్తున్న సుమారు 90 లక్షల భారతీయుల భద్రత మోదీ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ అనుసరిస్తున్న బహుముఖ దౌత్య విధానం వల్ల భారతీయుల భద్రతకు అన్ని మార్గాల్లో రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సమయంలో కూడా కొందరు రాజకీయ వర్గాలు తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్ ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు నిల్వలు దాచిపెట్టడం, బ్లాక్ మార్కెట్‌కు దారితీసే పరిస్థితులు సృష్టించే ప్రమాదం ఉందని అన్నారు.

ఇంధన భద్రత విషయంలో యూపీఏ కాలంలో దేశం ఒకే వనరుపై ఆధారపడిందని, ఉదాహరణకు 2012–13లో ఇరాన్‌పై ఆంక్షలు విధించబడినప్పుడు భారత్‌కు ఇరాన్ నుంచి దిగుమతి అయ్యే క్రూడ్ ఆయిల్ 26.5 శాతం తగ్గిపోయిందని చెప్పారు. అప్పట్లో సరఫరా వైవిధ్యం లేదా అత్యవసర ప్రణాళిక లేకపోవడం వల్ల దేశానికి ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చిందని తెలిపారు.

ప్రస్తుతం మోదీ ప్రభుత్వ చర్యల వల్ల దేశానికి బలమైన ఇంధన భద్రత వ్యవస్థ ఏర్పడిందని కిషన్ రెడ్డి వివరించారు.

ప్రధాన చర్యలు ఇవి:

వైవిధ్యమైన సరఫరా: భారత్ క్రూడ్ ఆయిల్ సరఫరాదారుల సంఖ్యను 27 దేశాల నుంచి 40 దేశాలకు పెంచింది. అర్జెంటీనా, వెనిజులా వంటి దక్షిణ అమెరికా దేశాలతో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడ్డాయి.

స్ట్రాటజిక్ పెట్రోలియం నిల్వలు: విశాఖపట్నం, మంగళూరు, పడూర్ ప్రాంతాల్లో ఉన్న భూగర్భ నిల్వలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. పరిశ్రమల నిల్వలతో కలిపి భారత్ 74 రోజుల వరకు సరఫరా అంతరాయాలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది.

శక్తివంతమైన రిఫైనరీలు: ప్రస్తుతం భారత రిఫైనరీలు వివిధ రకాల క్రూడ్ ఆయిల్‌ను శుద్ధి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. దీంతో భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా, ఐదవ అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఎదిగింది.

వాణిజ్య నౌకల రక్షణ: భారత నౌకలపై దాడులను సహించబోమనే విధానం అమల్లో ఉందని తెలిపారు.

హోర్ముజ్ జలసంధి: భారత్ కోసం హోర్ముజ్ జలసంధి తెరిచి ఉంటుందని ఇరాన్ తెలిపిందని అన్నారు.

దేశీయ వినియోగదారుల రక్షణ: దేశీయ LPG ఉత్పత్తి 25 శాతం పెరిగిందని, విదేశాల నుంచి LPG, LNG సరఫరా కూడా కొనసాగుతోందని తెలిపారు.

రైతుల రక్షణ: ఎరువుల తయారీ యూనిట్లను ప్రాధాన్య రంగంగా గుర్తించి సహజ వాయువు సరఫరా నిరంతరం అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ప్రపంచంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ తన ప్రజల భద్రత, ఇంధన సరఫరా, వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us