India: ప్రకృతి విపత్తు వేళ మయన్మార్, థాయ్‌లాండ్‌లకు భారత్ ఏం పంపిందంటే..?
భారీ భూకంపంతో కకావికలమైన మయన్మార్, థాయ్‌లాండ్‌లకు భారత్ ఆపన్న హస్తం అందించింది. గాయపడ్డ దేశాలకు భారీ సాయం అందిస్తోంది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్, థాయ్‌లాండ్‌లను ఆదుకునేందుకు అన్ని రకాలుగా నడుం బిగించింది. ఆహారం, మెడిసిన్‌తో పాటు రెస్క్యూ టీమ్స్‌ను కూడా తరలించింది.

ప్రకృతి ప్రకోపంతో ప్రపంచంలో ఏ దేశం దెబ్బ తిన్నా…ఆదుకునేందుకు తానున్నా అంటుంది భారత్. అలాంటిది పొరుగునే ఉన్న మయన్మార్…భారీ భూకంపంతో విలవిల్లాడితే మన దేశం చూస్తూ ఊరుకుంటుందా? వెంటనే రంగంలోకి దిగింది. మయన్మార్‌తో పాటు భూకంపం ధాటికి దెబ్బతిన్న థాయ్‌లాండ్‌కు కూడా సాయం చెయ్యడానికి నడుం బిగించింది. భూకంపంతో విలవిల్లాడిన మయన్మార్‌కు తొలిసాయం భారత్ నుంచే అందింది.
15 టన్నుల సహాయ మెటీరియల్ తరలింపు
ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మూడు స్పెషల్ విమానాల్లో సహాయక సామాగ్రిని మయన్మార్‌కు తరలించింది భారత్. యూపీలోని ఘజియాబాద్ ఇండస్ ఎయిర్ బేస్ నుంచి మయన్మార్‌కు 15టన్నుల సహాయ మెటీరియల్ ను పంపింది. విమానాల్లో ఆహారం, మెడిసిన్, జనరేటర్లు, టెంట్లు, బ్యాగులు, దుప్పట్లు, వాటర్ క్లీనింగ్ మెటీరియల్ పంపించారు. మయన్మార్, థాయ్‌లాండ్‌కు మరింత సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు విదేశాంగ శాఖ అధికారులు.
రెస్క్యూ సిబ్బందిని పంపిన తొలి దేశం భారత్
మరోవైపు మయన్మార్‌లోని నేపిడాలో NDRF బృందంతో మొదటి C-130 విమానం దిగింది. ఈ బృందాన్ని భారత రాయబారి, మయన్మార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయబారి మాంగ్ మాంగ్ లిన్ రిసీవ్ చేసుకున్నారు. భూకంపం తర్వాత విమానాశ్రయం పాక్షికంగా పనిచేయకపోయినా రాజధానికి రెస్క్యూ సిబ్బందిని పంపిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఆ తర్వాత NDRF బృందం…సహాయక చర్యల కోసం మాండలేకు బయలుదేరి వెళ్లింది. సహాయ కార్యకలాపాల కోసం అక్కడికి చేరుకున్న మొదటి రెస్క్యూ బృందం ఇదే కావడం విశేషం.
భారత్ బాటలోనే ప్రపంచం మొత్తం నడుస్తోంది. మయన్మార్‌కు సాయం అందించడానికి చైనా, రష్యా, మలేషియా వంటి దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. చైనా రెస్క్యూ బృందాలు, పరికరాలను పంపగా, భారతదేశం 80 మంది సభ్యుల NDRF బృందాన్ని వైద్య సదుపాయాలతో పాటు పంపింది. ఇక సహాయ చర్యల కోసం 5 మిలియన్లు డాలర్లు కేటాయించింది. దక్షిణ కొరియా,USతో సహా ఇతర దేశాలు కూడా సహాయాన్ని అందిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..