Odisha: నెయిల్ కట్టర్ తో పాము కోరాలు పీకేశాడు.. మండిపడుతున్న నెటిజన్లు..
పాము కనిపిస్తే చాలు.. గుండెలు అదిరిపోతాయి. భయంతో అక్కడి నుంచి పరుగు అందుకుంటాం. ఇక పాము దగ్గరకు వెళ్లే సాహసం కూడా ఎవరూ చేయరు. కానీ కొందరు మాత్రం పాములతో చక్కగా ఆడుకుంటారు. అయితే కొంత...

పాము కనిపిస్తే చాలు.. గుండెలు అదిరిపోతాయి. భయంతో అక్కడి నుంచి పరుగు అందుకుంటాం. ఇక పాము దగ్గరకు వెళ్లే సాహసం కూడా ఎవరూ చేయరు. కానీ కొందరు మాత్రం పాములతో చక్కగా ఆడుకుంటారు. అయితే కొంత మంది మాత్రం పాము విషం కోసం వాటిని వేటాడుతుంటారు. దారుణంగా కోరలు పీకేసి, విషాన్ని సేకరిస్తుంటారు. ఇలా చేయడం చట్ట ప్రకారం విరుద్ధం. కానీ కొందరు నేరగాళ్లు మాత్రం ఇలాంటివేవీ ఆలోచించడం లేదు. తాజాగా నెయిల్ కట్టర్ తో కింగ్ కోబ్రా కోరలను పీకేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కోరలను పీకుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీనిని తీవ్రంగా తీసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాము నాగుపాము. ఒడిశా లోని బలంగీర్ జిల్లాలోని బిలిసర్దా గ్రామంలో ఓ వ్యక్తి ప్రమాదకర పామును పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా దాని కోరలు తీసేందుకు నెయిల్ కట్టర్‌ను ఉపయోగించాడు. అతని నుంచి తప్పించుకునేందుకు పాము తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. బాధతో మెలికలు తిరుగుతున్నా అతడు మాత్రం వదలకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న అటవీ అధికారులు పామును రక్షించారు. పాము కోరలను తొలగిస్తున్నారనే అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
వన్యప్రాణుల చట్టం ప్రకారం పామును రక్షించిన తర్వాత దానిని అడవిలోకి విడిచిపెట్టాలి. కోరలు తీసే విధానం చట్టవిరుద్ధం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తు్న్నారు. మూగజీవాలను తీవ్ర హింసకు గురిచేస్తున్నాడని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..