FIFA World Cup 2022: ఆ టీమ్ గెలిస్తే ఉచితంగా బిర్యానీ.. అభిమానాన్ని చాటుకున్న షాప్ ఓనర్..
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన టోర్నమెంట్‌లలో ఫిఫా వరల్డ్ కప్ కూడా ఒకటి. ఫిఫా టోర్నమెంట్ జరుగుతుందంటే ఫుట్‌బాల్ అభిమానులకు పండగే అంటే అతిశయోక్తి కాదేమో.. మరి అలాంటి

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ ఉన్న ఆటలలో ఫుట్‌బాల్ ఒకటి. ఫుట్‌బాల్ టోర్నమెంట్ అంటే అభిమానులు తిండితిప్పుల లేకుండా టీవీ అతుక్కుపోవడం లేదా మ్యాచ్ జరిగే మైదానం ఎంత దూరంలో ఉన్నా వెళ్లి చూసిరావడం అనేది వారికి సర్వసాధారణమైన విషయమే. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన టోర్నమెంట్‌లలో ఫిఫా వరల్డ్ కప్ కూడా ఒకటి. ఫిఫా టోర్నమెంట్ జరుగుతుందంటే ఫుట్‌బాల్ అభిమానులకు పండగే అంటే అతిశయోక్తి కాదేమో.. మరి అలాంటి టోర్నమెంట్‌లో తమ అభిమాన జట్టు గెలవాలని, అభిమాన ఆటగాళ్లు గోల్స్ చేయాలని ఏ అభిమాని మాత్రం కోరుకోడు? అలాంటి అభిమానులే మన దేశంలోనూ ఉన్నారు. ఖతర్‌లో ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ 2022 జరుగుతున్న నేపథ్యంలో కేరళకు చెందిన ఓ అభిమాని కీలక ప్రకటన చేశాడు. తన అభిమాన జట్టు ప్రపంచకప్‌ను అందుకుంటే తన రెస్టారెంట్‌లో ఉచితంగా బిర్యానీ తినవచ్చని ప్రకటించాడు.
అర్జెంటీనా దేశ ఫుట్‌బాల్ టీమ్‌కు వీరాభిమాని అయిన సీపీ సాహద్.. కోజికోడ్ జిల్లాలోని ఎరన్హిక్కల్‌లో సీపీహెచ్ అచార్ కాడా అనే షాప్ ఓనర్. తాను అభిమానించే అర్జెంటీనా జట్టు ఫిఫా విజేతగా నిలిస్తే ఫ్రీ బిర్యానీ అని ప్రకటించాడు. అంతేనా.. ఏకంగా ‘ ఖతర్‌లో జరిగే ఫిఫా వరల్డ్ కప్‌ను అర్జెంటీనా గెలుచుకుంటే ఉచితంగా బిర్యానీ’ అని ప్రమాణం చేశాడు. ఈ విషయంలో అనుమానాలు ఉంటే సాహద్ షాప్‌కు ఎదురుగా ఉన్న బోర్డ్‌ను చూస్తే అన్ని తీరిపోతాయి. షాప్ ఎదురుగా అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ ఉన్న 10 అడుగుల కటౌట్ ఉంటుంది. అంతేకాక తన అభిమాన జట్టు జెర్సీ ఉండే రంగులతోనే.. అంటే తెలుసు, నీలం రంగులతో తన షాప్‌ను అలంకరించుకున్నాడు. దీంతో స్థానికులంతా ఆ షాప్ దగ్గరకు వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు.
కేరళలోని వెల్లాయిల్ గ్రామానికి చెందిన సాహద్ రెండు సంవత్సరాల క్రితమే ఎరన్హిక్కల్‌లో తన షాప్‌ను ప్రారంభించాడు. తనకు అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్‌పై తనకు ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ తన షాప్ గోడల నిండా ఆ జట్టు ఆటగాళ్ల ఫొటోలతోనే నింపేశాడు. అంతేకాక తన బైక్ మీద అర్జెంటీనా జెండా, మెస్సీ స్టిక్కర్‌ను వేయించాడు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూసేందుకు తన షాప్ బయట ఒక పెద్ద టీవీని కూడా ఏర్పాటు చేయాలని అతను భావిస్తున్నట్లు చెప్తున్నాడు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
