Bihar: వీళ్లసలు మనుషులేనా.. మంత్రగత్తె అనే నెపంతో మహిళను ఏం చేశారో తెలుసా..
సభ్య సమాజం తల దించుకునే ఘటన ఇది. టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో మంత్రాలు, చేతబడులు అంటూ దారుణాలకు తెగబడుతున్నారు. ఓ మహిళను మంత్రగత్తె అని ఆరోపిస్తూ గ్రామస్థులు సజీవ దహనం చేశారు. ఆమెను కొట్టి,..
సభ్య సమాజం తల దించుకునే ఘటన ఇది. టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో మంత్రాలు, చేతబడులు అంటూ దారుణాలకు తెగబడుతున్నారు. ఓ మహిళను మంత్రగత్తె అని ఆరోపిస్తూ గ్రామస్థులు సజీవ దహనం చేశారు. ఆమెను కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమె ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. సమాచారం అందుకుని గ్రామానికి చేరుకున్న పోలీసులపై గ్రామస్థులు రాళ్లు రువ్వారు. కాగా.. మహిళను సజీవ దహనం చేసిన ఘటన చాలా భయానకంగా ఉంది. మృతి చెందిన మహిళ వయసు 40 ఏళ్లు ఉంటుందని గుర్తించారు. మహిళ మంత్రగత్తె అని ఆరోపించారు. బిహార్ లోని గయ జిల్లా మాగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని వచ్మా గ్రామానికి చెందిన చంద్రదేవ్ భుయాన్ కుమారుడు నెల రోజుల క్రితం మృతి చెందాడు. అతను చనిపోవడానికి అదే గ్రామంలో ఉండే మరో మహిళ కారణమని గ్రామస్థులు ఆరోపించారు. ఆమె మంత్రగత్తె అని దూషించారు. పంచాయతీ నిర్వహించి పరిష్కారం చూపాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో జార్ఖండ్‌లోని నోడిహా ప్రాంతానికి చెందిన ఓఝా మున్నా భగత్‌ను చంద్రదేవ్ భుయాన్ తరపున పంచాయితీకి పిలిచారు.మున్నా భగత్ ఆదేశాల మేరకు.. సదరు మహిళను మంత్రగత్తెగా నిర్ధరిస్తూ గ్రామ పెద్దలు మరణ శిక్ష విధించారు.
దీంతో ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఇంట్లో దాక్కున్న మహిళను బయటకు లాగి.. గుంపుగా గుమిగూడి మహిళను తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక ఆమె స్పృహ కోల్పోయింంది. ఆమెకు చికిత్స అందించకుండా మరింత అమానుషంగా ప్రవర్తించారు. స్పృహ తప్పి పడి ఉన్న మహిళపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గయా మగద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఇమామ్‌గంజ్ డీఎస్పీ మనోజ్ రామ్ మాట్లాడుతూ మాగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్మా గ్రామంలో ఓ మహిళను మంత్రగత్తె అని ఆరోపిస్తూ సజీవ దహనం చేశారని చెప్పారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నామని, గ్రామంలోని కొందరు వ్యక్తులు మహిళపై సామూహిక దాడికి పాల్పడ్డారని, ఆ కోణంలో దర్యాప్తు సాగుతోందని వివరించారు. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి