Republic Day 2026 Parade: న్యూఢిల్లీ గణతంత్ర దినోత్సవం పరేడ్‌కు ఎంట్రీ టికెట్లు విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలంటే?
దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం టిక్కెట్ల విక్రయాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గణతంత్ర దినోత్సవ పరేడ్, బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రెస్ రిహార్సల్‌తో సహా మూడు కార్యక్రమాల కోసం టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. జనవరి 5 నుంచి..

న్యూఢిల్లీ, జనవరి 9: గణతంత్ర దినోత్సవం సమీపిస్తుంది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం టిక్కెట్ల విక్రయాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గణతంత్ర దినోత్సవ పరేడ్, బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రెస్ రిహార్సల్‌తో సహా మూడు కార్యక్రమాల కోసం టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. జనవరి 5 నుంచి జనవరి 14 వరకు టిక్కెట్లు అమ్మకానికి అందుబాటులో ఉంచింది. టిక్కెట్లను ఆమంత్రన్ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదంటే దేశ వ్యాప్తంగా ఆరు ప్రదేశాలలో ఏర్పాటు చేసిన కౌంటర్ల నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
ఆన్‌లైన్‌లో టిక్కెట్లు ఎలా కొనుగోలు చేయాలంటే..
ముందుగా అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి. అక్కడ ఇప్పటికే మీరు రిజిస్ట్రేషన్ చేసకుని ఉంటే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. గణతంత్ర దినోత్సవ పరేడ్, బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రెస్ రిహార్సల్ లేదా బీటింగ్ రిట్రీట్ పరేడ్ వరకు ఈవెంట్ల లిస్ట్ కనిపిస్తుంది. ఆసక్తి ఉన్న ఈవెంట్‌లను ఎంచుకోవాలి. అనంతరం గుర్తింపు రుజువు, పుట్టిన తేదీ, పేరు, చిరునామా మొదలైన వాటితో సహా గుర్తింపు వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ప్రవేశం కోసం ఇ-టిక్కెట్ లభిస్తుంది. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడి కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి కార్డును అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే టిక్కెట్లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.
తేదీల వారీగా ఈవెంట్స్ వివరాలు ఇవే..
- జనవరి 26: గణతంత్ర దినోత్సవ పరేడ్
- జనవరి 28: బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రెస్ రిహార్సల్
- జనవరి 29: బీటింగ్ రిట్రీట్ వేడుక
ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు ఎక్కడ కొనాలి?
ఢిల్లీలోని ఆరు ప్రదేశాలలో ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కూడా అందుబాటులో ఉంది.
- సేనా భవన్ (సరిహద్దు గోడ లోపల గేట్ నెం. 5 దగ్గర)
- శాస్త్రి భవన్ (సరిహద్దు గోడ లోపల గేట్ నెం. 3 దగ్గర)
- జంతర్ మంతర్ (ప్రధాన గేట్-సరిహద్దు గోడ లోపల)
- పార్లమెంట్ హౌస్ (రిసెప్షన్)
- రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ (డి బ్లాక్, గేట్ నెం. 3 మరియు 4 దగ్గర)
- కశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ (కాన్‌కోర్స్ స్థాయి, గేట్ నెం. 8 దగ్గర)
ఈ ఆరు ప్రదేశాలలో జనవరి 5 నుంచి జనవరి 14 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ మూడు కార్యక్రమాలకు కూడా పైన సూచించిన విధంగా ఏదైనా ఒక ఫోటో ఐడి కార్డును తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ప్రతి ఈవెంట్‌కు వేర్వేరు ధరలు ఉన్నాయి. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ టిక్కెట్ల ధరలు రూ.20 నుంచి రూ.100గా ఉన్నాయి. పూర్తి స్థాయి రిహార్సల్ జనవరి 28న జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి ప్రవేశం రూ.20కే లభిస్తుంది. అయితే బీటింగ్ రిట్రీట్ ఈవెంట్‌కు టిక్కెట్ల ధర రూ.100 చొప్పున ఉంటాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




