Gun Culture: గన్ కల్చర్‌పై ఆప్ ఉక్కుపాదం.. గన్ పట్టుకుంటే జైలే గతి..
రోజురోజుకు పెరిగిపోతున్న గన్ కల్చర్‌పై, విద్వేషపూరిత ప్రసంగాలపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో..
రోజురోజుకు పెరిగిపోతున్న గన్ కల్చర్‌పై, విద్వేషపూరిత ప్రసంగాలపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం.. పంజాబ్‌లో ఎంతో కాలంగా భాగమైపోయిన గన్ కల్చర్‌పై నిషేధం ప్రకటించింది. అంతేకాకుండా విద్వేష పూరిత ప్రసంగాలు చేసేవారిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని.. బహిరంగంగా ఆయుధాలు చూపించడాన్ని, హింసను ప్రోత్సహించే పాటలు పాడడాన్ని చట్టవ్యతిరేక చర్యలుగా ప్రకటించింది. రానున్న మూడు నెలల లోపు గన్ లైసెన్స్‌లపై సమగ్ర స్థాయిలో సమీక్షించాలని కూడా నిర్ణయించింది. అంతేకాక అనర్హులకు లైసెన్స్‌కు జారీ చేసి ఉంటే వాటిని వెంటనే రద్దు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది.
పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయాని ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో భగవాన్‌మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అదివారం ఈ నిర్ణయాలు తీసుకుంది. తప్పని పరిస్థితుల్లో లైసెన్స్ ఇవ్వవలసి వస్తే జిల్లా కలెక్టర్ మాత్రమే దానిపై నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వులను జారీ చేసింది. విచక్షణారాహిత్యంగా గన్ పేల్చడం, అనవసరంగా ఉపయోగించడం వంటివాటిని నేరంగా పరిగణించాలని ప్రకటించింది. అలాంటి నేరానికి పాల్పడితే వెంటనే కేసులు నమోదు చేయాలని, వారి లైసెన్స్‌ను రద్దు చేయలని నిర్ణయించింది. ఇంకా ఏదైనా సందర్భంలో ఇతర వర్గాలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే, ప్రసంగించిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.
ఇటీవల కాలంలో.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సిద్ధూ మూసేవాలా హత్య కేసు మొదలు.. శివసేన నేత సుధీర్ సూరి, డేరా సచ్ఛా సౌదా అనుచరుడు పర్‌దీప్ సింగ్ హత్య వరకు పంజాబ్‌లో గన్ చప్పుళ్లు గట్టిగా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే విషయంలో ప్రతిపక్షాల నుంచి భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వానికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆప్ ప్రభుత్వం గన్ కల్చర్‌పై, హింసాత్మక ప్రసంగాల కట్టడికి నడుం బిగించింది. పంజాబ్ సింగర్స్ తమ పాటల ద్వారా గన్ కల్చర్, హింసను ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారని రాష్ట్ర సీఎం భగవంత్ సింగ్ ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. హింసను ప్రోత్సహించే విధంగా ప్రవర్తించినవారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.