Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్‌పై కుక్క దాడి..తృటిలో తప్పిన ముప్పు..ఎయిర్‌పోర్ట్‌లో వింత అనుభవం
Shreyas Iyer : టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌పై ఎయిర్‌పోర్ట్‌లో ఒక పెంపుడు కుక్క దాడికి ప్రయత్నించింది. తన రిఫ్లెక్స్‌తో అయ్యర్ తృటిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదృష్టవశాత్తూ శ్రేయస్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Shreyas Iyer : టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఎయిర్ పోర్టులో ఒక చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఒక పెంపుడు కుక్క అతనిపై దాడికి ప్రయత్నించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అదృష్టవశాత్తూ శ్రేయస్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
శ్రేయస్ అయ్యర్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఒక యువ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఒక మహిళ తన పెంపుడు కుక్కను (ఇండియన్ స్పిట్జ్ జాతికి చెందిన తెల్లటి కుక్క) పట్టుకుని అతని వద్దకు వచ్చింది. శ్రేయస్ స్నేహపూర్వక భావంతో ఆ కుక్కను నిమరడానికి ప్రయత్నించగా, అది ఒక్కసారిగా అతని చేతిని కరవడానికి మీదకు దూకింది. కుక్క దూకుడును గమనించిన శ్రేయస్, మెరుపు వేగంతో తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. దాంతో కుక్క కాటు నుంచి అతను సురక్షితంగా బయటపడ్డాడు. ఆ వెంటనే సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో ఆ మహిళ కుక్కను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఒకవేళ ఆ కుక్క గనుక శ్రేయస్ చేతిని కరిచి ఉంటే, అతని రీ-ఎంట్రీ ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యేవి. గత ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన శ్రేయస్, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు జట్టులోకి వస్తున్నాడు. జనవరి 11 నుంచి వడోదరలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో అతను కీలక పాత్ర పోషించాల్సి ఉంది. బ్యాటింగ్ చేసే చేతికి గాయమై ఉంటే అది జట్టుకు, శ్రేయస్ కెరీర్‌కు పెద్ద దెబ్బ అయ్యేది.
Dog tried to snatch Shreyas Iyer at the airport – he got surprised 😅
Sarpanch saab just returned fit — PLEASE protect him at all costs🙏😎 pic.twitter.com/TxtBRw9OlC
— Jara (@JARA_Memer) January 9, 2026
రీ-ఎంట్రీకి సిద్ధమైన అయ్యర్ శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టులోకే కాకుండా టీ20 జట్టులోకి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ గాయం కారణంగా మొదటి మూడు టీ20లకు దూరం కావడంతో, ఆ స్థానంలో శ్రేయస్‌ను తీసుకునే దిశగా బీసీసీఐ యోచిస్తోంది. ఏది ఏమైనా, మైదానంలోకి దిగకముందే ఇలాంటి ప్రమాదం నుండి తప్పించుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయ్యర్ భయ్యా.. జాగ్రత్త! అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి
