Nitish Kumar : నితీష్ యత్నాలకు గండి.. బీజేపీయేతర కూటమి కూర్పులో కొత్త గేమ్ ప్లాన్.. మారిన కాంగ్రెస్ ధోరణి..
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో రాజకీయ పార్టీల కూటమిని రూపొందించే ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కి పడుతున్నట్లు కనిపిస్తోంది.

National Political News: బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో రాజకీయ పార్టీల కూటమిని రూపొందించే ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కి పడుతున్నట్లు కనిపిస్తోంది. గత రెండేళ్ల కాలాన్ని పరిశీలిస్తే పలువురు చిన్నాచితకా పార్టీల నాయకులు అలాంటి పార్టీలను ఒక గొడుగు కిందికి తీసుకురావడం ద్వారా ఒక పొలిటికల్ అలయెన్సును క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. ఆరు నెలల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ తరహా ప్రయత్నాలను చేశారు. ఇందులో భాగంగా ఆయన చాలా మంది ముఖ్యమంత్రులను, వివిధ పార్టీల అధినేతలను కలిశారు. ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అలాంటి ప్రయత్నాలను చేస్తున్నారు. అయితే, ఆయన ప్రయత్నాలకు సానుకూల ప్రతిస్పందన లభించడం లేదని తాజాగా బోధపడుతుంది. ప్రతిపక్షాలను సమావేశపరిచేందుకుగాను నితీష్ కుమార్ గత రెండునెలలుగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేసి.. బిజెపి మరోసారి అధికారం చేపట్టకుండా చూడాలన్నది నితీష్ సంకల్పం. కానీ ఆయన ప్రయత్నాలపై సందిగ్ధత కొనసాగుతూ ఉండడం విశేషం. బిజెపికి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగేందుకు తలపెట్టిన ప్రతిపక్షాల సమావేశంపై సందిగ్ధత కొనసాగుతుంది. జూన్ 12వ తేదీన విపక్షాల భేటీ నిర్వహించాలని నితీష్ భావించినా ఆయన ప్రయత్నాలకు ఎవరు సానుకూలంగా స్పందించకపోవడంతో దాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వాయిదా వెనుక కారణాన్ని నితీష్ కుమార్ చెప్పకపోవడం గమనార్హం. అన్ని ప్రతిపక్ష పార్టీలతో.. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే విపక్ష నేతల భేటీని నిర్వహిస్తారని నితీష్ కుమార్ తాజాగా ముక్తాయింపు ఇచ్చారు. అయితే సమావేశాన్ని నిర్వహించలేకపోతున్నప్పటికీ నితీష్ కుమార్ ఒక కండిషన్‌ని తెరమీదకి తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాను నిర్వహించబోయే విపక్షాల భేటీకి హాజరయ్యే పార్టీలు తమ ముఖ్య నాయకులనే పంపాలని ఆయన నిబంధన విధించారు. అసలే ఆయన ప్రయత్నాలకు ప్రతిస్పందన అంతంత మాత్రంగా ఉంటే తాజాగా ఆయన విధించిన నిబంధన ఆయన ప్రయత్నాలకు మరింత గండి కొట్టే అవకాశాలు ఉన్నాయి.
నితీష్ ఒంటెద్దు పోకడ
బిజెపికి వ్యతిరేకంగా భారీ అలయన్స్ సిద్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ కొంతకాలం భావించింది. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ హ్యాండ్‌తో బిజెపిని మట్టికరిపించడం ఆ పార్టీ వ్యూహంలో మార్పుకు కారణమైనట్లు కనిపిస్తోంది. విపక్షాలు సహకరించిన, సహకరించకపోయినా సింగిల్ హ్యాండ్‌తో మోదీని మట్టికరిపించగలమన్న ధీమా ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. బహుశా అందుకేనేమో నితీష్ కుమార్ ప్రయత్నాలకు గండి పడుతుంది. గతంలో నితీష్ కుమార్‌తో జరిపిన చర్చల్లో సానుకూలంగా స్పందించిన పార్టీలు కూడా ఇప్పుడు ఆయనకు స్పందించని పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశాన్ని చెప్పుకోవాలి. జూన్ 12వ తేదీన విపక్షాల నేతల భేటీని నిర్వహిస్తున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ తేదీని ఆయన కాంగ్రెస్ నాయకులను సంప్రదించకుండా ఖరారు చేయడమే ఇప్పుడు నితీష్ ప్రయత్నాలను దెబ్బకొట్టినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. మల్లికార్జున ఖర్గే కూడా అందుబాటులో లేరు. ఈ క్రమంలో జూన్ 12వ తేదీన సమావేశం నిర్వహించడం నిరర్థకమని పలువురు చేసిన సూచన కారణంగానే నితీష్ కుమార్ ఈ భేటీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. జూన్ 12వ తేదీనే కాదు భేటీని నిర్వహించే వేదికను కూడా నితీష్ కుమార్ ఏకపక్షంగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా వేదికగా విపక్షాల భేటీని నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నితీష్ నిర్వహించబోయే విపక్షాల భేటీ జూన్ 23వ తేదీన జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దానికి ఏ ఏ పార్టీలు హాజరవుతాయన్నది మాత్రం క్లారిటీ లేదు. తాను నిర్వహించబోయే సమావేశానికి పార్టీల ముఖ్య నేతల రావాలని, రిప్రెజెంటేటివులను పంపించడం కుదరదని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఈ భేటీకి హాజరు కారు అన్న సంకేతాలు కనిపించడం వల్లే నితీష్ కుమార్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ హాజరైతేనే ఈ భేటీ నిర్వహించే ఉద్దేశం సంపూర్ణమవుతుందని నితీష్ భావిస్తున్నారు. అందువల్లే జూన్ 12వ తేదీన జరిగే సమావేశాన్ని జూన్ 23 కు వాయిదా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలకు అనుకూలంగా వేదికను మార్చేందుకు నితీష్ కుమార్ సిద్ధపడుతున్నారు.
పెద్దన్న పాత్రపైనే పేచీ!
ఇక్కడ ఒక అంశం.. నితీష్ ప్రయత్నాలకు గండి కొట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నితీష్ సారధ్యంలో ఒక జట్టు కట్టాలని భావిస్తున్న పార్టీలు మోదీకి ధీటైన ప్రధాని అభ్యర్థిగా రాహుల్ కాకుండా మరొకరిని ప్రతిపాదించాలని భావిస్తున్నాయి. ఈ ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీకి ససేమీరా ఇష్టం ఉండదు. గతంలో పరిస్థితి భిన్నంగా ఉన్నా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ నేతల ఆలోచన విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను వదులుకునేందుకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమాత్రం సిద్ధంగా లేరు. మరీ ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో అనామకుడిగా భావించే నితీష్ కుమార్‌ని నరేంద్ర మోదీకి దేటైన అభ్యర్థిగా అంగీకరించేందుకు చాలా పార్టీలు సిద్ధంగా లేవు. ఈ కూటమి కూర్పులో నితీష్ కుమార్ హైలైట్ అవ్వడం కూడా కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి.. చిన్నాచితకా ప్రాంతీయ పార్టీలను పెద్దదిగా చేసి చూపే ప్రయత్నం నితీష్ చేస్తున్నారని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ చేసిన మరొక ప్రతిపాదన కూడా చర్చనీయాంశం కానుంది. కాంగ్రెస్ పార్టీ తాను బలంగా ఉన్నచోట బిజెపిని విపక్షాల సహాయంతో ఎదుర్కోవాలని.. అదే సమయంలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని మమత బెనర్జీ పట్టుబడుతున్నారు. ఆమె ప్రతిపాదనకు అంగీకరిస్తే బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ ఒకట్రెండు సీట్లకే పరిమితమయ్యే ప్రమాదం వుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆమె పరోక్షంగా ప్రధాని పదవి మీద కన్నేసినట్లు కనిపిస్తోంది. నితీష్ కుమార్ ప్రతిపాదన కారణంగానే మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ విపక్ష కూటమి కూర్పుకు సహకరిస్తున్నట్లు జనతాదళ్ యునైటెడ్ పార్టీ భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడం ఇప్పుడు నితీష్ ప్రయత్నాలను నీరు కారుస్తోంది.




కలకలం రేపిన దేవెగౌడ కామెంట్స్
ఇక్కడ మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తావనార్హంగా కనిపిస్తున్నాయి. నితీష్ కుమార్ బిజెపియేతర పార్టీల కూటమికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ‘‘ అసలు దేశంలో బిజెపితో సంబంధం లేని పార్టీ ఏదైనా ఉందా ఝ ’’ అని దేెవెగౌడ తాజాగా ప్రశ్నించారు. ఒకరకంగా చెప్పాలంటే దేవకూడా మాటలు రాజకీయంగా కలకలం రేపాయి. బిజెపితో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా కానీ సంబంధం లేని పార్టీ దేశంలో లేదని దేవెగౌడ అభిప్రాయపడ్డారు. ‘‘ బీజేపీతో బంధం లేకుండా ఉన్న ఒక్క పార్టీ అయినా తనకు చూపాలి’’ అని దేెవెగౌడ సవాల్ కూడా చేశారు. ‘‘ దేశ రాజకీయ పరిస్థితిని కూలంకషంగా విశ్లేషించగలను.. కానీ ఉపయోగమేమిటి ’’ అని దేవెగౌడ అంటున్నారు. ఆయన గత అనుభవాలను గుర్తు చేస్తున్నారు కూడా. డిఎంకె అధినేత కరుణానిధి బిజెపికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరేళ్లపాటు మద్దతు ఇచ్చారు. మరి కాంగ్రెస్ నేతలు పొత్తు కోసం ఆయన వద్దకు వెళ్లలేదా అని కూడా దేవెగౌడ అన్నారు. బిజెపి నాయకులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలను ప్రభావితం చేస్తున్నారన్నది దేవగూడ మాటల సారాంశం. ఆయన మాటల్లో నిజముందని తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కాస్త లోతుగా పరిశీలిస్తే బోధపడుతుంది. దేవెగౌడ మాటలను లోతుగా విశ్లేషిస్తే నితీష్ కుమార్ కొంతకాలం బిజెపితో అంటకాగిన వ్యక్తే. మమతా బెనర్జీ కూడా ఒకప్పుడు కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వారే. డీఎంకే పార్టీ దాదాపు ఆరేళ్లపాటు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీయేతర పార్టీల కూటమి కూర్పు ప్రయత్నాలు తాజా కర్ణాటక ఎన్నికల ఫలితాల కారణంగా మీరు కారినట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉన్న నేపథ్యంలో బిజెపిని ఓడించాలని కోరుకుంటున్న పార్టీలు తమంతట తామే తమ పంచన చేరతాయని చాలామంది కాంగ్రెస్ నేతలు ఇప్పుడు భావిస్తున్నారు కూడా. ఈ అంశాలు జాతీయస్థాయిలో కొత్త అలయన్స్ కూర్పుకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
