నిర్భయ కేసు.. దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత
నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. తనకు ఉరిశిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ పవన్ ఈ పిటిషన్ వేశాడు.
నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. తనకు ఉరిశిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ పవన్ ఈ పిటిషన్ వేశాడు. 2012 లో నేరం జరిగినప్పుడు తాను మైనర్ నని, కానీ తన ఈ వాదనను ట్రయల్ కోర్టులు పట్టించుకోలేదని, అందువల్ల కనీసం ఇప్పుడు తన ఉరిశిక్షను యావజ్జీవ జైలుశిక్షగా మార్చాలని అతడు కోరాడు. కానీ ఈ పిటిషన్ ని ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ తిరస్కరించింది. కాగా-ఇదే అంశంపై పవన్ గతంలో అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ వేసినప్పటికీ దానిని కూడా కోర్టు తోసిపుచ్చింది. ఇతగాడు మొదట 2017 డిసెంబరులో సుప్రీంకోర్టులో మొదటి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. అదే సమయంలో మరో దోషి వినయ్ శర్మ కూడా పిటిషన్ వేశాడు. వీటిని 2018 జులైలో కోర్టు కొట్టివేసింది. అప్పటి నుంచి ఈ కేసులోని నలుగురు దోషులూ తమ ఉరిని తప్పించుకోవడానికి అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. దోషులైన ముకేశ్, పవన్, అక్షయ్, వినయ్ శర్మల మెర్సీ పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరిస్తూ రావడం, వాటిని సవాలు చేస్తూ వీరు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయడం, సుప్రీంకోర్టు వాటిని కొట్టివేయడం జరుగుతోంది. ఈ నలుగురినీ ఉరి తీయడానికి ఇక ఒక్కరోజే మాత్రమే మిగిలి ఉంది.