ఎంపీగా జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణం.. రాజ్యసభలో విపక్షాల వాకౌట్
సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గురువారం రాజ్యసభలో ఎంపీగా ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేస్తుండగా.. కాంగ్రెస్ సహా విపక్షాల సభ్యులు 'షేమ్'. 'షేమ్' (సిగ్గు,సిగ్గు) అని నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గురువారం రాజ్యసభలో ఎంపీగా ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేస్తుండగా.. కాంగ్రెస్ సహా విపక్షాల సభ్యులు ‘షేమ్’. ‘షేమ్’ (సిగ్గు,సిగ్గు) అని నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. గొగోయ్ నియామకం జుడీషియరీ స్వత్రంత్రతను దెబ్బ తీస్తుందని వారు ఆరోపించారు. సమాజ్ వాదీ పార్టీ తప్ప ఇతర ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. గొగోయ్ ని రాష్ట్రపతి ఎగువసభకు నామినేట్ చేసిన సంగతి విదితమే. అయితే ఈ సభకు గొగోయ్ నియామకాన్ని సమర్థించిన న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్.. మాజీ ప్రధాన న్యాయమూర్తులతో సహా వివిధ రంగాలకు విశేష సేవలందించిన ప్రముఖులను ఎంపిక చేయడం సంప్రదాయంగా వస్తోందన్నారు. జస్టిస్ గొగోయ్ తప్పకుండా ఈ సభకు తనవంతు సేవలందిస్తారని, ప్రతిపక్షాలు వాకౌట్ చేయడం సముచితం కాదని ఆయన అన్నారు. అటు-విపక్షాల వాకౌట్ పట్ల ఉపరాష్ట్రపతి, సభ చైర్మన్ వెంకయ్యనాయుడు కూడా నిరసన వ్యక్తం చేస్తూ.. కొన్ని నియామకాలకు నిబంధనలు, సంప్రదాయాలు ఉన్నాయని, విపక్షాలు ఇలా ప్రవర్తించడం భావ్యం కాదని అన్నారు.
జస్టిస్ రంజన్ గొగోయ్ నాలుగునెలల క్రితమే రిటైరయ్యారు. రాజ్యసభకు తన నియామకాన్ని సమర్థించుకున్న ఆయన..జాతి సమైక్యత కోసం ఏదో ఒక దశలో ఎగ్జిక్యూటివ్, (పార్లమెంటరీ వ్యవస్థ), జుడీషియరీ (న్యాయవ్యవస్థ) కలిసి పని చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు.
‘పార్లమెంటులో నా ఉనికి లెజిస్లేచర్ ముందు జుడీషియరీ అభిప్రాయాలను, అలాగే జుడీషియరీ ఎదుట పార్లమెంట్ భావాలను ప్రొజెక్ట్ చేయడానికి నాకు లభించిన అవకాశమేనని భావిస్తున్నానని’ ఆయన వ్యాఖ్యానించారు.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా తన హయాంలో రంజన్ గొగోయ్.. అయోధ్య సహా కీలకమైన అంశాలపై తీర్పు నిచ్చారు. అయితే ఆయన నియామకం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుధ్ధమని, ఒక విధంగా దాడివంటిదేనని కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. జుడీషియరీకి, ఎగ్జిక్యూటివ్ కి మధ్య అధికారాల విభజన ఆధారంగా రాజ్యాంగం ఏర్పడిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు.