మంత్రి పీఏ భార్య ఆత్మహత్య.. మరణానికి ముందు ఏం జరిగిందంటే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
గౌరీ పాల్వే ఆత్మహత్య కేసు సంచలనం రేపుతోంది. మంత్రి పంకజ్ పీఏ అనంత్ గార్జే భార్య గౌరీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, వివాహేతర సంబంధమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గౌరీ తండ్రి ఫిర్యాదుతో అనంత్ గార్జే అరెస్ట్ అయ్యాడు. అతడిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర బీజేపీ మంత్రి పంకజ ముండే పీఏ అనంత్ గార్జే భార్యడాక్టర్ గౌరీ పాల్వే ఆత్మహత్య కేసు సంచలనం రేపుతోంది. శనివారం సాయంత్రం ముంబైలోని తన నివాసంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఈ కేసులో రోజూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గౌరీ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంత్ గార్జేతో పాటు అతని కుటుంబంలోని మరో ఇద్దరు సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి, అంటే మరణించిన 24 గంటల తర్వాత, వర్లి పోలీసులు అనంత్ గార్జేను అరెస్టు చేశారు.
అనంత్ గార్జే విచారణలో ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. గౌరీ ఆత్మహత్య చేసుకునే కొన్ని నిమిషాల ముందు దంపతుల మధ్య తీవ్ర గొడవ జరిగింది. గొడవ తర్వాత పంకజ ముండే కార్యక్రమానికి వెళ్లిన అనంత్.. గౌరీకి పదే పదే ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. కిటికీలోంచి చూడగా గౌరీ ఉరి వేసుకుని ఉండటం చూసి అనంత్ షాక్ అయినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
వివాహేతర సంబంధమే కారణమా?
గౌరీ తన జీవితాన్ని ముగించడానికి ప్రధాన కారణం అనంత్ గార్జే వివాహేతర సంబంధాలే అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఏడాది తిరగక ముందే విడిపోవడం విషాదకరం. వివాహం తర్వాత కూడా అనంత్‌కు వివాహేతర సంబంధాలు ఉండేవని, ఈ విషయం గౌరికి తెలియడంతో వారిద్దరి మధ్య నిరంతరం పెద్ద ఎత్తున వాదనలు జరిగేవని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గౌరీ-అనంత్ సంబంధం చాలా కాలంగా బెడిసికొట్టింది. సెప్టెంబర్ 30న గౌరీ తన తండ్రికి వాట్సాప్‌లో కొన్ని ఫోటోలు పంపింది. అవి వారి కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ ఫోటోలలో లాతూరులోని ఒక ఆసుపత్రికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి. 2021 నాటి ఆ పత్రంలో గర్భధారణ సమ్మతి, డిక్లరేషన్ ఫామ్ ఉండగా, అందులో మహిళ పేరు కిరణ్, భర్త పేరు అనంత్‌గార్జే అని ఉంది. ఈ పత్రం అనంత్ వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేసింది. దీంతో గౌరవ్ తండ్రి ఆమెను ఇంటికి రమ్మని అడగ్గా.. అనంత్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆమె తెలిపింది.
అంత్యక్రియల వద్ద గొడవ
డాక్టర్ గౌరీ పాల్వే-గార్జే మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తీసుకువచ్చిన తరువాత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గౌరీ ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేశారని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంత్యక్రియల సందర్భంగా గార్జే – గౌరీ బంధువుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
