Mumbai: దారుణం.. ఫేస్‌బుక్ లైవ్‌లో ఉండగానే ఉద్ధవ్ శివసేన నేత హత్య.. ఆ తర్వాత నిందితుడు..
ముంబైలోని దహిసర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం మారిస్ నరోనాతోపాటు ఫేస్‌బుక్ లైవ్‌కు వచ్చారు ఉద్ధవ్ శివసేన లీడర్ అభిషేక్ గొషాల్కర్. అది కూడా నిందితుడు.. మారిస్ కార్యాలయంలోనే ఏర్పాటు చేశారు. పలు విషయాలపై అభిషేక్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక ఫేస్‌బుక్ లైవ్ ముగించిన వెంటనే..

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ముంబైలో శివసేన ఉద్ధవ్ థాక్రే లీడర్, మాజీ కార్పొరేటర్ దారుణ హత్యకు గురయ్యారు. ఫేస్‌బుక్ లైవ్‌లో ఉండగానే అభిషేక్ ప్రత్యర్థి.. మారిస్ నరోనా కాల్పులు జరిపాడు. దీంతో UBT శివసేన నేత అభిషేక్ గొషాల్కర్ (41) మృతి చెందారు. అనంతరం మారిస్ నరోనా (49) తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ముంబైలోని దహిసర్ ప్రాంతంలో ఫేస్‌బుక్ లైవ్ సందర్భంగా శివసేన (యుబిటి) నాయకుడు అభిషేక్ ఘోసల్కర్‌పై కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ముంబైలోని దహిసర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం మారిస్ నరోనాతోపాటు ఫేస్‌బుక్ లైవ్‌కు వచ్చారు ఉద్ధవ్ శివసేన లీడర్ అభిషేక్ గొషాల్కర్. అది కూడా నిందితుడు.. మారిస్ కార్యాలయంలోనే ఏర్పాటు చేశారు. పలు విషయాలపై అభిషేక్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక ఫేస్‌బుక్ లైవ్ ముగించిన వెంటనే.. మారిస్ నరోనా తన దగ్గరున్న గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. అభిషేక్ తప్పించుకునే లోపే పలురౌండ్లు కాల్చాడు. దీంతో అక్కడే కుప్పకూలిపోయాడు అభిషేక్. వెంటనే అతన్ని బోరీవలీలోని కరుణ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన మొత్తాన్ని ఫేస్‌బుక్ లైవ్‌లో రికార్డ్ అయింది. ఘోసల్కర్ శివసేన (UBT) నాయకుడు మాజీ ఎమ్మెల్యే వినోద్ ఘోసల్కర్ కుమారుడు.
మారిస్ భాయ్ ఘోసల్కర్‌పై ఐదుసార్లు కాల్పులు జరిపాడని.. దీని తరువాత, మారిస్ తనను తాను కాల్చుకుని చనిపోయాడని.. వ్యక్తిగత శత్రుత్వం కారణంగా ఘోసల్కర్‌పై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఘోసాల్కర్, నొరోన్హా మధ్య వ్యాపార విషయాల్లో పాత శత్రుత్వం ఉందని, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం వారిద్దరు గొడవలను పక్కనబెట్టి.. ఒకటయ్యారని ఫేస్‌బుక్ లైవ్ కు హాజరైనట్లు పేర్కొంటున్నారు. ఘోసల్కర్ తన సందేశాన్ని ముగించి, గది నుండి బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, నోరోన్హా అతనిపై కాల్పులు జరిపాడు.
ఈ ఘటన అనంతరం పెద్దఎత్తున ఉద్ధవ్ శివసేన మద్దతుదారులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.
కాగా.. ఇటీవల, మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో శివసేన నాయకుడు మహేష్ గైక్వాడ్‌ను హిల్‌లైన్ పోలీస్ స్టేషన్‌లోని సీనియర్ పోలీసు క్యాబిన్‌లో బిజెపి ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కాల్చిచంపారు. సుదీర్ఘకాలంగా ఉన్న భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులు అక్కడికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ కూడా గాయపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




