AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDIA Alliance: ఇండియా కూటమికి బీటలు.. వరుస షాక్‌లతో నేతల ఉక్కిరిబిక్కిరి.. ఉనికి ప్రశ్నార్థకమేనా..?

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీట్లు ఇవ్వబోమని ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించి దుమారం రేపారు. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి అసలు ఉనికి లేదనేది దీదీ భావన. గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా తృణమూల్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లుగా పోరు సాగింది.

INDIA Alliance: ఇండియా కూటమికి బీటలు.. వరుస షాక్‌లతో నేతల ఉక్కిరిబిక్కిరి.. ఉనికి ప్రశ్నార్థకమేనా..?
Rahul Gandhi Arvind Kejriwal
Shaik Madar Saheb
|

Updated on: Feb 09, 2024 | 6:50 AM

Share

ఇండియా కూటమి వరుస షాక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే మమత, అఖిలేష్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెక్‌ పెట్టగా తాజాగా అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కలకలం రేపింది. అస్సాంలో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్‌ పార్టీని ఇరుకునపెట్టింది. ఇలా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. కూటమిని సంప్రదించకుండానే అస్సాంలో ముగ్గురు అభ్యర్థులను లోక్‌సభ ఎన్నికల బరిలో నిలబెడుతున్నట్లు ప్రకటించింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. దిబ్రూగఢ్ గౌహతి, తేజ్‌పూర్ నుంచి తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది. కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో జాప్యం జరుగుతుండటంతో తన అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించేసింది ఆప్‌. పంజాబ్‌లోనూ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆప్‌ ఇప్పటికే ప్రకటించింది. ఆప్‌ ఏకపక్ష ప్రకటనలతో బిత్తరపోవడం కాంగ్రెస్‌ వంతయింది.

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీట్లు ఇవ్వబోమని ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించి దుమారం రేపారు. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి అసలు ఉనికి లేదనేది దీదీ భావన. గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా తృణమూల్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లుగా పోరు సాగింది. ఈ సారి కూడా ఈ రెండు పార్టీల మధ్యే బలమైన పోటీ ఉండటంతో కూటమికి సంబంధం లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు దీదీ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెక్‌ పెట్టేశారు. దీదీ ఇచ్చిన షాక్‌తో కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

ఉత్తరప్రదేశ్‌లో కూటమితో సంబంధం లేకుండా 16 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించేశారు సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌. గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌ పార్టీ ఒకే ఒక్క నియోజకవర్గంలో గెలిచింది. రాయ్‌బరేలీ నుంచి సోనియా మాత్రమే గెలుపొందారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి యూపీలో అంత సీన్‌ లేదని అఖిలేష్‌ భావిస్తున్నారు. ఇండియా కూటమిని పరిగణనలోకి తీసుకోకుండానే మమత బాటలో సొంతంగా అభ్యర్థులను ప్రకటించుకోవడం మొదలుపెట్టేశారు.

ఇప్పటికే జేడీయూ అధ్యక్షుడు నితీశ్ ఎన్డీయేలో చేరిపోయి ఇండియా కూటమిని దారుణంగా దెబ్బతీశారు. కూటమి కన్వీనర్‌ హోదా ఆయనకు దక్కవచ్చనే ప్రచారం జరిగినా నితీశ్‌కు ఆర్జేడీ సహా మిగతా పక్షాల నుంచి అంతగా మద్దతు లభించలేదు. దీంతో ఆయన తన పాత మిత్రులైన కమలనాథులతో మరోసారి చేయి కలిపారు.

ఒక్కో రాష్ట్రంలో కీలక పార్టీలన్నీ షాకిస్తుండటంతో ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలనుకుంటోన్న బీజేపీకి ఇండియా కూటమిలో జరుగుతున్న తాజా పరిణామలు వరంలా మారనున్నాయి. పరిస్థితిని ఇప్పటికైనా చక్కదిద్దుకోకపోతే ఇండియా కూటమిలోని మిగతా పార్టీలూ తమ దారి తాము చూసుకుని కాంగ్రెస్‌ పార్టీని ఒంటరిని చేసే అవకాశం ఉంది.