Congress List: కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠ.. తొలి జాబితా ఇవాళే ప్రకటించే ఛాన్స్!

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఏఐసీసీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. ఢిల్లీలో టీపీసీసీ నేతలతో కాంగ్రెస్ సీఈసీ సమావేశం అయ్యింది. అయితే జాబితా మాత్రం విడుదల కాలేదు. రాహుల్ గాంధీ కేరళ వాయనాడ్‌ నుంచి పోటీ చేస్తారని ఏఐసీసీ స్పష్టం చేసింది. ఇక మార్పు చేర్పులు పూర్తి అయ్యాక, తుది జాబితాను ప్రకటిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ నుంచి 7 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది.

Congress List: కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠ.. తొలి జాబితా ఇవాళే ప్రకటించే ఛాన్స్!
Rahul Gandhi Mallikarjun Kharge
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 08, 2024 | 8:17 AM

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఏఐసీసీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. ఢిల్లీలో టీపీసీసీ నేతలతో కాంగ్రెస్ సీఈసీ సమావేశం అయ్యింది. అయితే జాబితా మాత్రం విడుదల కాలేదు. రాహుల్ గాంధీ కేరళ వాయనాడ్‌ నుంచి పోటీ చేస్తారని ఏఐసీసీ స్పష్టం చేసింది. ఇక మార్పు చేర్పులు పూర్తి అయ్యాక, తుది జాబితాను ప్రకటిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ నుంచి 7 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో AICC అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, జై రాం రమేష్‌ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ ఎలక్షన్ కమిటీ భేటీకి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో తెలంగాణ నుంచి పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. నియోజకవర్గాల వారీ బలాబలాలు, సామాజిక సమీకరణల ప్రకారం అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు. పది మంది పేర్లతో తొలి జాబితా విడుదల అవుతుందని ప్రచారం జరిగినా లిస్ట్‌ జారీ చేయకుండానే సమావేశం ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచందర్‌ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఇటీవలే సీఎం రేవంత్‌ రెడ్డి బహిరంగ సభలో ప్రకటించారు. దీంతో మిగతా 16 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా వెలువడాల్సి ఉంది. కాగా, సికింద్రాబాద్, పెద్దపల్లి, నల్గొండ, మహబూబ్‌నగర్, మహబూబాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం.

కేరళ- తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఖరారు చేసేందుకు నిర్వహించిన కాంగ్రెస్‌ సీఈసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేరళ వయనాడ్‌ నుంచి రాహుల్‌ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో రాహుల్ వయనాడ్‌తో పాటు అమేథీలో కూడా పోటీ చేశారు. అమేథీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ రాహుల్‌ గాంధీని ఓడించారు. అమేథీలో ఓడినా వాయనాడ్‌లో మాత్రం ఘన విజయం సాధించారు రాహుల్‌. అయితే ఈసారి వాయనాడ్‌లో ఇండియా కూటమి మిత్రపక్షం సీపీఐ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిందని, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సతీమణి అనీ రాజాను అభ్యర్థిగా ప్రకటించారని ప్రచారం జరిగింది. దీంతో రాహుల్‌ను తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు తెలంగాణ పీసీసీ ప్రయత్నించింది. అయితే ఈ ఊహాగానాలకు చెక్‌ పెడుతూ రాహుల్ వయనాడ్‌ నుంచే పోటీ చేస్తారని ఏఐసీసీ స్పష్టం చేసింది.

కాంగ్రెస్ తొలి జాబితాలో చేరే 40 మంది అభ్యర్థుల్లో తిరువనంతపురం నుంచి శశి థరూర్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పేర్లు కూడా చర్చకు వచ్చాయి. ఈ ఇద్దరు అనుభవజ్ఞుల పేర్లను కూడా మొదటి జాబితాలో చేర్చవచ్చు. కేరళలోని ఎంపీలందరికీ కాంగ్రెస్ మళ్లీ టిక్కెట్లు ఇవ్వవచ్చు. అదే సమయంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 7 స్థానాలకు అభ్యర్థుల పేర్లను సీఈసీ సమావేశంలో ఖరారు చేశారు. సికింద్రాబాద్, పెద్దపల్లి, నల్గొండ, మహబూబ్‌నగర్ సీట్లపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. ఇక మహబూబాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాల అభ్యర్థులు ఖరారు అయ్యింది. ఖమ్మం సహా మిగతా స్థానాలను సీఈసీ పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికలకు గడువు కూడా సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఒకటి రెండు రోజుల్లో ఖాయంగా విడుదల అవుతుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తోంది. ఈ తరుణంలో ఇవాళ తొలి జాబితా విడుదల చేయాలని ఏఐసీసీ యోచిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…