Kumbh Mela: మహా కుంభ్ భక్తులకు భరోసా.. ఇకపై నిశ్చింతగా వెళ్లి రావచ్చు.. ఇది తెలుసుకోండి
మహా కుంభమేళా. భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం. దేశ నలుమూలల నుంచి ఇప్పటి వరకూ కోట్లాది మంది వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ క్రౌడ్‌ని ముందుగానే ఊహించే..యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ...అనుకోకుండా జరిగిన ఓ సంఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. క్షణాల్లోనే గందరగోళం జరిగిపోయింది.

మహా కుంభమేళా. భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం. దేశ నలుమూలల నుంచి ఇప్పటి వరకూ కోట్లాది మంది వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ క్రౌడ్‌ని ముందుగానే ఊహించే..యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ…అనుకోకుండా జరిగిన ఓ సంఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. క్షణాల్లోనే గందరగోళం జరిగిపోయింది. మౌని అమావాస్య రోజునే ఈ విషాదం చోటు చేసుకుంది. భక్తులు భారీగా తరలి రావడం, స్నానాలు చేసేందుకు పోటీ పడడం వల్ల తొక్కిసలాట జరిగింది. ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటు చేసిన బారికేడ్‌లపైకి ఎక్కి మరీ భక్తులు దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి..క్షణాల్లోనే తొక్కిసలాట జరిగిపోయింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయాలతో బయటపడ్డారు. సంగం ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ..ఇలా జరగడంపై యూపీ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. అయితే..అంతటితోనే చేతులు దులుపుకోకుండా ఇకపై మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది.
క్రౌడ్ మేనేజ్‌మెంట్ లక్ష్యంగా మొత్తంగా 5 కీలక మార్పులు చేసింది యూపీ సర్కార్. బారికేడ్స్‌ని తోసుకుని రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మార్పులు చేర్పులు చేశారు. ఇప్పటి నుంచి మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అంత కన్నా ముఖ్యమైన మార్పు ఏంటంటే…VVIP వెహికిల్స్‌ని లోపలకు రాకుండా అడ్డుకోవడం. VVIP పాస్‌లు ఉన్నప్పటికీ ఇకపై ఆ వాహనాలు లోపలికి వచ్చేందుకు అనుమతి ఉండదు. భక్తుల రద్దీ ఆధారంగా పలు చోట్ల వన్ వే రూట్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వాహనాల రద్దీ పెరగకుండా చాలా వరకూ కంట్రోల్ చేయనున్నారు. ప్రయాగ్‌రాజ్ పరిసర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే వాళ్లని జిల్లా సరిహద్దు వద్దే ఆపేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో ఒకేసారి రద్దీ పెరగకుండా ట్రాఫిక్ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరో కీలకమైన నిర్ణయం ఏంటంటే.. ఫిబ్రవరి 4వ తేదీ వరకూ సిటీలోకి ఫోర్ వీలర్స్‌పై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు.
క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం మరి కొన్ని చర్యలూ చేపట్టేందుకు సిద్ధమైంది యోగి ప్రభుత్వం. ఇద్దరు IAS ఆఫీసర్‌లను ప్రత్యేకంగా పిలిపించింది. 2019 కుంభమేళాను ఈ ఇద్దరు అధికారులు చాలా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. అందుకే వీళ్లకే ఈ బాధ్యతలు అప్పగించింది. వీళ్లతో పాటు ఐదుగురు స్పెషల్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్‌లనూ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో వీళ్లంతా ఇలాంటి భారీ కార్యక్రమాలను హ్యాండిల్ చేసిన వాళ్లే. ఈ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. పొరపాటున కూడా మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా క్రౌడ్ కంట్రోల్‌తో పాటు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై పూర్తిగా ఫోకస్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లపై రివ్యూ చేయాలనీ చెప్పారు. రైల్వే స్టేషన్ల వద్ద భారీగా రద్దీ ఉంటోంది. ప్రయాగ్‌రాజ్‌కి వచ్చి ఇంటికి వెళ్లిపోయే వాళ్లు భారీ ఎత్తున స్టేషన్‌లకు చేరుకుంటున్నారు. అందుకే..అక్కడి పరిస్థితులపై రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు ఆరా తీయాలని ఆదేశించారు యోగి ఆదిత్యనాథ్. ఈ రద్దీని కొంత వరకూ తగ్గించేందుకు ప్రత్యేకంగా బస్‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. కొంత మంది బస్‌లలో వెళ్లేలా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే..ప్రభుత్వం కొన్ని చోట్ల హోల్డింగ్ ఏరియాస్‌ని ఏర్పాటు చేస్తోంది. అంటే..కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో మరీ రద్దీ ఎక్కువైపోయింది అనుకుంటే..కొన్ని చోట్ల రద్దీని నిలిపివేస్తారు. కుంభమేళా వద్ద కాస్త రద్దీ తగ్గింది అనుకున్నాకే..వీళ్లకు అనుమతినిస్తున్నారు. అయితే..ఈ హోల్డింగ్ ఏరియాలలో భక్తులకు ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి కూడా ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నారు అధికారులు. వీటితో పాటు నిరంతరం ప్యాట్రోలింగ్ చేస్తున్నారు. అయోధ్య, లఖ్నో, ఫతేపూర్, కాన్పూర్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై నిఘా పెడుతున్నారు. ఇక తొక్కిసలాట ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన జ్యుడిషియల్ కమిషన్‌ని ఏర్పాటు చేశారు. ఇలా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తూ.. అప్రమత్తంగా ఉంటోంది యోగి సర్కార్.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.