Budget 2025: అన్నీ మంచి శకునములే.. మధ్యతరగతి వారికి, ఉద్యోగులకు ఇక పండుగే

వరుసగా 8వ సారి కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ ప్రసంగంలో తెలుగు కవి గురజాడ అప్పారావు మాటలను ప్రస్తావించారు. దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అన్నారు. దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Budget 2025: అన్నీ మంచి శకునములే.. మధ్యతరగతి వారికి, ఉద్యోగులకు ఇక పండుగే
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 01, 2025 | 8:42 PM

వరుసగా 8వ సారి కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ ప్రసంగంలో తెలుగు కవి గురజాడ అప్పారావు మాటలను ప్రస్తావించారు. దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అన్నారు. దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకు తగ్గట్టుగానే కేటాయింపులు చేశారు. ఆయా రంగాలకు మోదీ సర్కార్ ఏ మేర కేటాయింపులు చేసిందో ఓ సారి పరిశీలిద్దాం.

బడ్జెట్‌లో అత్యంత కీలకమైన ప్రకటన గురించి ముందుగా చెప్పుకుందాం. మధ్య తరగతి వాళ్లకి బిగ్ రిలీఫ్ ఇచ్చేలా నిర్మలా సీతారామన్ ఓ సంచలన ప్రకటన చేశారు. రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపునిస్తున్నట్టు వెల్లడించారు. 12 లక్షలకు మించిన ఆదాయం ఉన్న వారికి శ్లాబులవారీగా పన్ను విధించనుంది కేంద్రం. 20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25% పన్ను, 24 లక్షల ఆదాయం దాటిన వారికి 30% శాతం పన్ను విధించనున్నారు. 16 లక్షల నుంచి 20 లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్ను వసూలు చేయనున్నారు. ఇక ఏ శ్రేణి వారికైనా 4 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉండనుంది. ఈ ప్రకటనతో మిడిల్ క్లాస్‌ వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక దీంతో పాటు మొత్తంగా ఆరు రంగాల్లో సమూల మార్పులు చేస్తామని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్‌తో 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. అంతే కాదు. కిసాన్‌ క్రెడిట్‌ రుణాలు పెంపు, MSMEలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత, స్టార్టప్‌ల కోసం రూ.20 కోట్ల వరకు రుణాలు వంటి కీలక నిర్ణయాలనూ వెల్లడించారు. 27 కీలక రంగాలకు ప్రాధాన్యత ఇస్తామని, మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక తయారు చేస్తున్నామని వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. విద్యారంగం విషయానికొస్తే..ప్రభుత్వ స్కూళ్లలో 50వేల అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ , అన్ని ప్రభుత్వ హైస్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు లాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

వైద్య రంగం విషయానికొస్తే..గడిచిన 10 ఏళ్లలో కొత్తగా 1.01 లక్షల వైద్య సీట్లు పెంచినట్టు వెల్లడించిన ఆర్థిక మంత్రి..రానున్న ఐదేళ్లలో కొత్తగా 75 వేల మెడికల్‌ సీట్లు కల్పిస్తామని చెప్పారు. 2025-26లోనే 200 క్యాన్సర్‌ సెంటర్ల ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు అందిస్తామని చెప్పారు ఆర్థిక మంత్రి. మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా 1.50 లక్షల కోట్లు రుణాలు అందించడం, విద్యుత్‌ రంగంలో సంస్కరణలు, అంతర్రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక… వికసిత్‌ భారత్‌ కోసం న్యూక్లియర్‌ ఎనర్జీ మిషన్‌ లాంటి ప్రకటనలు చేశారు.

2028 వరకు జల్‌జీవన్‌ మిషన్‌ పథకం పొడిగిస్తున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించారు నిర్మలా సీతారామన్. దీంతో పాటు ఉడాన్ స్కీమ్‌ని విస్తరిస్తున్నట్టు వెల్లడించారు. కొత్తగా 117 ప్రాంతాలకు విమాన సర్వీసులు అందిస్తామని చెప్పారు. ఇక ఎగుమతుల కోసం కొత్త విధానం..న్యూ ఎక్స్‌పోర్ట్‌ మిషన్‌ని ప్రకటించారు. బీమా రంగంలో FDI 100శాతానికి పెంచనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రాల మధ్య పోటీతత్వం పెంచేందుకు కొత్తగా ఇండెక్స్‌ ఆఫ్ స్టేట్స్‌ తీసుకొస్తామని చెప్పారు. మూలధన వ్యయం కోసం 10 వేల 148 లక్షల కోట్లు కేటాయించారు. 7 రకాల కస్టమ్స్ సుంకాలను తొలగిస్తున్నట్టు చెప్పారు. క్యాన్సర్‌తో పాటు అరుదైన వ్యాధుల ఔషధాల ధరలూ తగ్గిస్తామని ప్రకటించారు.

వ్యవసాయ రంగంపై ఈ సారి ఎక్కువగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో పీఎం ధన్‌ధాన్య కృషి యోజన అందుబాటులోకి తీసుకురానున్నారు. పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బిహార్‌లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు, అధిక దిగుబడి విత్తనాల వృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక, పత్తి రైతుల కోసం ఐదు సంవత్సరాల ప్రణాళిక లాంటి నిర్ణయాలనూ వెల్లడించారు.

కేంద్ర బడ్జెట్‌లో బిహార్‌కు భారీగా కేటాయింపులు జరిగాయి. ఈ ఏడాది బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల కారణంగా వరాల వాన కురిపించింది కేంద్రం. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. బిహార్‌లో కొత్తగా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. పాట్నా IIT ని విస్తరించడంతో పాటు..బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపడతామని తెలిపింది. వచ్చే వారం కొత్త ఇన్‌కమ్‌ట్యాక్స్‌ బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు.. నిర్మలా సీతారామన్. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంచే విధంగా చర్యలు చేపట్టనుంది కేంద్రం. బీమాలో FDI 74 శాతం నుంచి 100 శాతానికి అనుమతినివ్వనుంది. లక్ష ఇళ్ల నిర్మాణం కోసం 15వేల కోట్ల కేటాయించింది. మొత్తంగా చూసుకుంటే..నిర్మలమ్మ బడ్జెట్‌ పేదలు, యువత, రైతులు, మహిళలకు పెద్ద పీట వేసిందని చెప్పాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి