Congress President Election: ఖర్గే vs థరూర్.. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఎవరో తేలేది నేడే.. ఆయన వైపే అందరి చూపు..!
24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ చీఫ్ ఎన్నికలు రహస్య బ్యాలెట్ విధానంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక బరిలో లేకపోవడం.. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ బరిలోకి దిగడంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరన్నది ఈ రోజు (అక్టోబర్ 19న) తేలనుంది. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. అనంతరం కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎవరన్నది ప్రకటించనున్నారు. దీనికోసం ఏఐసీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడి పదవి కోసం కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కేరళ తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పోటీలో ఉన్నారు. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు సోమవారం జరిగిన విషయం తెలిసిందే. 9వేల మందికి పైగా ప్రతినిధులు ఓటు వేశారు. 24 ఏళ్ల తర్వాత మొదటిసారి గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో లేకపోవడంతో.. మల్లిఖార్జున్ ఖర్గే, శశి థరూర్ పోటీలో నిలిచారు. అత్యంత ఆసక్తికరంగా కొనసాగిన కాంగ్రెస్ చీఫ్ ఎన్నికల్లో.. అగ్రనేతలు స్పష్టంగా ఖర్గేకి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్‌లో అత్యంత అనుభవం కలిగిన వ్యక్తి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండటం.. ఖర్గేకు కలిసివచ్చే అంశాలుగా పరిగణిస్తున్నారు.అటు గాంధీ కుటుంబం, పార్టీలో సీనియర్లు ఖర్గేకే మద్దతుగా ఉండడంతో ఆయన గెలుపు లాంఛనమేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయనకు శశి థరూర్ సైతం గట్టి పోటీ ఇస్తారని పేర్కొంటున్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ చీఫ్ ఎన్నికలు రహస్య బ్యాలెట్ విధానంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక బరిలో లేకపోవడం.. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ బరిలోకి దిగడంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
68 పోలింగ్ బూత్‌లలో కాంగ్రెస్ నాయకులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 9,915 మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ప్రతినిధులలో.. 9,500 మందికి పైగా ప్రతినిధులు ఆయా పీసీసీ కార్యాలయాలు, ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో ఓటు వేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో సైతం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ 40 మందికి పైగా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాగా.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగాయని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ పోలింగ్ అనంతరం తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను మంగళవారం దేశ రాజధానికి తీసుకువచ్చారు. వాటిని పార్టీ హెచ్‌క్యూలోని ‘స్ట్రాంగ్‌రూమ్’లో ఉంచారు. అభ్యర్థులు శశి థరూర్, మల్లికార్జున్ ఖర్గే ఏజెంట్ల ముందు బ్యాలెట్ బాక్సులను తెరిచి.. కౌంటింగ్ ను ప్రారంభించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..