Kamal Haasan: వేడెక్కుతున్న లోక్‌సభ డీలిమిటేషన్ చర్చ.. దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కమల్ హాసన్ వ్యాఖ్య
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనపై చర్చ వేడెక్కుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతలు, విశ్లేషకులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా దీనిపై మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ గళం విప్పారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనపై చర్చ వేడెక్కుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతలు, విశ్లేషకులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా దీనిపై మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ గళం విప్పారు. జనాభా ప్రాతిపదికను లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణ రాష్ట్రాలను శిక్షించడం సరికాదని పేర్కొన్నారు. దేశం ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కలిసి చర్చించాల్సిన అవసరం ఉంద్నారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్ 2023లో కమల్ హాసన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇండియా ఫస్ట్.. సౌత్ ఇండియా కీలక లక్ష్యం అంటూ కామెంట్స్ చేశారు.
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఎన్ని స్థానాలు దక్కుతాయన్న లెక్కలు తనకు ఆందోళన కలిగిస్తున్నట్లు కమల్ చెప్పారు. జనాభాను నియంత్రించిన వారిని శిక్షించడం సరైన నిర్ణయం ఎలా అవుతుందని వ్యాఖ్యానించారు. పార్లమెంటు స్థానాల సంఖ్యను త్వరలో పెంచనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని జనాభా మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లోని జనాభా కంటే ఎక్కువ ఉన్నారని అన్నారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను పెంచితే.. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్నారు. దక్షిణ భారత్‌కు చెందిన వ్యక్తిగా ఇది తనను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. తాను పన్నులు చెల్లిన్నానని.. సత్ప్రవర్తన కలిగినందుకు తనను శిక్షించడం సరికాదని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.
దక్షిణాది రాష్ట్రాలు కలిసి పోరాడాలి..
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభన చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉందన్నారు. ఈ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా దీన్నిపై అందరూ గళం విప్పాల్సిన అవసరముందన్నారు. అటు మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంచేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా నిరసన స్వరం వినిపించారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై అభ్యంతరాలు ఎందుకు?
2026లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశముందని తెలుస్తోంది. అదే జరిగితే లోక్‌సభలో ఇప్పుడున్న 545 సీట్లు కాస్తా 848 సీట్లు అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందంటున్నారు నేతలు, కొందరు విశ్లేషకులు. జనాభా ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా లోక్‌సభ సీట్లు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళలో ఆ స్థాయిలో పెరగకపోవడం వల్ల జాతీయ స్థాయిలో మన వాయిస్ తగ్గిపోతుందని, ఉత్తరాది పెత్తనం పెరిగిపోతుందని, దీనిలో బీజేపీ కుట్ర కోణం దాగుందని కొందరు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారతం వాయిస్ బలహీనపడితే రాజకీయాల్లో, కేంద్ర పథకాల్లో మనకు నో చాయిస్, నో నాయిస్ అంటున్నారు మరికొందరు.
ఇప్పుడు లోక్‌సభలో ఉన్న సీట్లు 545. పునర్విభజన తర్వాత అవి 848కి చేరతాయంటున్నారు. దీనిలో కేవలం యూపీ, బీహార్‌కే 222 ఎంపీ సీట్లు వస్తాయని, మిగిలిన వాయవ్య, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు 461 సీట్లు వస్తాయంటున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాలు అన్ని కలిపి 165 సీట్లతో సర్దుకోవాల్సి వస్తుందంటున్నారు. ఇప్పుడున్న సీట్ల ప్రకారం అయితే లోక్‌సభలో దక్షిణాది వాటా దాదాపు 24 శాతం వరకు ఉంటుంది. డీ లిమిటేషన్ తర్వాత అది 19.5 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఢిల్లీ స్థాయిలో సౌత్ వాయిస్‌లో బేస్ తగ్గుతుందని, సంఖ్యాబలం తగ్గితే దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా పోరాడి కావాల్సినవి దక్కించుకోలేవని చెబుతున్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా?
కేంద్రం కేటాయించే నిధులు, పథకాల విషయంలో ఏపీ,తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల పొట్ట కొడతారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే విశ్లేషకులు మాత్రం ఈ వాదనలను కొట్టి పారేస్తున్నారు. అంతగా భయపడాల్సిన పని లేదని అభిప్రాయపడుతున్నారు.డీ లిమిటేషన్ చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, దక్షిణాది రాష్ట్రాల అనుమతి లేకుండా చేయలేరని విశ్లేషకులు భరోసా ఇస్తున్నారు. అయితే ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త పార్లమెంటులో చేసిన తొలి ప్రసంగం ద్వారా సంకేతం ఇచ్చారని మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు. డీ లిమిటేషన్ కేవలం జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాదికి అన్యాయం తప్పదంటున్నారు. మొత్తానికి ముందుముందు డీ-లిమిటేషన్ ప్రతిపాదనపై చర్చ మరింత ఉధృతంగా కొనసాగి రచ్చగా మారే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..