Ajit Pawar: ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా.. అంతుచిక్కని అజిత్ పవార్ రాజకీయం
మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత అజిత్ పవార్ చేస్తున్న ప్రకటనలు తికమకపెడుతున్నాయి. కొన్నిసార్లు తన మిత్రపక్ష పార్టీ నిర్ణయాలను ప్రశ్నిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాలపై..
మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత అజిత్ పవార్ చేస్తున్న ప్రకటనలు తికమకపెడుతున్నాయి. కొన్నిసార్లు తన మిత్రపక్ష పార్టీ నిర్ణయాలను ప్రశ్నిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాలపై పశ్చాత్తాపపడుతున్నారు. కొన్నిసార్లు ప్రత్యర్థి కూటమి మహా వికాస్ అఘాడీ (MVA)పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బారామతిలో సోదరి సుప్రియా సూలేపై తన భార్యను పోటీకి దింపిన అజిత్ పవార్ 2 నెలల తర్వాత తన నిర్ణయంపై విచారం వ్యక్తం చేశారు. తనకు తన సోదరీమణులంటే చాలా ఇష్టమని, వారందరితోనూ ప్రేమగా ఉంటానని చెబుతూ.. రాజకీయాలు ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉండాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు, తన సోదరిపై సునేత్రను రంగంలోకి దించి తప్పు చేశానన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక మర్మమేంటన్నది రాజకీయ వర్గాల్లో ఎవరికీ అంతుచిక్కడం లేదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని చీల్చి వేరుకుంపటి పెట్టుకున్న అజిత్ పవార్.. ఆ పార్టీ ఓటుబ్యాంకును ఆకట్టుకోవడం కోసం ఈ భావోద్వేగ ప్రకటనలు చేస్తున్నారా లేక ఆయన మనసు మార్చుకుని మళ్లీ పాత గూటికి తిరిగి వెళ్లే ఆలోచనలో ఉన్నారా అన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
గత ఏడాది జూలైలో అజిత్ పవార్ తన పెదనాన్న శరద్ పవార్‌తో విబేధించి పార్టీని రెండుగా చీల్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP), శివసేన (షిండే వర్గం) కలిపి ఏర్పాటు చేసిన మహాయుతి కూటమిలో చేరి రాష్ట్ర ప్రభుత్వంలో భాగమయ్యారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన ఎన్సీపీగా ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అధికారం కోసం పెదనాన్న నుంచి విడిపోయిన అజిత్ పవార్ ఈ మధ్య శరద్ పవార్ పట్ల కూడా మెతక వైఖరి ప్రదర్శించడం పలు సందేహాలకు తావిస్తోంది. శరద్ పవార్ సీనియర్ నాయకుడని, తన కుటుంబ పెద్ద అని, అందుకే ఆయన చేసే విమర్శలకు తాను స్పందించబోనని అన్నారు.
సీట్ల పంపకం, సర్దుబాటుపై చర్చలు?
సుప్రియా సూలే, శరద్ పవార్‌లపై అజిత్ పవార్ తాజా ప్రకటన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఇంకా ఏ కూటమిలోనూ చర్చలు కొలిక్కి రాలేదు. అయితే సీట్ల పంపకంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని అధికార కూటమి ‘మహాయుతి’, ప్రతిపక్ష కూటమి ‘మహా వికాస్ అఘాడీ’ పేర్కొంటున్నాయి. మహాయుతిలో బీజేపీ, శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) భాగస్వాములుగా ఉండగా, మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఉన్నాయి. రెండు కూటముల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధాన భాగస్వాములుగా ఉండగా, మిగతా రెండు పార్టీల చీలికలు చెరొక వర్గంలో ఉన్నాయి.
మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 80-90 స్థానాల్లో పోటీ చేయాలని అజిత్ భావిస్తున్నారు. అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా సీట్ల పంపకాలు జరగాలని, లోక్‌సభ ఎన్నికల మాదిరిగా చివరి నిమిషం వరకు జాప్యం చేసి ఇబ్బందుల్లోకి నెట్టవద్దని కోరారు. బీజేపీ, శివసేన (షిండే వర్గం) నుంచి ప్రతిఘటన ఎదురుకాకుండా.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త ఎన్సీపీ గెలిచిన 54 స్థానాల్లో పోటీ చేయాలని అజిత్ పవార్ భావిస్తున్నారు. వాటితో పాటు పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలుపొందిన మరో 20 స్థానాల్లో పోటీ చేయాలని అజిత్ పవార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిలో మైనారిటీ ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న ముంబైలోని 4-5 నియోజకవర్గాలు ఉన్నాయి. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీ తరఫున గెలిపించుకోవాలని చూస్తున్నారు. అజిత్ తన డిమాండ్లు ఏంటన్నది కూటమి పెద్దన్నకు స్పష్టంగా చెప్పారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అజిత్ పవార్ కోరినన్ని సీట్లు ఇచ్చే ఉద్దేశం బీజేపీకి కూడా లేదు. మరోవైపు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూడా 100 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. అయితే కూటమిలో ‘పెద్దన్న’గా ఉన్న బీజేపీ 160-170 స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో మూడు పార్టీల మధ్య సీట్ల సంఖ్య, సర్దుబాటు ఎలా కొలిక్కి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
అజిత్‌పై సంఘ్ అసంతృప్తి
మహాయుతిలో సీట్ల సమస్య మాత్రమే కాదు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కూడా అజిత్ పవార్ పట్ల సంతోషంగా లేదు. నాగ్‌పూర్‌లో జరిగిన సంఘ్, బీజేపీ సమన్వయ సమావేశంలో సంఘ్ నేతల అసంతృప్తి అంశం ప్రస్తావనకు వచ్చింది. అజిత్ పవార్‌ను ఎన్డీయేలోకి తీసుకోవడంపై సంఘ్ పెద్దలు ఇప్పటికే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్‌తో కలిసి పోటీ చేయడం వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని సంఘ్ అభిప్రాయపడింది. లోక్‌సభ ఎన్నికల్లో షిండేకు బీజేపీ ఓట్లు 89 శాతం బదిలీ అవ్వగా, షిండేకు నుంచి బీజేపీకి 88 శాతం ఓట్లు బదిలీ అయ్యాయని అంచనా వేస్తోంది. అదే బీజేపీ, అజిత్ పవార్‌ల ఓట్ల బదిలీ కేవలం 50 శాతం కంటే తక్కువే ఉందని సంఘ్ అధ్యయనాలు తేల్చాయి. అందుకే అజిత్ విషయంలో సంఘ్ అసహనాన్ని ప్రదర్శిస్తోంది.
రాజకీయ చతురతా.. అవకాశవాదమా?
అజిత్ పవార్ రాజకీయాల్లో నిష్ణాతుడు. ఎవరి చేయి ఎప్పుడు పట్టుకోవాలో, ఎప్పుడు వదలాలో తెలుసిన వ్యక్తి. తన పెదనాన్న శరద్ పవార్‌ను కలవరపెట్టడం ఆయనకు ఇష్టం లేదని, అలాగే బీజేపీతో విభేదాలు లేవని చెబుతున్నారు. మొత్తంగా గోడ మీద పిల్లి మాదిరిగా.. ఎటు కావాలంటే అటు దూకేందుకు అన్ని మార్గాలు తెరిచి పెట్టుకున్నారు. మహాయుతిలో ఉంటూనే తనకు మహావికాస్ అఘాడీ రూపంలో మరో అవకాశం కూడా ఉందని సంకేతాలు ఇస్తున్నారు. అయినప్పటికీ బీజేపీతో ఉండి తన పెదనాన్న శరద్ పవార్‌ను దెబ్బతీసానని కమలనాథులకు కూడా సందేశం ఇస్తున్నారు. సోదరి సుప్రియపై స్టేట్‌మెంట్ ఇవ్వడం ద్వారా అజిత్ ఎమోషనల్ కార్డ్ ప్లే చేస్తున్నారు. అయితే భావోద్వేగాలు రగిలించడం ఇదే ఆయనకు మొదటిసారి కాదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా ఆయన అదే పని చేశారు. శరద్ పవార్‌పై ఆయన భావోద్వేగ ప్రకటన చేశారు. అప్పుడు తన వయస్సు కూడా 60 ఏళ్లు పైనే అని చెబుతూ.. రాజకీయాల్లో 80 ఏళ్లు దాటినవారు విశ్రాంతి తీసుకుని తన తర్వాతి తరానికి అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించారు. “పవార్ సాహెబ్ మా ‘దైవత్’” (దేవుడు), ఇందులో ఎటువంటి సందేహం లేదు, కానీ 80 దాటిన తర్వాత ప్రతి వ్యక్తికి విశ్రాంతి అవసరం, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి” అంటూ ఆయన చేసిన ప్రకటన ఎన్సీపీ వర్గాల్లో పెద్ద చర్చకు ఆస్కారమిచ్చింది.
వక్ఫ్ బిల్లుపై అసంతృప్తి అజిత్ అసంతృప్తి
శరద్ పవార్, సుప్రియ సూలే పట్ల మృదువైన వైఖరితో ఉన్న అజిత్ పవార్, మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వక్ఫ్ బిల్లుపై ఆయన తాజాగా ఓ ప్రకటన ఇచ్చారు. వక్ఫ్ బోర్డు బిల్లులో ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరిగినా తమ పార్టీ అనుమతించబోదని అజిత్ పవార్ అన్నారు. “ఈ బిల్లుకు సంబంధించి మీకు (ముస్లింలకు) ఏమైనా ఆందోళనలుంటే, మీ సమస్యలను మేము వింటాం, మైనారిటీలకు అన్యాయం జరిగితే అనుమతించబోం” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తమ్మీద తికమక పెట్టే వైఖరితో అజిత్ పవార్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆయన ఏ గట్టున ఉంటారన్న విషయంపై అంచనాలు వేసుకుంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి