Z-MORH Tunnel: కాశ్మీర్ లోయలో మరో సొరంగం.. గేమ్ ఛేంజర్ కానున్న టన్నెల్ ప్రాజెక్ట్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 13న జెడ్ మోడ్ టన్నెల్‌ను ప్రారంభించనున్నారు. 8,500 అడుగుల ఎత్తులో ఉన్న, 6.5 కి.మీ పొడవైన వ్యూహాత్మక సొరంగం శ్రీనగర్-లేహ్ హైవేపై నిర్మించారు. అత్యంత శీతలమైన లడఖ్‌ను అన్ని సీజన్లలో సందర్శించదగిన ప్రదేశంగా మార్చడానికి మొదటి అడుగు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సోనామార్గ్ పట్టణానికి నిరంతరాయంగా కనెక్టివిటీని అందిస్తుంది.

Z-MORH Tunnel: కాశ్మీర్ లోయలో మరో సొరంగం.. గేమ్ ఛేంజర్ కానున్న టన్నెల్ ప్రాజెక్ట్!
Pm Modi On Z Morh Tunnel
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 10, 2025 | 11:17 PM

కాశ్మీర్ లోయలో చలికాలం కురిసే మంచు రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తుంది. లోయను దాటి ఎటు వెళ్లాలన్నా ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలను దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల్లో కొన్ని అడుగుల నుంచి మీటర్ల ఎత్తున కురిసే భారీ హిమపాతం రోడ్డు మార్గాలను పూర్తిగా మూసేస్తుంది. దీంతో కొన్ని నెలల పాటు ఆయా పర్వతాల మీదుగా సాగే ప్రయాణాలు నిలిచిపోతుంటాయి. పర్వత శ్రేణుల్లో నివసించే గ్రామాలు, పట్టణాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతుంటాయి. ఈ పరిస్థితిని నివారించాలంటే పర్వతాలను అడ్డంగా తొలుస్తూ సొరంగాలను నిర్మించాల్సిందే..!

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అదే పని చేస్తోంది. శ్రీనగర్‌ను రోడ్డు మార్గంలో నిరంతరం అనుసంధానించేందుకు అన్ని వైపులా టన్నెళ్లను నిర్మిస్తోంది. జమ్ము నుంచి శ్రీనగర్ చేరుకునే మార్గంలో చెనాని – నష్రి మధ్య నిర్మించిన డా. శ్యామప్రసాద్ ముఖర్జీ టన్నెల్, బనిహాల్ – ఖాజీగుండ్ రోడ్ టన్నెల్, జవహర్ టన్నెల్ పలు పర్వతాలను సునాయాసంగా దాటేలా చేస్తున్నాయి. చెనాని-నష్రి మధ్య టన్నెల్ నిర్మించకముందు పట్నిటాప్ మీదుగా సాగించే ప్రయాణానికి దూరాభారంతో పాటు చలికాలంలో హిమపాతం కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడితే తప్ప ఏ కాలంలోనైనా ప్రయాణం చేయడానికి వీలుంది. తాజాగా శ్రీనగర్‌కు బయటి ప్రపంచంతో రైలు మార్గం ద్వారా కనెక్టివిటీని కల్పించేందుకు చీనాబ్ నదిపై ఇంజనీరింగ్ అద్భుతంగా తీర్చిదిద్దిన ‘చీనాబ్ రైల్ బ్రిడ్జి’తో పాటు ఏకంగా 55 టన్నెళ్లను భారత ప్రభుత్వం నిర్మించింది. అతి త్వరలో శ్రీనగర్‌కు నేరుగా రైల్వే కనెక్టివిటీని కల్పిస్తూ ఈ మార్గాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

శ్రీనగర్ – కార్గిల్ మార్గంలో జెడ్-మోర్హ్ టన్నెల్

ఇదిలా ఉంటే… శ్రీనగర్‌ను మరోవైపు నుంచి లద్దాఖ్ ప్రాంతంలోని కార్గిల్, లేహ్ పట్టణాలతో అనుసంధానించే రోడ్డు మార్గంలోనూ పలు టన్నెళ్లను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. అందులో గండేర్‌బల్ జిల్లాలో నిర్మించిన జెడ్-మోర్హ్ (Z-MORH) టన్నెల్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ టన్నెల్ శ్రీనగర్ – సోనామార్గ్ మధ్య ప్రయాణదూరాన్ని తగ్గించడంతో పాటు హిమపాతం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సోనామార్గ్ పట్టణానికి నిరంతరాయంగా కనెక్టివిటీని అందిస్తుంది. హిందూ తీర్థయాత్రల్లో అత్యంత క్లిష్టమైన ‘అమర్‌నాథ్ యాత్ర’లో సోనామార్గ్ ఒక కీలక మజిలీ. బాల్తాల్ బేస్ క్యాంప్ చేరుకోవాలంటే సోనామార్గ్ పట్టణాన్ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. పైగా అమర్‌నాథ్ యాత్రలో హెలీకాప్టర్ ద్వారా వెళ్లేవారు సోనామార్గ్‌లోని హెలీప్యాడ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికంగానే కాదు, పర్యాటకంగానూ సోనామార్గ్ కీలక ప్రాంతం. అనేక అడ్వెంచర్ టూర్స్, మంచుపై క్రీడలు ఇక్కడ జరుగుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు.

ఆధ్యాత్మకం, పర్యాటకం కంటే కూడా భారత ప్రభుత్వానికి ఈ టన్నెల్ వ్యూహాత్మకంగా కీలకంగా మారనుంది. శ్రీనగర్ – లేహ్ మార్గంలో ఉన్న ద్రాస్, కార్గిల్ పట్టణాలకు చేరుకోవాలన్నా ఇదే మార్గం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సముద్రమట్టానికి 3,528 మీటర్ల (11,578 అడుగుల) ఎత్తున ఉన్న జోజిలా పాస్ మీదుగా ప్రయాణం సాగించాలి. హిమపాతం కారణంగా నవంబర్ నుంచి మే నెల వరకు జోజిలా పాస్ ప్రయాణం చేయడానికి వీల్లేగుండా మూసుకుపోతుంది. గతంలో కార్గిల్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడగా.. భారత్ ఏకంగా యుద్ధం చేయాల్సి వచ్చింది. శీతాకాలంలో తీవ్రంగా మంచు కురిసే సమయాన్ని ఆసరా చేసుకుని ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడులకు తెగబడ్డారు. ఒకవేళ కార్గిల్ ఉగ్రవాదుల హస్తగతమైతే.. శ్రీనగర్ – లేహ్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. అందుకే భారతదేశ రక్షణలో ఈ మార్గం కీలకం, వ్యూహాత్మకం. ఈ క్రమంలో శ్రీనగర్ – లేహ్ మార్గం (NH 1)లో ప్రతికూల వాతావరణం, తీవ్ర హిమపాతం సమయంలోనూ రవాణా వ్యవస్థకు విఘాతం కలుగకుండా ఉండేందుకు పలు సొరంగాలను భారత సర్కారు నిర్మిస్తోంది. ఇవి రవాణా వ్యవస్థతో పాటు రక్షణ వ్యవస్థకు కూడా కీలకంగా మారనున్నాయి. జోజిలా పాస్ కంటే ముందుగా వచ్చే జెడ్-మోర్హ్ టన్నెల్ నిర్మాణం పూర్తిచేసుకోగా, 14.2 కి.మీ పొడవుతో జోజిలా టన్నెల్ వడివడిగా నిర్మాణం జరుపుకుంటోంది. ఏడాది పొడవునా శ్రీనగర్ – లేహ్ మధ్య రాకపోకలు సాగించడంలో జోజిలా టన్నెల్‌తో పాటు జెడ్-మోర్హ్ టన్నెల్ కీలకమైనవి.

ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం

మొత్తం 6.5 కి.మీ పొడవైన జెడ్-మోర్హ్ టన్నెల్‌ను జనవరి 13న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 2,400 కోట్లు వెచ్చించింది. జమ్ము-కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో ద్రాస్, కార్గిల్ సెక్టార్లలో భద్రతా విధులు నిర్వహించే సైనికులకు సైతం ఈ టన్నెల్ కీలకంగా మారనుంది. ప్రధాని స్వయంగా టన్నెల్ ప్రాంతానికి చేరుకుని ప్రారంభించనున్నారు. ప్రధానితో పాటు ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హాజరుకానున్నారు. తొలుత ప్రధాని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని చర్చ జరిగింది. కానీ వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాజెక్టును మోదీ భౌతికంగా అక్కడికి చేరుకుని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..