Jammu Kashmir: ‘మోదీజీ.. మా స్కూల్‌ను బాగు చేయండి’ చిన్నారి విజ్ఞప్తిపై కదిలిన పాలనా యంత్రాంగం
జమ్మూకశ్మీర్‌లో కథువా జిల్లా లొహయ్-మల్హర్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ అనే 3వ తరగతి విద్యార్థిని గత వారం ప్రధాని మోదీకి పంపిన వీడియో సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మోదీజీ.. మా స్కూల్‌ను బాగు చేయండి, మా కోసం మంచి స్కూల్ బిల్డింగ్ కట్టించండి. దేశం మొత్తం చెప్పింది వినాలని.. నా విజ్ఞప్తి కూడా..
జమ్మూకశ్మీర్‌లో కథువా జిల్లా లొహయ్-మల్హర్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ అనే 3వ తరగతి విద్యార్థిని గత వారం ప్రధాని మోదీకి పంపిన వీడియో సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మోదీజీ.. మా స్కూల్‌ను బాగు చేయండి, మా కోసం మంచి స్కూల్ బిల్డింగ్ కట్టించండి. దేశం మొత్తం చెప్పింది వినాలి.. నా విజ్ఞప్తి కూడా ఆలకించండి. మురికిగా ఉన్న ఫ్లోర్‌పై కూర్చోవడంతో మా యూనిఫామ్స్‌కు మరకలంటుతున్నాయి. దీంతో అమ్మలు తరచూ మమ్మల్ని తిడుతున్నారు. ఏం చేస్తాం.. మా స్కూల్లో కూర్చోవడానికి కనీసం బెంచీలు కూడా లేవు’ అంటూ ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలపై, ప్రాథమిక సౌకర్యాలపై విద్యార్ధిని చేసిన విజ్ఞప్తిపై జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. దీంతో రోజుల వ్యవధిలోనే విద్యార్ధిని చదువుతున్న స్కూల్ రూపురేఖలు మారనున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూలోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిశంకర్ శర్మ ఆ పాఠశాలను సందర్శించారు.
పాఠశాలను ఆధునిక పద్ధతిలో అప్‌గ్రేడ్ చేయడానికి రూ. 91 లక్షల విలువైన ప్రాజెక్ట్ మంజూరు చేశారు. పరిపాలనా ఆమోదానికి సంబంధించిన కొన్ని సమస్యల కారణంగా పనులు నిలిచిపోయినా సత్వరమే అడ్డంకులు తొలగించారు. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిశంకర్ శర్మ పాఠశాలను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల్లో వందలాది పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలలన్నింటిలో సరైన మౌలిక సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం ఇప్పటికే ఒక వివరణాత్మక ప్రాజెక్ట్‌ను రూపొందించిందని ఆయన తెలిపారు. జమ్మూ ప్రావిన్స్‌లోని అన్ని జిల్లాల్లో 1,000 కొత్త కిండర్ గార్టెన్‌లను నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. రాబోయే మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో జమ్మూ ప్రావిన్స్‌లో 10 జిల్లాలో 250 కిండర్ గార్టెన్‌ల నిర్మాణాలను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.