Education: ఇకపై పుస్తకాలు చూసి పరీక్ష రాయొచ్చు.. ఎక్కడో, ఎందుకో తెలుసా?
ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కొన్ని సబ్జెక్టులకు పరిమితం చేస్తూ అమలు చేయనున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE) పరిధిలో 9, 10 తరగతులకు ఇంగ్లిష్, గణితం (Mathematics), సైన్స్ పరీక్షలను ఈ విధానంలో నిర్వహించనున్నారు. 11, 12 తరగతుల విద్యార్థులకు గణితం, బయాలజీ సబ్జెక్టులను ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానంలో నిర్వహించనున్నారు.
పరీక్షలు అంటేనే నేర్చుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకుని రాయడం.. అలా చేయలేనివారు దొంగచాటుగా పుస్తకాలు, స్లిప్పులు తీసుకొచ్చి చూసి రాస్తుంటారు. లేదంటే ఎదుటివారు రాసింది చూసి రాస్తుంటారు. ఈ తరహా కాపీయింగ్ నిబంధనలకు విరుద్ధం, అలాగే నేరంగానూ పరిగణిస్తారు. అలాంటి చర్యలకు పాల్పడే విద్యార్థులపై చర్యలు కూడా తీసుకోవచ్చు. అయితే రెగ్యులర్ పరీక్షా విధానంపై చాలా విమర్శలున్నాయి. ఇది కేవలం విద్యార్థి ‘జ్ఞాపకశక్తి’కి మాత్రమే పరీక్ష అని, ఆ విద్యార్థికి విషయం ఎంతమేర అర్థమయిందో తెలిసే అవకాశం ఉండదన్నది నిపుణుల మాట. చాలా మంది విద్యార్థులు ‘బట్టీ’ పట్టి మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చేసుకుంటారు. పరీక్షలు అయిపోగానే తాము ఏం చదివారో కూడా వారికి గుర్తుండదు. అదే సంబంధిత సబ్జెక్ట్‌ను ఇష్టంగా చదవి, లోతుపాతులు తెలుసుకుని, సందేహాలను అడిగి నివృత్తి చేసుకునేవారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘త్రీ ఇడియట్స్’ సినిమా చూసినవారికి ఈ తేడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే.. కేవలం జ్ఞాపకశక్తికి మాత్రమే కొలమానంగా ఉన్న నేటి పరీక్షా విధానాన్ని మార్చి ‘ఓపెన్ బుక్ ఎగ్జామ్’ విధానాన్ని తీసుకొచ్చేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కసరత్తు చేస్తోంది. ఈ విధానంలో విద్యార్థులు అవగతం చేసుకున్న విషయ పరిజ్ఞానం, విశ్లేషణాత్మక సామర్థ్యం, సృజనాత్మకతను తెలుసుకునే అవకాశం ఉంటుందని సీబీఎస్ఈ అంచనా వేస్తోంది.
ఇంతకీ ‘ఓపెన్ బుక్ ఎగ్జామ్’ అంటే ఏంటి?
ఓపెన్ బుక్ ఎగ్జామ్ (OBE) అంటే పుస్తకాలు చూసి పరీక్ష రాయడం. ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానంలో విద్యార్థులు పుస్తకాలు, నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ తీసుకుని పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చు. పరీక్ష రాసే సమయంలో వాటిని తిరగేసి చూసుకోవచ్చు. అదేంటి.. పుస్తకాలు చూసి పరీక్ష రాస్తే ఇక విద్యార్థి అసలు సామర్థ్యం ఎలా తెలుస్తుంది? అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. మనవాళ్లు చూసి రాయడంలో నేర్పరులు.. ప్రతి ఒక్కరూ మార్కులు, గ్రేడులు, ర్యాంకులు తెచ్చేసుకుంటారు అని అనుకుంటారు. కానీ చూసి రాయడం అంత సులభమైన ప్రక్రియేమీ కాదు అంటున్నారు నిపుణులు. ఇంకా చెప్పాలంటే చూడకుండా రాసే పరీక్ష కంటే ఇదే మరింత కఠినంగా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ పరీక్షల్లో విద్యార్థి జ్ఞాపకశక్తిని పరీక్షించడానికి బదులు.. ఆ సబ్జెక్ట్ విద్యార్థికి ఎంతమేర అర్థమైంది.. ఏ మేరకు విశ్లేషించగల్గుతున్నాడు.. కాన్సెప్ట్‌లను ఎలా అన్వయించగల్గుతున్నాడు అన్నది తెలుసుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు చూసి రాసేయడం కానేకాదు.
9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు
ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కొన్ని సబ్జెక్టులకు పరిమితం చేస్తూ అమలు చేయనున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE) పరిధిలో 9, 10 తరగతులకు ఇంగ్లిష్, గణితం (Mathematics), సైన్స్ పరీక్షలను ఈ విధానంలో నిర్వహించనున్నారు. 11, 12 తరగతుల విద్యార్థులకు గణితం, బయాలజీ సబ్జెక్టులను ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానంలో నిర్వహించనున్నారు. సాధారణ పరీక్షా విధానానికి భిన్నంగా విద్యార్థి జ్ఞాపకశక్తికి బదులుగా.. విద్యార్థి ఆలోచనాశక్తి, విశ్లేషణ సామర్థ్యం, విమర్శనాత్మక ధోరణి, సృజనాత్మకత, సమస్యల పరిష్కార సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ విధానం ద్వారా పరీక్ష రాయడానికి విద్యార్థులకు ఎంత సమయం పడుతుంది? ఎంతమేర ఇది విద్యార్థి ప్రతిభాపాటవాలను వెలికితీయగల్గుతుంది అన్న విషయాలను అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత దీన్ని మిగతా అన్ని తరగతులకు, అన్ని సబ్జెక్టులకు కూడా విస్తరించాలా.. వద్దా అన్నది నిర్ణయిస్తారు.
ఈ ఏడాది జూన్ నాటికి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీబీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ యూనివర్సిటీ సహాయం తీసుకోనుంది. ఎందుకంటే.. కోవిడ్-19 లాక్‌డౌన్ అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ తొలిసారిగా ఆగస్టు 2020లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేసింది. మార్చి 2022 వరకు ఈ విధానం కొనసాగినప్పటికీ, ఆ తర్వాత రెగ్యులర్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఢిల్లీ యూనివర్సిటీ పరీక్షల విభాగం ఉన్నతాధికారి అజయ్ అరోరా తెలిపారు. ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానానికి తగ్గట్టుగా టెక్స్ట్ బుక్‌లను కూడా తయారుచేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓ పరీక్షా విధానాన్ని అమలు చేసే ముందు ఉపాధ్యాయులే ఈ తరహాలో పరీక్షలు రాసి అవగాహన తెచ్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ విధానానికంటే ముందు 2014లో ఓపెన్ టెక్స్ట్ బేస్డ్ అసెస్మెంట్ (OTBA)ను సీబీఎస్సీ అమలు చేసింది. అయితే అప్పట్లో ఆ విధానంపై ప్రతికూల ప్రతిస్పందన వ్యక్తంకావడంతో మళ్లీ పాత విధానానికే మొగ్గు చూపింది. అయితే ఇప్పుడు నేషనల్ కర్రికులం ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఓపెన్ బుక్ ఎగ్జామ్ (OBE) విధానాన్ని తీసుకొస్తూ అమెరికా వంటి దేశాల్లో అమలవుతున్న విధానాలను, ప్రమాణాలను పాటించాలని చూస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు సఫలమై, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయాలు, పాఠశాలల యాజమాన్యాల నుంచి సానుకూల ప్రతిస్పందన వస్తే.. ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానం కొనసాగుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….