గన్‌తో కాల్చుకుని సీనియర్ IPS ఆఫీసర్ సూసైడ్.. సీనియర్ల వేధింపులే కారణం!
సీనియర్ ఐపీఎస్ అధికారి వై పురాన్ కుమార్ సూసైడ్ చేసుకున్నారు. తన నివాసంలో గన్‌తో కాల్చుకుని మంగళవారం (అక్టోబర్ 7) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరణానికి ముందు రాసిన 9 పేజీల సూసైడ్ నోట్ ఆయన జేబులో లభ్యమైంది. ఇందులో 12 మంది అధికారులు తనను మానసికంగా వేధింపులకు..

హర్యానా, అక్టోబర్ 9: హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి వై పురాన్ కుమార్ సూసైడ్ చేసుకున్నారు. తన నివాసంలో గన్‌తో కాల్చుకుని మంగళవారం (అక్టోబర్ 7) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరణానికి ముందు రాసిన 9 పేజీల సూసైడ్ నోట్ ఆయన జేబులో లభ్యమైంది. ఇందులో 12 మంది అధికారులు తనను మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపించారు. తన ఆస్తి మొత్తం భార్యకు బదిలీ చేస్తున్నట్లు సూసైడ్‌లో ఓ పేజ్‌లో రాశారు. ఈ కేసు హర్యానా రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో ఆయన భార్య ఐఏఎస్ అమ్నీత్ పి కుమార్.. హర్యానా డీజీపీ రోహ్తక్ ఎస్పీపై చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హర్యానా డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియా తన భర్తపై మానసిక వేధింపులు, కుల ఆధారిత వివక్ష, హింసకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. రోహ్తక్‌లో తన భర్తపై తప్పుడు అవినీతి కేసు నమోదు చేసి వేదింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. ఇది డీజీపీ శత్రుజీత్ కపూర్ ఆదేశాల మేరకు ఉద్దేశపూర్వక కుట్ర అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వల్ల తన భర్త తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. తన భర్త ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందినవాడు కాబట్టి కుల ఆధారిత వివక్షకు గురయ్యాడని, బహిరంగంగా అవమానించారని ఐఏఎస్ అమ్నీత్ పి కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక పురాన్ కుమార్ సూసైడ్ నోట్‌లో 7 నుంచి 8 మంది ఐపీఎస్‌లు, ఇద్దరు ఐఏఎస్ అధికారుల పేర్లను పేర్కొన్నారు. కుల ఆధారిత వివక్ష, ప్రభుత్వ వసతి నిరాకరణ, పనితీరు నివేదికలలో అవకతవకలు, నిరంతర ఒత్తిడి కారణంగా మానసికంగా బాధపడుతున్నానని పురాన్ కుమార్ అందులో పేర్కొన్నారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేశారు. ఫోరెన్సిక్ బృందం కీలక ఆధారాలను సేకరించింది. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని అందులోని విషయాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. అయితే సూసైడ్ నోట్‌లో పేర్కొన్న నిందితుల పేర్ల వివరాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








